ICAR-AIEEA 2022: ఐకార్ కోర్సులు, పరీక్ష విధానం.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు..
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో కెరీర్ కోరుకునే.. బైపీసీ విద్యార్థులకు చక్కటి మార్గం.. ఐసీఏఆర్–ఏఐఈఈఏ! జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఎంట్రన్స్‌లో మంచి స్కోర్ సొంతం చేసుకుంటే..దేశంలోనే ఉత్తమమైన అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అడుగు పెట్టొచ్చు! వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి
కోర్సుల్లో చేరి.. విస్తృత నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు! ఆ తర్వాత ఉజ్వల కెరీర్ అవకాశాలు దక్కించుకోవచ్చు!! తాజాగా..2022–23 సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి.. ఐసీఏఆర్–ఏఐఈఈఏ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో... ఐసీఏఆర్–ఏఐఈఈఏతో ప్రవేశాలు కల్పించే కోర్సులు.. పరీక్ష విధానం.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ..
- ఉత్తమ అగ్రికల్చర్ వర్సిటీల్లో ప్రవేశానికి మార్గం ఐకార్ ఎంట్రెన్స్
- ఐసీఏఆర్–ఏఐఈఈఏ స్కోర్‌తో యూజీ, పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశం
- ఐసీఏఆర్ అనుబంధ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలకు ప్రామాణికం
- అగ్రి, అనుబంధ రంగాల్లో ఉజ్వల కెరీర్ అవకాశాలు
- ఐసీఏఆర్–ఏఐఈఈఏ 2022 ప్రక్రియ ప్రారంభం
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్.. సంక్షిప్తంగా ఐసీఏఆర్. ఐకార్‌గా సుపరిచితం. జాతీయ స్థాయిలో అగ్రికల్చర్, అనుబంధ కోర్సుల బోధనలో.. ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు. దేశ వ్యాప్తంగా ఐకార్ పరిధిలో ఉన్న యూనివర్సిటీలు, కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా విధానంలో.. యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్..ఐసీఏఆర్–ఏఐఈఈఏ (ఐసీఏఆర్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్). ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు వేర్వేరుగా ఎంట్రన్స్‌లు నిర్వహించి.. ప్రవేశాలు కల్పిస్తుంది.
చదవండి: Job Opportunities: అగ్రికల్చర్ కోర్సులు.. అందించేను అవకాశాలు
యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు
- బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.. ఈ మూడు కోర్సులకు వేర్వేరు విధానాల్లో ఆల్ ఇండియా కోటా అమలు చేస్తున్నారు. ఆ వివరాలు..
- ఐసీఏఆర్–ఏఐఈఈఏ(యూజీ): వ్యవసాయ, అనుబంధ కోర్సుల్లో జాతీయ స్థాయిలోని యూనివర్సిటీల్లో ఆల్ ఇండియా కోటా పేరుతో 15 శాతం సీట్లను ఐసీఏఆర్–ఏఐఈఈఏ(యూజీ) ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. ఈ ఏడాది ఈ మొత్తాన్ని 20 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధానంలో సీట్లు పొందిన విద్యార్థులకు నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సైన్స్ సబ్జెక్ట్స్ పేరుతో నెలకు రూ.మూడు వేల స్కాలర్‌షిప్ కూడా అందిస్తారు.
- ఐసీఏఆర్–ఏఐఈఈఏ(పీజీ): పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వ్యవసాయ కోర్సుల్లో.. దేశంలోని అన్ని యూనివర్సిటీలో 25శాతం సీట్లను ఈ ఎంట్రన్స్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఏడాది వీటిని మరో అయిదు శాతం పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఎంట్రన్స్‌లో టాప్–600( మొదటి ఆరు వందల మంది) జాబితాలో నిలిచి ఐసీఏఆర్ అనుబంధ అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారికి ఐసీఏఆర్–పీజీ స్కాలర్‌షిప్ పేరుతో నెలకు రూ.12,640 చొప్పున రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందిస్తారు. ఆరు వందలకు పైగా ర్యాంకు సాధించిన విద్యార్థులకు నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్ (పీజీ) పేరిట నెలకు రూ.అయిదు వేలు చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తారు.
- ఐసీఏఆర్–ఏఐఈఈఏ (పీహెచ్‌డీ): ఐసీఏఆర్ అనుబంధ సంస్థల్లో ఆల్ ఇండియా కోటాలో.. పీహెచ్‌డీ (డాక్టోరల్ ప్రోగ్రామ్స్) ప్రోగ్రామ్‌లలో 25 శాతం సీట్ల భర్తీకి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌కు కూడా ఆల్ ఇండియా కోటాను 30 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్ పేరుతో ఫెలోషిప్ అందిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ. 31 వేలు చొప్పున జేఆర్‌ఎఫ్‌ను, మూడో ఏడాది ఎస్‌ఆర్‌ఎఫ్ పేరుతో నెలకు రూ. 35వేలను ఫెలోషిప్‌గా అందిస్తారు. దీనికి అదనంగా ప్రతి ఏటా రూ. పది వేలు చొప్పున కాంటింజెంట్ గ్రాంట్‌ను అందిస్తారు.
ఐసీఏఆర్–ఏఐఈఈఏ(యూజీ)
- బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ఆల్ ఇండియా కోటాలో 15 శాతం సీట్ల భర్తీకి నిర్వహించే ఈ ఎంట్రన్స్ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.
- పరీక్ష మొత్తం మూడు విభాగాలుగా 150 ప్రశ్నలతో 600 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు.
