Skip to main content

Higher Education: మ్యాథ్స్‌ కోర్సుల్లో మేటి.. సీఎంఐ!

దేశంలో కొన్ని విద్యా సంస్థలు వినూత్నకోర్సులు అందిస్తుంటాయి. కొన్ని సబ్జెక్టుల కోసమే పలు ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. అలాంటి వాటిల్లో ఒకటి చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఐ). ఈ సంస్థ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌లో.. బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలతోపాటు ఎమ్మెస్సీ డేటాసైన్స్‌ కోర్సులను కూడా అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి ప్రస్తుతం ప్రకటన వెలువడింది. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ కల్పిస్తారు. పేద విద్యార్థులు ఫీజులో మినహాయింపుతోపాటు ప్రతిభావంతులైన విద్యార్థులు స్టైపెండ్‌ రూపంలో ఆర్థిక ప్రయోజనం కూడా పొందవచ్చు.
Chennai Mathematical Institute (CMI)
  • చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌
  • మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌లో బీఎస్సీ,ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ
  • రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ప్రవేశం

సీఎంఐ

మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌లో.. యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను పూర్తిచేయాలి, పరిశోధనల దిశగా అడుగులు వేయాలి అని భావించే వారికి చక్కటి వేదిక.. చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఐ). కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపాటు మరికొన్ని సంస్థలు దీనికి నిధులు అందిస్తున్నాయి. యూజీసీ 2006లో దీనికి యూనివర్సిటీ హోదాను కూడా కల్పించింది. దేశంలో ప్రసిద్ధ సంస్థలతోపాటు విదేశాల నుంచి సైతం నిపుణులు వచ్చి సీఎంఐ విద్యార్థులకు బోధిస్తారు. ఈ సంస్థలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు మెరుగైన పరిశోధన వనరులతో, ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది.

ప్రవేశాలు ఇలా

రాత పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగా సీఎంఐలో ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్‌ ఒలింపియాడ్‌ల్లో ప్రతిభ చూపినవారికి నేరుగా యూజీ కోర్సుల్లో అడ్మిషన్‌ లభిస్తుంది. పీజీ, పీహెచ్‌డీలకు ప్రవేశ పరీక్షలతోపాటు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీకి ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించరు. జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌(జెస్ట్‌) స్కోరుతో నేరుగా ఇంటర్వ్యూకి అవకాశం కల్పిస్తారు. అలాగే మ్యాథ్స్‌లో పీహెచ్‌డీ చేయాలనుకున్నవారు నేషనల్‌ బోర్డు ఫర్‌ హయ్యర్‌ మ్యాథమెటిక్స్‌ (ఎన్‌బీహెచ్‌ఎం) ఫెలోషిప్పునకు ఎంపికైతే.. పరీక్ష రాయకుండానే నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఇదే మాదిరిగా జస్ట్‌తో కంప్యూటర్‌ సైన్స్‌లో రీసెర్చ్‌ అర్హత పొందినవారు సైతం నేరుగా ఇంటర్వ్యూతో ప్రవేశం పొందవచ్చు.

కోర్సులు-అర్హతలు

  • కోర్సు-బీఎస్సీ ఆనర్స్‌: మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌; మ్యాథ్స్‌ అండ్‌ ఫిజిక్స్‌.
  • అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణులు, సెకండ్‌ ఇయర్‌ చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కోర్సు: ఎమ్మెస్సీ: మ్యాథ్స్, కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్‌. 
  • అర్హత: డిగ్రీలో మ్యాథ్స్‌ లేదా బీస్టాట్‌ లేదా బీటెక్‌ చదువుకున్నవారు ఎమ్మెస్సీ మ్యాథ్స్‌కు అర్హులు. కంప్యూటర్‌ సైన్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో బీఎస్సీ, బీటెక్‌ కోర్సులు ఉత్తీర్ణులైన వారు ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యంతో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చదివిన వారు ఎమ్మెస్సీ డేటాసైన్స్‌కు అర్హులు. సంబంధిత సబ్జెక్టులో ఫైనల్‌ ఇయర్‌ చదవుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
  • కోర్సు- పీహెచ్‌డీ: మ్యాథ్స్, కంప్యూటర్‌ సైన్స్, ఫిజిక్స్‌.
  • అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఫైనల్‌ ఇయర్‌ వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

TISSNET 2023 Notification: అవుతారా.. సామాజిక శాస్త్రవేత్త!

