Skip to main content

After Inter: సరైన కెరీర్‌కు సోపానాలు..

Career Opportunities and Courses After Inter(12th)
Career Opportunities and Courses After Inter(12th)

ఇంజనీరింగ్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ వరకు.. అన్నీ హాట్ కోర్సులుగా, కెరీర్ డెస్టినేషన్‌‌సగా నిలుస్తున్నాయి..21వ శతాబ్దంలో ఏ రంగం చూసినా అవకాశాల హారమే..కావల్సిందల్లా సరైన కెరీర్ ప్లానింగ్.. ఆపైన సబ్జెక్ట్ నాలెడ్‌‌జతోపాటు స్కిల్స్..ఇంటర్మీడియెట్, పదో తరగతి పూర్తిచేసుకుంటున్న విద్యార్థుల భవిష్యత్ కెరీర్ ఎంపికకు ఇదే సరైన సమయం..ఈ దశలో సముచిత నిర్ణయం తీసుకోవాలి. సరితూగే కెరీర్ విషయంలో జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇంటర్ , పదోతరగతి తర్వాత కోర్సు ఎంపికలో, కెరీర్ సెలక్షన్‌లో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు మీ కోసం...
 

  1. ఆసక్తి
    కెరీర్ ప్రణాళికలో తొలి ప్రామాణికం.. వ్యక్తిగత ఆసక్తి. కెరీర్, కోర్సు ఎంపిక పరంగా అత్యంత ప్రధానమైన అంశమిది. ఆసక్తి లేకుండా కోర్సులో అడుగుపెడితే ఆశించిన ఫలితం అందుకోవడం కష్టం. సంపద్రాయ సంగీతం నుంచి సాఫ్ట్‌వేర్ రంగం వరకూ.. ప్రస్తుతం అన్ని రంగాలు బెస్ట్ డెస్టినేషన్స్‌గా నిలుస్తున్నాయి. కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ‘క్రేజీ కెరీర్’ అనే కోణానికే పరిమితం కాకుండా.. ఆసక్తి మేరకు కోర్సును ఎంచుకోవచ్చు. అదే ఆసక్తితో ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు. ఆసక్తి, ఇష్టం ఉంటే ఎంతటి క్లిష్టమైన సబ్జెక్టునైనా ఇట్టే ఒక పట్టుపట్టొచ్చు. లోతైన అధ్యయనంతో విషయాన్ని ఆకళింపు చేసుకొంటూ, పాషన్‌తో పనిచేస్తూ ఉన్నత స్థానాలు అందుకోవచ్చు. తమ తమ రంగాల్లో అత్యున్నత శిఖరాలు చేరుకున్న వారిని అడిగితే.. ఆయా పని పట్ల ఇష్టం ఉండ టం వల్లే అలుపుసొలుపూ లేని పనితీరుతో ముందుకుసాగిన ట్లు చెబుతారు. కాబట్టి కోర్సు, కెరీర్ ఎంపికలో ఆసక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
  2. ఆప్టిట్యూడ్
    కెరీర్ ఎంపిక విషయంలో ఆప్టిట్యూడ్‌ను పరిగణనలోకి తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. కొంతమంది విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే వారి దృక్పథం వారి చర్యల ద్వారా కనిపిస్తుంది. ఉదాహరణకు కొంతమంది పిల్లలు ఇంట్లో సైకిల్‌నో, స్కూటర్‌నో బాగు చేయడంలో ఆసక్తి చూపుతుంటారు. మరికొంత మంది ఇంట్లోని ఎలక్ట్రికల్ బోర్డులను, పాత రేడియోలు కనిపిస్తే విప్పి పరిశీలిస్తుంటారు. ఇంకొందరు తెల్లకాగితం కనిపిస్తే చాలు ఏదో ఒక బొమ్మ గీయడం చేస్తుంటారు. ఇలాంటి చర్యలు వారి దృక్పథాన్ని, సహజ ఆసక్తిని, ఆ పని చేయగలిగే సామర్థ్యాన్ని తెలియజేస్తుంటాయి. అంతేకాకుండా కొంతమంది విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే ఇంజనీరింగ్ చదవాలి లేదా డాక్టర్ కావాలి అనే స్పష్టమైన దృక్పథం ఉంటుంది. అలాంటి వారి విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. కానీ ఆప్టిట్యూడ్‌ను బహిర్గతం చేయలేని విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నో మార్గాల ద్వారా విద్యార్థుల ఆప్టిట్యూడ్‌ను తెలుసుకునే సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వినియోగించుకోవాలి.