- ఇంటర్మీడియెట్ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌ల ఆధారంగా ఈ మూడు విభాగాల సబ్జెక్ట్‌లు ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఈ మూడు విభాగాల నుంచే ప్రశ్నలు అడుగుతారు.
- అర్హత: బ్యాచిలర్ స్థాయిలో అందుబాటులో ఉన్న కోర్సులను అనుసరించి.. ఇంటర్మీడియెట్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ,ఎంబైపీసీ గ్రూప్‌లలో, ఇంటర్మీడియెట్‌లో అగ్రికల్చర్ కోర్సులో ఏదో ఒక గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- బ్యాచిలర్ స్థాయి కోర్సులు: ఐసీఏఆర్–ఏఐఈఈఏ ద్వారా ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో 11 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్; బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్; బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్, బీఎస్సీ(ఆనర్స్) ఫారెస్ట్రీ; కమ్యూనిటీ సైన్స్; ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్; బీఎస్సీ(ఆనర్స్) సెరికల్చర్; బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ
ఐసీఏఆర్–ఏఐఈఈఏ (పీజీ) ఇలా
- ఐసీఏఆర్ పీజీ పరీక్ష మొత్తం 120 ప్రశ్నలతో 480 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
- అర్హత: 10+6 విధానంలో బీఎస్సీ అగ్రికల్చర్/10+2+5 లేదా 10+2+5 1/2 విధానంలో (బీవీఎస్సీ, అండ్ ఏహెచ్)/డిగ్రీ ప్రోగ్రాంలలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది.
- పీజీ కోర్సులు ఇవే: ప్రస్తుతం అందుబాటులో ఉన్న పీజీ కోర్సులను పరిశీలిస్తే.. ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్, ఫిజికల్ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, అగ్రి–బిజినెస్ మేనేజ్‌మెంట్, స్టాటిస్టికల్ సైన్స్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ/ఆగ్రో ఫారెస్ట్రీ అండ్ సివి కల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వాటర్ సైన్స్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, ఆగ్రోనమీ, ఫిషరీస్ సైన్స్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, హోంసైన్స్, సోషల్ సైన్స్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఐసీఏఆర్–ఏఐఈఈఏ(పీహెచ్‌డీ)
- ఐసీఏఆర్–జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్(పీహెచ్‌డీ) పరీక్షను పార్ట్–ఎ, పార్ట్–బి, పార్ట్–సి పేరుతో మూడు భాగాల్లో నిర్వహిస్తారు.
- పార్ట్–ఎ నుంచి 20 ప్రశ్నలు, పార్ట్–బి నుంచి 50 ప్రశ్నలు,పార్ట్–సి నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి.
- 120 ప్రశ్నలకుగాను 480 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా.. క్రాప్‌సైన్స్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్–1, డెయిరీసైన్స్, డెయిరీ టెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, హోంసైన్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్,అగ్రికల్చరల్ ఎకానమి అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్,ఫిషరీ సైన్స్ సబ్జెక్ట్‌లలో వివిధ స్పెషలైజేషన్లలో పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు.
- అర్హత: అభ్యర్థులు పీహెచ్‌డీలో ఎంపిక చేసుకున్న విభాగానికి సంబంధించి పీజీ స్థాయిలో ఆ సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
ఆన్‌లైన్‌లో ప్రవేశం
మూడు స్థాయిల కోర్సులకు సంబంధించి అభ్యర్థులు ఆయా ఎంట్రన్స్‌లలో పొందిన మా ర్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి.. ఆన్‌లైన్‌లో సీట్ల కేటాయింపు చేస్తారు. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో 2,879 సీట్లు, పీజీ స్థాయిలో 3,119 సీట్లు, పీహెచ్‌డీ స్థాయిలో 1,350 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఐసీఏఆర్–ఏఐఈఈఏ (యూజీ, పీజీ, పీహెచ్‌డీ) ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జూలై 20–ఆగస్ట్ 19
- దరఖాస్తుల సవరణ: ఆగస్ట్ 21 – ఆగస్ట్ 23
- పరీక్ష తేదీలు:సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల,చిత్తూరు,గుంటూరు,కాకినాడ,కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
- వెబ్‌సైట్: https://icar.nta.ac.in
ఉజ్వల కెరీర్ అవకాశాలు
వ్యవసాయ విద్యను అభ్యసించిన వారికి కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో వ్యవసాయ పంటల అమ్మకాలు, మార్కెటింగ్, రవాణా, సేవలు, నిల్వ, గిడ్డంగులు మొదలైన వాటిల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అగ్రికల్చర్ అనుబంధ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ కొలువులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ వంటి కొలువులు సొంతం చేసుకోవచ్చు.
ఐసీఏఆర్–ఏఐఈఈఏ ముఖ్యాంశాలు
- ప్రస్తుతం జాతీయ స్థాయిలో 74యూనివర్సిటీలు, నాలుగు ఐసీఏఆర్ డీమ్డ్ యూనివర్సిటీలు, మూడు సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, నాలుగు సెంట్రల్ యూనివర్సిటీల్లో అమలవుతున్న ఏఐఈఈఏ ఆల్ ఇండియా కోటా.
- ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా అగ్రి యూనివర్సిటీస్‌లో ప్రవేశం. కోర్సులు పూర్తి చేసుకున్నాక ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లో పలు కెరీర్ అవకాశాలు.
- కోర్సు చదివే సమయంలో స్కాలర్‌షిప్ సదుపాయం.