ప్రవేశ పరీక్ష విధానం

  • రెండు బీఎస్సీ కోర్సులకు కలిపి ఉమ్మడి పరీక్ష 100 పాయింట్లకు నిర్వహిస్తారు. పార్ట్‌ ఏ-40 పాయింట్లు, పార్ట్‌ బీ-60 పాయింట్లు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పార్ట్‌ ఏ స్క్రీనింగ్‌ పరీక్ష. ఇందులో కనీస పాయింట్లు సాధిస్తే పార్ట్‌ బీ మూ­ల్యంకనం చేస్తారు. రెండు విభాగాల్లో సాధించిన పాయింట్లతో తుది ఎంపిక చేస్తారు. పార్ట్‌ ఏలో 10ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దానికి 4పాయింట్లు. పార్ట్‌ బీలో 6ప్రశ్నలుంటాయి. వీటికి 60 పాయింట్లు కేటాయిస్తారు.ప్రశ్నలన్నీ ఇంటర్‌ స్థాయిలోని మ్యాథ్స్‌లో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, కాలిక్యులస్‌ విభాగాల నుంచి అడుగుతారు.
  • ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పరీక్షల్లోనూ రెండు పార్టులుంటాయి. పార్ట్‌ ఏలో కనీస మార్కులు సాధిస్తే, పార్ట్‌ బీ మూల్యాంకనం చేస్తారు. రెండు విభాగాల్లో సాధించిన మార్కులతో ప్రవేశం కల్పిస్తారు. ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెక్టుల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పాఠ్యాంశాల నుంచి వస్తాయి. ఎమ్మెస్సీ డేటాసైన్స్‌ ప్రశ్నలు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ నుంచి అడుగుతారు. పాత ప్రశ్నపత్రాలు, సొల్యూషన్లు సీఎంఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి, చదవాల్సిన అంశాలపై అవగాహన పొందవచ్చు.

ఫీజులు-ఫెలోషిప్‌

సీఎంఐ అందించే అన్ని కోర్సులు రెసిడెన్షియల్‌ వి«ధానంలో ఉంటాయి. ఇక్కడ అందించే కోర్సులకు ప్రతి సెమిస్టర్‌కు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. విద్యార్థులు ఎంపిక చేసుకునే కోర్సును బట్టి అన్ని కోర్సుల్లోనూ పూర్తిగా లేదా పాక్షికంగా ఫీజు మినహాయింపు లభిస్తుంది. అలాగే ప్రతిభావంతులకు యూజీ కోర్సులైతే ప్రతి నెల రూ.5000 ఫెలోషిప్‌ కింద చెల్లిస్తారు. ఎమ్మెస్సీ కోర్సులో చేరినవారికి నెలకు రూ.6000 అందిస్తారు. పీహెచ్‌డీ కోర్సులకు ఎంపికైన వారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000, ఆ తర్వాత మూడేళ్లు నెలకు రూ.35,000 చెల్లిస్తారు. పీహెచ్‌డీలో చేరి, క్యాంపస్‌లో వసతి సౌకర్యం పొందని వారు స్టైపెండ్‌లో 24శాతం హెచ్‌ఆర్‌ఏ పొందవచ్చు. వీరికి ఏటా బుక్‌ గ్రాంట్‌ రూ.10,000 ఇస్తారు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 09, 2023
  • అడ్మిట్‌ కార్డుల అందుబాటు: ఏప్రిల్‌ 30, 2023 నుంచి
  • పరీక్ష తేదీ: మే 07, 2023
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
  • వెబ్‌సైట్‌: https://www.cmi.ac.in/admissions/

TS ICET 2023 Notification: బెస్ట్‌ ర్యాంకుకు ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

Published date : 15 Mar 2023 07:38PM

Photo Stories