  3. అభ్యసన సామర్థ్యం
    అభ్యసన సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం కూడా కెరీర్ ప్రణాళిక రూపకల్పనలో ముఖ్యమైన అంశం. ఇందుకోసం రెండు విషయాలను బేరీజు వేసుకోవాలి. అవి థియరీ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు దీన్ని మరింత బాగా అనుసరించాలి. మ్యాథమెటిక్స్, సైన్స్ వంటి కోర్సుల్లో ప్రాక్టికల్ అప్రోచ్‌దే ప్రాధాన్యం. హిస్టరీ, ఎకనామిక్స్, ఇతర సోషల్ సెన్సైస్ విషయంలో థియరీ నైపుణ్యాలు లాభిస్తాయి. విద్యార్థులు తమకు ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ నైపుణ్యం ఉందో గుర్తించి ఆ మేరకు ఇంటర్మీడియెట్‌లో గ్రూప్, ఆపై సంబంధిత కెరీర్ దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ అభ్యసన సామర్థ్యాలను తెలుసుకునేందుకు హై స్కూల్ స్థాయిలో ఆయా సబ్జెక్ట్‌ల్లో చూపిన ప్రగతిని ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ క్రమంలో ఉపాధ్యాయులతో మాట్లాడి తమ పిల్లల అభ్యసన సామర్థ్యం తెలుసుకోవడం మరింత ఉపకరించే అంశం.
  4. ఆర్థిక అంశాలు
    కెరీర్ ఎంపికలో ఆర్థిక అంశాలను అంటే తమ కుటుంబ ఆర్థిక స్థితిని, ఎంచుకునే కోర్సులకు అయ్యే వ్యయ మొత్తాలను బేరీజు వేసుకోవడం కూడా ముఖ్యమే. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేయాలి. ఇతరులతో పోల్చుకోవడం సరికాదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సులకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు వార్షిక ఫీజు చెల్లించాల్సిన స్థాయిలో ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ ఫీజులు చెల్లించాల్సిన ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే మంచివనే ఆలోచన కూడా సరికాదు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం స్వీయ సామర్థ్యం. అది ఉంటేనే లక్షల మొత్తాల్లో ఫీజు చెల్లించాల్సిన ఇన్‌స్టిట్యూట్‌లైనా, సాధారణ ఇన్‌స్టిట్యూట్‌లలోనైనా విద్యార్థులు రాణించగలరు. ఇదే సమయంలో విద్యార్థులకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు బ్యాంకు రుణాలు, స్కాలర్‌షిప్స్ వంటి సదుపాయాలు లభిస్తున్నాయి. అయితే తాము ఎంపిక చేసుకునే కోర్సుకు రుణాలు, స్కాలర్‌షిప్స్ పరంగా ఉన్న అవకాశాల గురించి ముందుగానే తెలుసుకుని ఆ మేరకు ముందుకు సాగాలి.
  5. ఉపాధి వేదికలు
    కోర్సు, కెరీర్ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత ఉపాధి వేదికల పరంగానూ ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవడం మేలు. మార్కెట్ డిమాండ్, పే ప్యాకేజ్ వంటి వాటి కోణంలో ఒక కోర్సును ఎంపిక చేసుకుంటే.. సంబంధిత రంగంలో భవిష్యత్తు అవకాశాలు; ఉపాధి మార్గాలపై దృష్టిసారించాలి. అంతేకాకుండా సదరు రంగం ప్రస్తుత ప్రగతి, సంబంధిత కోర్సు ముగిసే సమయానికి ఉండే అవకాశాలపై ఒక స్పష్టమైన అంచనాకు రావాలి. ఇందుకోసం సంబంధిత రంగ నిపుణుల సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి.
  6. ఉన్నత విద్య అవకాశాలు
