NIMCET 2023 Notification: బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఎంసీఏ
- నిట్ క్యాంపస్‌లలో ఎంసీఏకు నిమ్‌సెట్
- తొమ్మిది క్యాంపస్‌లలో ప్రవేశ అవకాశం
- నిమ్‌సెట్–2023 ఎంపిక ప్రక్రియ ప్రారంభం
- జూన్ 11న జాతీయ స్థాయిలో పరీక్ష
నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) లు.. ఐఐటీల తర్వాత దేశంలో పేరున్న విద్యాసంస్థ లు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యతోపాటు ఎంసీఏ కోర్సును అందిస్తున్నాయి. నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్‌సెట్)లో స్కోర్ ఆధారంగా ప్రవేశంకల్పిస్తున్నాయి.
9 క్యాంపస్‌లు.. 813 సీట్లు
తొమ్మిది నిట్ క్యాంపస్‌ల్లో మొత్తం 813 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నిమ్‌సెట్ ద్వారా ప్రవేశం కల్పిస్తున్న నిట్ క్యాంపస్‌లు–సీట్ల వివరాలు: నిట్ అగర్తల–30 సీట్లు, ఎంఎన్‌ఎన్‌ఐటీ–అలహాబాద్–116, ఎంఏఎన్‌ఐటీ– భోపాల్–115, నిట్–జంషెడ్‌పూర్–115, నిట్–కురుక్షేత్ర–64, నిట్–కురుక్షేత్ర (సెల్ఫ్ ఫైనాన్స్)–32, నిట్–రాయ్‌పూర్–110, నిట్–సూరత్‌కల్–58, నిట్–తిరుచిరాపల్లి–115, నిట్–వరంగల్–58 సీట్లు.
అర్హత
- మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్‌గా 60 శాతం మార్కులతో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. అయితే వీరు సెప్టెంబర్ 15 నాటికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది.
చదవండి: NIMCET Notification 2023: నిమ్‌సెట్-2023 నోటిఫికేషన్ విడుదల
4 విభాగాలు–వేయి మార్కులు
- ఎన్‌ఐటీల్లో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నిమ్‌సెట్ మొత్తం నాలుగు విభాగాల్లో వేయి మార్కులకు జరుగుతుంది.
- మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలు–600 మార్కులు; అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ 40 ప్రశ్నలు–240 మార్కులు; కంప్యూటర్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు–120 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 10 ప్రశ్నలు–40 మార్కులకు ఇలా మొత్తం 120 ప్రశ్నలు–1000 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- మ్యాథమెటిక్స్ విభాగంలో ఒక్కో ప్రశ్నకు 12 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ విభాగం, కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు ఆరు మార్కులు; జనరల్ ఇంగ్లిష్ విభాగంలో ఒక్కో ప్రశ్నలకు నాలుగు మార్కులు చొప్పున కేటాయించారు.
- అదే విధంగా నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 శాతం మార్కులకు నెగెటివ్ మార్కులుగా నిర్దేశించారు.
- పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగుతుంది.
చదవండి: Higher Education: మ్యాథ్స్ కోర్సుల్లో మేటి.. సీఎంఐ!
టాప్ స్కోర్ సాధించేలా
ఎన్‌ఐటీ క్యాంపస్‌లలో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నిమ్‌సెట్‌లో మంచి స్కోర్ సాధించడానికి ఆయా సిలబస్ టాపిక్స్‌పై ప్రణాళికాబద్దంగా గట్టి పట్టు సాధించాలి.
మ్యాథమెటిక్స్
ఇందులో రాణించడానికి విద్యార్థులు తమ బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోని మ్యాథమెటిక్స్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా సెట్ థియరీ, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, అల్జీబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ, కాలిక్యులస్, వెక్టార్స్, ట్రిగ్నోమెట్రీలపై పూర్తి పట్టు సాధించాలి. వీటిలో సంబంధిత అంశాల కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సైంటిఫిక్ కంప్యూటర్ కాలిక్యులేటర్‌పై అవగాహన పెంచుకోవడం మేలు.
అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్
నిమ్‌సెట్‌లో మరో కీలక విభాగం..అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడిగే ఈ విభాగంలో రాణించాలంటే..అభ్యర్థులు విశ్లేషణ నైపుణ్యాలను, తార్కికంగా ఆలోచించే దృక్పథాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాల ద్వారా ప్రిపరేషన్ సాగిస్తూ ప్రాక్టీస్ చేయాలి. నిమ్‌సెట్ గత ప్రశ్న పత్రాల సాధన కూడా సానుకూల ఫలితానికి దోహదం చేస్తుంది.
కంప్యూటర్ అవేర్‌నెస్
కంప్యూటర్ బేసిక్ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌కు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా డేటా రిప్రజెంటేషన్ అంశాలపైనా పట్టు సాధించాలి.
