CDSE (1) –2022: డిగ్రీతో... డిఫెన్స్ ఆఫీసర్
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారా.. లేదా చివరి సంవత్సరం చదువుతున్నారా.. సవాళ్లు స్వీకరించడమంటే ఇష్టమా.. సాయుధ దళాల్లో సుస్థిర కెరీర్ కోరుకుంటున్నారా..! అందుకు చక్కటి మార్గం.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్!! ఈ పరీక్షలో
విజయం సాధిస్తే.. త్రివిధ దళాల్లో ఉజ్వల భవిష్యత్ సొంతం చేసుకోవచ్చు. సమున్నత స్థానాలూ చేరుకోవచ్చు! అన్నింటికంటే ముఖ్యంగా దేశ రక్షణలో భాగస్వాములనే సంతృప్తి లభిస్తుంది. తాజాగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(1)–
2022కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. సీడీఎస్‌ఈ ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
- త్రివిధ దళాల్లో ఉద్యోగాల భర్తీకి సీడీఎస్ పరీక్ష
- ఎంపికైతే పర్మనెంట్ కమిషన్‌తో కొలువు ఖాయం
- శిక్షణ సమయంలోనే రూ.56,100 స్టైపెండ్
- సీడీఎస్‌ఈ(1)–2022 నోటిఫికేషన్ విడుదల
దేశంలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ల స్వప్నం సర్కారీ కొలువు. ఇందుకోసం లక్షల మంది ఏటా ఆయా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారీ కొలువు అనే స్వప్నమే కాకుండా.. సమాజంలో గౌరవంతోపాటు, దేశ సేవలో భాగస్వాములమవుతున్నామనే సంతృప్తిని అందిస్తుంది.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్.
త్రివిధ దళాల్లోని నాలుగు విభాగాల్లో ఆఫీసర్ కేడర్ పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే పరీక్ష సీడీఎస్‌ఈ. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో యూపీఎస్సీ ప్రతి ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది.
చదవండి: Indian Coast Guard Recruitment: టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హతతో 322 ఉద్యోగాలు
అయిదు అకాడమీలు, 341 పోస్ట్‌లు
- సీడీఎస్(1)–2022 ద్వారా త్రివిధ దళాలకు చెందిన నాలుగు అకాడమీల్లోని 341 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఆయా అకాడమీలు, పోస్ట్‌ల సంఖ్య వివరాలు..
ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్): 100;
ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమలా): 22;
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్): 32;
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(చెన్నై)(పురుషులు): 170;
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(చెన్నై)(మహిళలు): 17
అర్హతలు
- ఇండియన్ మిలిటరీ అకాడమీ:
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: జనవరి 2, 1999–జనవరి 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. - నేవల్ అకాడమీ:
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్/బీఈ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జనవరి 2, 1999–జనవరి 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. - ఎయిర్‌ఫోర్స్ అకాడమీ:
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్ చదివుండాలి.
వయో పరిమితి: జనవరి 2,1999–జనవరి 1, 2003 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ జారీచేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి రెండేళ్ల సడలింపు లభిస్తుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. - ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ:
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: జనవరి 2, 1998–జనవరి1, 2004మధ్య జన్మించి ఉండాలి. - ఆయా విద్యార్హత కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ఇప్పటి వరకు పూర్తయిన పరీక్షల్లో ఎలాంటి బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉండకూడదు. సీడీఎస్ కోర్సు ప్రారంభానికి ముందు ఉత్తీర్ణత పత్రాలు చూపించాల్సి ఉంటుంది.
- ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీలకు ఎంపికైన వారు జనవరి 1, 2023లోపు, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఎంపికైన వారు నవంబర్ 22, 2022 నాటికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది.
- ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌కు మొదట ప్రాధాన్యమిచ్చేవారు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ సమయానికి ప్రొవిజినల్ సర్టిఫికెట్ చూపించాలి. మహిళా అభ్యర్థులు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే అర్హులు.
రెండు దశల్లో ఎంపిక
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా త్రివిధ దళాల్లో ఆఫీసర్ కేడర్ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వీటిలో మొదటిది.. యూపీఎస్‌సీ నిర్వహించే సీడీఎస్ రాత పరీక్ష. ఇందులో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించి.. మెరిట్ జాబితాలో నిలిస్తే.. మలి దశలో ఆయా దళాలకు చెందిన సర్వీస్ సెలక్షన్ బోర్డ్‌ల ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియలోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే.. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న విభాగంలో కెరీర్ ఖాయం చేసుకోవచ్చు.
రాత పరీక్ష విధానం
సీడీఎస్‌ఈ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది. రాత పరీక్షలో రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు.
రాత పరీక్ష ఇలా
ఇండియన్ మిలిటరీ, నేవల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పరీక్ష వివరాలు
సబ్జెక్ట్ | వ్యవధి | మార్కులు |
ఇంగ్లిష్ | 2 గంటలు | 100 |
జనరల్ నాలెడ్జ్ | 2 గంటలు | 100 |
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ | 2 గంటలు | 100 |
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పరీక్ష
సబ్జెక్ట్ | వ్యవధి | మార్కులు |
ఇంగ్లిష్ | 2 గంటలు | 100 |
జనరల్ నాలెడ్జ్ | 2 గంటలు | 100 |
ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ
- రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. అన్ని అకాడమీల అభ్యర్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు ఈ టెస్ట్ జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి టెస్టులను 6 రోజులపాటు నిర్వహిస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 300. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా పలు రకాల పరీక్షలు, చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటి ద్వారా ఆఫీసర్ ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యాలున్న అభ్యర్థులను ఖరారు చేస్తారు.