    కోర్సులు, కెరీర్స్ ఎంపికలో అత్యంత ప్రధానమైన అంశం.. ఉన్నత విద్య అవకాశాలు. ప్రతి కోర్సులోనూ ఇప్పుడు ఉన్నత విద్య అవకాశాలున్నాయి. కానీ వాటిని అందించే ఇన్‌స్టిట్యూట్‌లు, సీట్ల పరిమితి వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఇటీవల కాలంలో మార్కెట్ క్రేజ్ కోణంలో ఎన్నో కొత్త కోర్సులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే ఆవిష్కృతమవుతున్నాయి. వీటికి పీజీ స్థాయిలో స్పెషలైజేషన్లు ఉండట్లేదు. దీనివల్ల విద్యార్థులు సంబంధిత రంగంలో పరిపూర్ణత సాధించలేకపోతున్నారు. కాబట్టి ఉన్నత విద్యకు కోర్సుల పరంగా, ఇన్‌స్టిట్యూట్‌ల పరంగా ఉన్న అవకాశాలను పరిశీలించాలి. ఇవి పుష్కలంగా ఉన్నవాటికే ఓటు వేయడం మంచిదని నిపుణుల అభిప్రాయం.
  7. కోర్సు వ్యవధి
    విద్యార్థులు ఒక కోర్సును ఎంపిక చేసుకునే ముందు ఆలోచించాల్సిన మరో అంశం.. కోర్సు వ్యవధి. ముఖ్యంగా ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఇది ఎంతో అవసరం. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అకడమిక్ సర్టిఫికేషన్ కోణంలోనూ కోర్సు వ్యవధిని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు ఇటీవల కాలంలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల కొంత సమయం ఆదా అవుతుంది. మరోవైపు కొన్ని కోర్సులు పీజీ, పీహెచ్‌డీ చేస్తే కానీ కెరీర్ ఆరంభానికి అవకాశం లభించదు. ఉదాహరణకు మెడికల్ కోర్సునే తీసుకుంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేస్తేనే గుర్తింపు లభిస్తోంది. ఇందుకోసం ఇంటర్మీడియెట్ తర్వాత దాదాపు పదేళ్ల సమయం పడుతోంది. అదే విధంగా సైన్స్ కోర్సులు కూడా పీజీ, పీహెచ్‌డీ చేస్తేనే మంచి భవిష్యత్తు. ఇలాంటి కోర్సుల వల్ల కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయం. కానీ మన సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఎందరో విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీతోనే ఉద్యోగంలో అడుగు పెట్టాల్సిన అవసరాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ అంశాన్ని కూడా విద్యార్థులు కోర్సు ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలి.
  8. దీర్ఘకాలిక లక్ష్యాలు
    కెరీర్ ఎంపికలో మరో ప్రధాన అంశం.. విద్యార్థులు తమ దీర్ఘకాలిక లక్ష్యాలపై స్పష్టత ఏర్పరచుకోవడం. ఉన్నత విద్య, ఉద్యోగం సాధారణంగా విద్యార్థుల్లో లక్ష్యాలుగా నిలుస్తున్న అంశాలు. ఉన్నత విద్య కోణంలో అందుబాటులో ఉన్న అవకాశాలు; ఉద్యోగపరంగా దీర్ఘకాలిక లక్ష్యాలు, అందుకోసం అభ్యసించాల్సిన ఉన్నత చదువులు; వాటికి సంబంధించి తమ సమర్థత స్థాయి గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత శిఖరాలు లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు.. ఆ మేరకు బ్యాచిలర్, పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న కోర్సుల గురించి అవగాహన పెంచుకోవాలి. తమ లక్ష్యానికి అనుగుణంగా మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలపై అవగాహనతో కెరీర్ ప్లానింగ్ రూపొందించుకోవాలి.
  9. హాబీలు.. అందించే హోదాలు