జనరల్ ఇంగ్లిష్
ఇంగ్లిష్‌లో మంచి మార్కులు పొందడానికి కాంప్రహెన్షన్, వొకాబ్యులరీ, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం కాంపిటీటివ్ ఇంగ్లిష్ టెస్ట్ బుక్స్‌ను చదవడం ఉపకరిస్తుంది. వీటితోపాటు కాంప్రెహన్షన్ కోసం ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం కూడా లాభిస్తుంది.
ప్రాక్టీస్ ప్రధానం
నిమ్‌సెట్‌లో విజయానికి ప్రాక్టీస్ ఎంతో ప్రధానమని గుర్తించాలి. ప్రతి రోజు తాము చదివిన అంశాలకు సంబంధించి ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించి సెల్ఫ్ టెస్ట్‌లు రాసుకోవాలి. అదే విధంగా మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు రాయడం కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటివల్ల ఇంకా దృష్టి పెట్టాల్సిన అంశాల విషయంలో అవగాహన వచ్చి.. ప్రిపరేషన్‌పై మరింత స్పష్టత లభిస్తుంది.
చదవండి: Higher Education: ఐఐటీల్లో మెడిటెక్ కోర్సులు... ప్రయోజనాలు..
ఉమ్మడి కౌన్సెలింగ్
తొమ్మిది ఎన్‌ఐటీలు ఆన్‌లైన్ విధానంలో ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతాయి. అభ్యర్థులు నిమ్‌సెట్ ర్యాంకు ఆధారంగా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ దరఖాస్తు పూర్తి చేయాలి. ప్రాధాన్యతా క్రమంలో తమకు ఆసక్తి ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులకు వచ్చిన ర్యాంకు, ఎంచుకున్న ఇన్‌స్టిట్యూట్‌లు, అందుబాటులో ఉన్న సీట్లు ఆ«ధారంగా ఆన్‌లైన్‌లోనే సీట్ అలాట్‌మెంట్ చేస్తారు.
ఆ రెండు క్యాంపస్‌ల్లో ఎగ్జిట్ అవకాశం
నిట్‌లలో ఎంసీఏ కోర్సు వ్యవధిని మూడేళ్లుగా పేర్కొన్నారు. అయితే నిట్–వరంగల్, జంషెడ్‌పూర్ క్యాంపస్‌ల్లో మాత్రం ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంది. రెండేళ్ల వ్యవధి పూర్తి చేసుకున్నాక ఎగ్జిట్ ఆప్షన్ ఎంచుకున్న వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. అయితే అభ్యర్థులు తొలి రెండేళ్లు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
కొలువులు ఖరారు
నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు పూర్తి చేసుకుంటే.. భవిష్యత్తు అవకాశాలు ఉజ్వలంగా ఉంటాయనడంలో సందేహం లేదు. కోర్సు బోధనలో భాగంగా ఆయా నిట్‌లు అనుసరిస్తున్న ప్రమాణాలు, నాణ్యతే ఇందుకు కారణం. గత మూడేళ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఎన్‌ఐటీల్లో ఎంసీఏ పూర్తి చేసుకున్న వారిలో నూటికి తొంభై శాతం మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఖరారయ్యాయి. అదే విధంగా వేతనాలు కూడా సగటున రూ.ఆరు లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటున్నాయి.
నిమ్‌సెట్.. ముఖ్యాంశాలు
- నిమ్‌సెట్ స్కోర్ ఆధారంగా తొమ్మిది ఎన్‌ఐటీల్లో ఎంసీఏ కోర్సులో ప్రవేశం.
- అందుబాటులో 813 సీట్లు.
- బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో చేరే అవకాశం.æ
- ఎన్‌ఐటీ–వరంగల్, జంషెడ్‌పూర్ క్యాంపస్‌లలో రెండేళ్ల తర్వాత ఎగ్జిట్ అవకాశం.
- నిట్‌లలో ఎంసీఏ పూర్తి చేసిన వారికి ఆకర్షణీయ వేతనాలతో ఐటీ సంస్థల్లో క్యాంపస్ ఆఫర్స్.
- సగటున రూ. 8 లక్షల వార్షిక వేతనం లభిస్తున్న పరిస్థితి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 5 – ఏప్రిల్ 10, 2023
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: ఏప్రిల్ 13–ఏప్రిల్ 17, 2023
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: జూన్ 1 – జూన్ 11, 2023
- నిమ్‌సెట్ పరీక్ష తేదీ: జూన్ 11, 2023
- ఫలితాల వెల్లడి: జూన్ 26, 2023
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ
- వెబ్‌సైట్: https://www.nimcet.in