Skip to main content

SBI PO 2021: ఎస్‌బీఐలో పీవో కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

బ్యాంకు కొలువుల అభ్యర్థులకు తీపి కబురు! దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. రెండువేలకు పైగా ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతోనే ఎస్‌బీఐ పీవో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడంచెల ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనంతోపాటు బ్యాంకింగ్‌ రంగంలో ఉజ్వల కెరీర్‌ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ పీవో పోస్ట్‌ల వివరాలు, ఎంపిక విధానం, కెరీర్‌ స్కోప్, ప్రిపరేషన్‌ గైడెన్స్‌పై ప్రత్యేక కథనం...
SBI PO 2021 notification released
SBI PO 2021 notification released
  • 2056 పీవో పోస్ట్‌ల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్‌
  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు
  • మూడంచెల ఎంపిక ప్రక్రియ ద్వారా పోస్టుల భర్తీ  
  • ఎంపికైతే ప్రారంభంలోనే బేసిక్‌ పే రూ.41,960

ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర భవిష్యత్తుకు భరోసా కల్పించే రంగం బ్యాంకింగ్‌. ఎస్‌బీఐ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులో కొలువు సాధిస్తే.. కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు. ఎస్‌బీఐ ప్రతి ఏటా క్రమం తప్పకుండా పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. తాజాగా 2056 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన ఇచ్చింది. 

మొత్తం 2056 పోస్ట్‌లు
ఎస్‌బీఐ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం–మొత్తం 2056 పీవో పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. ఇందులో 56 బ్యాక్‌లాగ్‌ ఖాళీలుగా పేర్కొంది.

అర్హతలు
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
వయోపరిమితి: ఏప్రిల్‌ 1, 2021 నాటికి 21–30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

వేతనం
ప్రారంభంలో బేసిక్‌ పే రూ.41,960 అందుతుంది. జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌–1లో రూ.36,000–రూ.63,840 వేతన శ్రేణి లభిస్తుంది. వీటితోపాటు నిబంధనల మేరకు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. 

ఎంపిక విధానం
ఎస్‌బీఐ పీవో ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగనుంది. అవి.. ఫేజ్‌–1(ప్రిలిమినరీ పరీక్ష), ఫేజ్‌–2(మెయిన్‌ ఎగ్జామినేషన్‌), ఫేజ్‌–3(ఇంటర్వూ్వ/గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్‌). 

ఫేజ్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ఇలా
ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో వంద ప్రశ్నలు–వంద మార్కులకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి విభాగానికి పరీక్ష సమయం 20 నిమిషాలు. అంటే.. మొత్తంగా ప్రిలిమినరీ పరీక్షకు ఒక గంట సమయం కేటాయించారు. 

ఫేజ్‌–2 మెయిన్‌ ఎగ్జామినేషన్‌
ఎంపిక ప్రక్రియలో రెండో దశ(ఫేజ్‌–2).. మెయిన్‌ ఎగ్జామినేషన్‌. ప్రిలిమినరీ పరీక్షలో చూ పిన ప్రతిభ ఆధారంగా.. మొత్తం ఖాళీలను పరిగణనలోకి తీసుకొని.. ఒక్కో పోస్ట్‌కు పది మంది(1:10 నిష్పత్తిలో)ని మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షలో 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో; 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 45ప్రశ్నలు–60 మార్కులు, డేటా అనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 ప్రశ్నలు–60 మార్కులు, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలు–40 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు కేటాయించిన మొత్తం సమయం మూడు గంటలు. 

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ కూడా
మెయిన్‌ పరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్‌ పరీక్షతోపాటు 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్‌పై అభ్యర్థికి ఉన్న పట్టును పరిశీలించే పరీక్ష. ఇందులో లెటర్‌ రైటింగ్‌ లేదా ఎస్సే రైటింగ్‌ ఉంటుంది. పరీక్ష సమయం 30నిమిషాలు. అభ్యర్థులు కంప్యూటర్‌పైనే తమ సమాధానాలు టైప్‌ చేయాల్సి ఉంటుంది. 

నెగెటివ్‌ మార్కింగ్‌
ప్రిలిమ్స్, మెయిన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/4 మార్కులను తగ్గిస్తారు. 

ఇంటర్వ్యూ, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌
పీవో పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో చివరి దశ.. పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌. మెయిన్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ముగ్గురి(1:3 నిష్పత్తి) చొప్పున ఫేజ్‌–3కు ఎంపిక చేస్తారు. మొత్తం 50 మార్కులకు నిర్వహించే చివరి దశ ఎంపిక ప్రక్రియలో.. పర్సనల్‌ ఇంటర్వ్యూకు 30 మార్కులు, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు ఉంటాయి. ప్రస్తుత కరోనా పరిస్థితులు, సోషల్‌ డిస్టెన్సింగ్‌ నిబంధల కారణంగా పర్సనల్‌ ఇంటర్వ్యూనే మొత్తం 50 మార్కులకూ నిర్వహించే అవకాశం కూడా ఉందని ఎస్‌బీఐ పేర్కొంది.

గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ అంటే
గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఎంపికైన అభ్యర్థులను బృందాలుగా విభజిస్తారు. ఒక్కో బృందంలో గరిష్టంగా అయిదుగురు ఉండేలా చూస్తారు. ఇలా బృందాలుగా ఏర్పాటు చేసి.. నిర్దిష్టంగా ఒక అంశాన్ని పేర్కొని.. దానికి అభ్యర్థుల అభిప్రాయం లేదా సమాధానాన్ని అడుగుతారు. అభ్యర్థుల్లోని సామాజిక అంశాల అవగాహన, టీమ్‌ స్కిల్స్‌ వంటి వాటిని పరిశీలిస్తారు.