    హాబీలు.. అంటే వ్యక్తులకు తమ ఇష్టం మేరకు ఉండే అలవాట్లు. సరదాకి, లేదా అలవాటుగా ఉండే ఈ హాబీలు కూడా కెరీర్ పరంగా సమున్నత హోదాలు అందించే మార్గాలు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు బొమ్మలు గీయడం హాబీగా ఉన్న విద్యార్థులు దానికి కొంచెం నగిషీలు దిద్దుకుంటే ఫైన్ ఆర్ట్స్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి రంగాల్లో ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా క్రీడలంటే మక్కువ ఉన్న విద్యార్థులు క్రీడా రంగంలోనే కెరీర్ సొంతం చేసుకునే విధంగా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. డ్యాన్సింగ్, యాక్టింగ్ వంటి హాబీలున్న విద్యార్థులకు కూడా ఇప్పుడు ఆయా విభాగాల్లో ప్రొఫెషనల్ స్కిల్స్ తద్వారా చక్కటి కెరీర్స్ అందించే కోర్సులు లభిస్తున్నాయి. కాబట్టి కెరీర్ ప్లానింగ్ విషయంలో హాబీలు అనే అంశానికి కూడా సముచిత స్థానం కల్పించాలన్నది నిపుణుల అభిప్రాయం.
  10. ‘ఆసక్తి’కి ప్రత్యామ్నాయాలు
    కెరీర్ ప్లానింగ్‌లో తొలి ప్రాధాన్యత అంశం ‘ఆసక్తి’. అయితే.. మలి ప్రాధాన్యత అంశం ఆల్టర్నేటివ్స్ (ప్రత్యామ్నాయాలు)పై స్పష్టత. కారణం.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆసక్తి, లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో నిరాశాజనక ఫలితాలు ఎదురుకావచ్చు. ఇలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనే సమర్థతను పొందడంతోపాటు, తమ ఆసక్తికి సంబంధించిన కోర్సులు, కెరీర్స్‌కు ప్రత్యామ్నాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థుల్లో అధిక శాతం మందికి ఎంబీబీఎస్‌లో చే రాలనే లక్ష్యం. సీట్లు పరిమితం. అంతేకాకుండా ఎంట్రెన్స్‌లు, ర్యాంకుల పరంగా విజయం సాధించకపోవచ్చు. కానీ ఇదే సమయంలో ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇతర వైద్య సంబంధ కోర్సులు (వెటర్నరీ సైన్స్, హోమియోపతి, ఆయుర్వేద, ఫిజియో థెరపీ) గురించి తెలుసుకుంటే మానసిక సంసిద్ధత వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రత్యామ్నాయ కోర్సులు కూడా ఇప్పుడు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయనే దానిపై అవగాహన ఏర్పడుతుంది.
తల్లిదండ్రుల పాత్ర కీలకం
ఒక విద్యార్థి కెరీర్ ప్లానింగ్ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. మానసిక ఆలోచన స్థాయి, పరిపక్వత అంతంత మాత్రంగా ఉండే పదో తరగతి, ఇంటర్మీడియెట్ స్థాయి విద్యార్థుల కెరీర్ ప్లానింగ్‌కు సంబంధించి తల్లిదండ్రులు కూడా కసరత్తు చేయాలి. తమ పిల్లల వ్యవహార శైలిని పరిశీలిస్తూ వారి దృక్పథం, ఆసక్తి ఆధారంగా.. అందుకు సరితూగే కోర్సులు, వాటికి భవిష్యత్తు అవకాశాలపై అవగాహనతో దిశానిర్దేశం చేయాలి. ఒకవేళ తమ పిల్లలే స్పష్టంగా తమకు ఫలానా రంగం ఇష్టం అని పేర్కొంటే దాని లోటుపాట్లు గురించి తెలుసుకోవాలి. ఈ రెండు కోణాల్లోనూ ప్రణాళికలు రూపొందించలేని సందర్భాల్లో కెరీర్ కౌన్సెలర్లను సంప్రదించడం మేలు. కెరీర్ కౌన్సెలర్ల వద్ద అందుబాటులో ఉండే సైకోమెట్రిక్ అనాలిసిస్ సాధనాల ద్వారా విద్యార్థుల దృక్పథం, ఆసక్తులపై నూటికి 70 శాతం స్పష్టత లభిస్తుంది.
మోహిత, ఫౌండర్, బ్రెయిన్ చైల్డ్ కౌన్సెలింగ్.