- స్టేజ్–1లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే స్టేజ్–2కు అనుమతిస్తారు.
- స్టేజ్–1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్) టెస్ట్‌లు, స్టేజ్–2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్కులు, ఇంటర్వ్యూలు, కాన్ఫరెన్స్‌లు ఉంటాయి. వీటిని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు.
- ఆ తర్వాత వర్డ్ అసోసియేషన్ టెస్ట్(డబ్ల్యూఏటీ),సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ (ఎస్‌ఆర్‌టీ)ల ద్వారా విద్యార్థుల సమయస్ఫూర్తిని పరీక్షిస్తారు.
- చివరగా సెల్ఫ్ డిస్క్రిప్షిన్ టెస్ట్(ఎస్‌డీ)లో అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయుల గురించి రాయాలి. ఈ టెస్టుల తర్వాత రెండు రోజులపాటు 9 రకాల గ్రూప్ టాస్క్‌లు నిర్వహిస్తారు.
చదవండి: NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం
చివరగా ఇంటర్వ్యూ
సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ టెస్ట్‌లు పూర్తయ్యాక చివరగా.. బోర్డ్ ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడి ఆధ్వర్యంలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత కూడా చివరగా కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్యానెల్ ముందు అభ్యర్థులు
వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్ బ్రాంచ్ వారికి పీఏబీటీ ఉంటుంది. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సంపాధించుకున్న విద్యార్థులకు మరోసారి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
శిక్షణ.. స్టైపెండ్
- అన్ని దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. ఆయా విభాగాల్లో శిక్షణకు ఎంపికైన వారిని జెంటిల్‌మెన్ క్యాడెట్, లేడీ క్యాడెట్స్‌గా పిలుస్తారు. ఇలా శిక్షణ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్ అందిస్తారు. నిర్దేశిత వ్యవధిలో ఉండే శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్ట్‌నెంట్ హోదాలో పర్మనెంట్ కొలువు సొంతమవుతుంది.
- ఇండియన్ మిలిటరీ అకాడమీ(డెహ్రాడూన్)లో 18 నెలలు; నేవల్ అకాడమీలో సుమారు 17 నెలలు; ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 18 నెలలు; ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 11 నెలలు శిక్షణ ఉంటుంది.
- ఈ శిక్షణ పూర్తయ్యాక త్రివిధ దళాల్లో లెఫ్ట్‌నెంట్ హోదాలో కొలువు ఖాయం అవుతుంది.
- నేవీలో మాత్రం ప్రారంభంలో సబ్–లెఫ్ట్‌నెంట్ హోదా లభిస్తుంది.
- ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందిన వారు ప్రారంభంలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా విధులు చేపడతారు. ఇలా ఆయా హోదాల్లో ఆయా విభాగాల్లో అడుగుపెట్టిన వారు కొన్ని నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు.
విజయానికి వ్యూహాలు
సీడీఎస్‌ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
ఇంగ్లిష్
ఇంగ్లిష్ విభాగం 120 ప్రశ్నలతో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ భాషపై పట్టును, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్, ఆర్డరింగ్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్సెస్‌లో పదాల ఆర్డరింగ్, ప్యాసేజ్‌లు, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, క్టోజ్ టెస్టు, ఫిల్‌అప్స్, అనాలజీస్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, స్పాటింగ్ ద ఎర్రర్స్ విభాగాల్లో మార్కులు సాధించేందుకు గ్రామర్ రూల్స్ తెలుసుకోవాలి. అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కోసం సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ నాలెడ్జ్
అభ్యర్థుల్లో సామాజిక అంశాల పట్ల ఉన్న అవగాహనని పరీక్షించే విభాగం.. జనరల్ నాలెడ్జ్. ఇది 100 మార్కులకు 120 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ఇందులో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ
తదితర అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. డిఫెన్స్‌కు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు, ప్రాముఖ్యం ఉన్న అంశాలు, అవార్డులు, జాయింట్ మిలిటరీ ఎక్సెర్‌సెజైస్–అందులో పాల్గొన్న దేశాలు, ఆయా ఉమ్మడి సైనిక విన్యాసాల పేర్లు
మొదలైన వాటిని తెలుసుకోవడం మేలు. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్
ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మినహా మిగతా పోస్టులకు మ్యాథమెటిక్స్ విభాగం ఉంటుంది. 100 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. టైమ్ అండ్
డిస్టెన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా, లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగనోమెట్రీ, ఫ్యాక్టరైజేషన్ తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
సీడీఎస్ ద్వారా లభించే హోదాలు
- సీడీఎస్ పరీక్షలో విజయం సాధించిన వారికి త్రివిధ దళాల్లో లభించే హోదాలు, పదోన్నతుల వివరాలు..
- లెఫ్ట్‌నెంట్; కెప్టెన్; మేజర్; లెఫ్ట్‌నెంట్ కల్నల్; బ్రిగేడియర్; మేజర్ జనరల్; లెఫ్ట్‌నెంట్ జనరల్ హెచ్‌ఏజీ స్కేల్; ఆర్మీ కమొడోర్/లెఫ్ట్‌నెంట్ జనరల్.
సీడీఎస్‌ఈ(1)–2022 ముఖ్య తేదీలు
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 11, 2022
- దరఖాస్తు ఉప సంహరణ తేదీలు: జనవరి 18, 2022–జనవరి 24, 2022
- సీడీఎస్ రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 10, 2022
- వివరాలకు వెబ్‌సైట్: https://upsconline.nic.in, http://www.upsc.gov.in/
చదవండి: Defence Courses