తుది జాబితా ఇలా

  • రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్, చివరి దశ (ఫేజ్‌–3) పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్‌లలో చూపిన ప్రతిభ ఆధారంగా.. నిర్దిష్ట అర్హత మార్కులను, ఖాళీలను, రిజర్వేషన్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. తుది విజేతలను ప్రకటిస్తారు. ఈ జాబితాలో నిలిస్తే ఎస్‌బీఐలో పీవోగా కొలువుదీరినట్లే!
  • తుది ఎంపికలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తున్నారు. మెయిన్‌ పరీక్షలో మొత్తం 250 మార్కులకు 75 శాతం వెయిటేజీ; చివరి దశలోని గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలో మొత్తం 50 మార్కులకు 25శాతం వెయిటేజీ ఇస్తారు. ఇలా వంద మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కులను క్రోడీకరించి.. తుది విజేతలను నిర్ణయిస్తారు.


విజయం సాధించాలంటే

  • ఎంపిక ప్రక్రియలో విజయం సాధించడానికి అభ్యర్థులకు తగినంత సమయం అందుబాటులో ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విజయావకాశాలు మెరుగు పరచుకోవచ్చు.
  • ఎస్‌బీఐ పీఓ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు పటిష్ట ప్రిపరేషన్‌ ప్రణాళికను అనుసరించాలి. తొలుత ప్రిలిమ్స్, మెయిన్‌లో ఉన్న ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటికి ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి. దీంతో ఒకే సమయంలో రెండు దశలకు సన్నద్ధత లభిస్తుంది. ముఖ్యంగా రెండు దశల్లోనూ ఉన్న ఇంగ్లిష్, రీజనింగ్‌లకు కామన్‌ ప్రిపరేషన్‌ కలిసొస్తుంది. 
  • రీజనింగ్‌కు సంబంధించి ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. విశ్లేషణ సామర్థ్యం, తార్కికత్వం పెంచుకునే విధంగా కృషి చేయాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌పై గట్టి పట్టు సాధించాలి. 
  • డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. దీనికోసం కాలిక్యులేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.
  • జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి ఇటీవల కాలంలో దేశ ఆర్థిక రంగ పరిణామాలు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి.
  • ఇంగ్లిష్‌ కోసం బేసిక్‌ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకునే దిశగా కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌కు సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.
  • ఇంటర్వ్యూలో రాణించడానికి  అభ్యర్థులు  బ్యాంకింగ్‌ రంగంలో తాజా పరిణామాలపై అవగాహనతోపాటు ఇంగ్లిష్‌ స్పీకింVŠ  ప్రాక్టీస్‌ చేయడం మేలు చేస్తుంది. 
  • గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్‌ కోసం సామాజిక అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఇందుకోసం దినపత్రికల్లోని ఎడిటోరియల్స్‌ చదవాలి.
  • ఎస్‌బీఐ పీవో పరీక్షల అభ్యర్థులు ప్రిపరేషన్‌లో భాగంగా ప్రాక్టీస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. విజయంలో ప్రాక్టీస్‌ ఎంతో కీలకంగా నిలుస్తుంది.

 
కెరీర్‌ స్కోప్‌

  • పీవోగా ఎంపికైన వారికి రెండేళ్ల శిక్షణ తర్వాత స్కేల్‌–1 హోదా లభిస్తుంది. శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షలో ప్రతిభ చూపితే నేరుగా స్కేల్‌–2 కేడర్‌ సొంతం చేసుకోవచ్చు.
  • స్కేల్‌–2: ఈ హోదాలో డిప్యూటీ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించాలి.
  • స్కేల్‌–3: ఇది మేనేజర్‌ స్థాయి హోదా
  • స్కేల్‌–4: చీఫ్‌ మేనేజర్‌
  • స్కేల్‌–5: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌
  • స్కేల్‌–6: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌
  • స్కేల్‌–7: జనరల్‌ మేనేజర్‌
  • ప్రతి స్కేల్‌కు పదోన్నతి లభించేందుకు మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. పదోన్నతి ఇచ్చే క్రమంలో ఎస్‌బీఐ అంతర్గత పరీక్షలు నిర్వహిస్తుంది.
  • పీవోగా ఎంపికైన వారిలో దాదాపు అందరూ స్కేల్‌–7 స్థాయికి చేరుకుంటారు.
  • విధుల నిర్వహణలో అసాధారణ ప్రతిభ చూపితే పైన పేర్కొన్న ఏడు స్కేల్స్‌ దాటి టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌ హోదాలు సొంతం చేసుకోవచ్చు.
  • టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌లో లభించే హోదాలు: చీఫ్‌ జనరల్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్, మేనేజింగ్‌ డైరెక్టర్, చైర్‌ పర్సన్‌.


ఎస్‌బీఐ పీవో నోటిఫికేషన్‌ సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ:25.10.2021
ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్‌) తేదీలు: నవంబర్‌/డిసెంబర్‌ 2021
మెయిన్‌ ఎగ్జామినేషన్‌ (ఆన్‌లైన్‌) తేదీలు: డిసెంబర్‌ 2021
మెయిన్‌ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2022 
జీడీ/పీఐ నిర్వహణ తేదీ: ఫిబ్రవరి, 2022 రెండో/మూడో వారం
తుది ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి/మార్చి,2022

వివరాలకు వెబ్‌సైట్‌: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers

చ‌ద‌వండి: Actuarial Science: ఆకర్షణీయ కెరీర్‌.. యాక్చూరియల్‌ సైన్స్‌

Published date : 18 Oct 2021 07:32PM

Photo Stories