 

అన్నిటికీ సిద్ధంగా..
కెరీర్ ప్లానింగ్ విషయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే విధంగా సంసిద్ధులు కావాలి. 'Hope for the best.. Prepare for the worst' అనే సూక్తిని పరిగణనలోకి తీసుకోవాలి. నేటి పోటీ ప్రపంచంలో పక్కా ప్లానింగ్ ఉపకరించే సాధనమే. కానీ కొన్ని సందర్భాల్లో చేదు అనుభవాలు చవి చూడాల్సి వస్తుంది. వాటిని కూడా తట్టుకునే విధంగా, అదే సమయంలో ప్రత్యామ్నాయాలు ఉండేలా వ్యవహరించాలి. అప్పుడే అన్ని విధాలా మేలు కలుగుతుంది.
ఎ.జగన్నాథ్, అమర్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్

 

అభిరుచి, ఆసక్తులే ప్రధాన సాధనాలు
కెరీర్ చాయిస్ విషయంలో అభిరుచి, ఆసక్తులే ప్రధాన సాధనాలని గుర్తించాలి. ఆ మేరకు అందుబాటులో ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటూ.. కోర్సు అడ్మిషన్‌తో మొదలుపెట్టి లాంగ్ టర్మ్ లక్ష్యం ఆధారంగా ప్రణాళిక రూపొందించాలి. క్రేజ్ అనే విషయానికే ప్రాధాన్యం ఇవ్వకూడదు. ప్రస్తుతం ఎలాంటి రంగంలోనైనా అవకాశాలు విస్తృతం. అయితే భవిష్యత్తులో ఆయా రంగాల ప్రగతి ఎలా ఉండబోతుంది అనే తులనాత్మక పరిశీలనతో ముందుకు సాగాలి.
ఎస్.గంగాధర్, డెరైక్టర్, లాజిక్ సొల్యూషన్స్

 

సోషల్ మీడియా సాధనంగా
విద్యార్థులు తమ కెరీర్ ప్లానింగ్ విషయంలో సోషల్ మీడియాను సాధనంగా మలచుకుంటే మరింత పకడ్బందీ ప్రణాళికకు ఆస్కారం లభిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఆయా రంగాలకు చెందిన నిపుణులు, సీనియర్లు, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు స్వీకరిస్తే స్పష్టత లభిస్తుంది. ఇంటర్నెట్ ఆధారంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఆప్టిట్యూడ్ అనలైజింగ్ టెస్ట్స్, సైకోమాటిక్ టెస్ట్‌లకు హాజరై విద్యార్థుల తమ వ్యక్తిగత సామర్థ్యాల స్థాయిని తెలుసుకుని ఆ మేరకు తమకు సరితూగే రంగం, తదనుగుణంగా కెరీర్ ప్లాన్ రూపొందించుకోవాలి.
ఎం. రామకృష్ణ, ఎండీ, జెడ్‌సీఎస్ కన్సల్టింగ్


ఇంటర్మీడియెట్ విద్యార్థులు.. మరింత అప్రమత్తంగా
కెరీర్ ప్లానింగ్ విషయంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. అప్పటికే మనసులో ఒక లక్ష్యం ఆధారంగా ఇంటర్మీడియెట్‌లో గ్రూప్‌లు ఎంచుకుంటారు. ఉదాహరణకు.. ఇంజనీరింగ్ ఔత్సాహికులు ఎంపీసీ, మెడికల్ ఔత్సాహికులు బైపీసీ, కామర్స్/మేనేజ్‌మెంట్ ఔత్సాహికులు సీఈసీ గ్రూప్‌లలో చేరుతున్నారు. ఇలాంటి విద్యార్థులు ఇంటర్మీడియెట్ తర్వాత కెరీర్ ప్లాన్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.

  • ఇంజనీరింగ్ లక్ష్యంగా పెట్టుకున్న ఎంపీసీ విద్యార్థులు బీటెక్ స్థాయిలో తమకు సరితూగే బ్రాం చ్‌పై ముందుగానే అవగాహన ఏర్పరచుకోవాలి. ఇదే సమయంలో ఇంజనీరింగ్‌కు దీటుగా లభిస్తు న్న ఇతర అవకాశాలు(పీజీ,పీహెచ్‌డీ తదితర) వాటికి తమ అనుకూలత స్థాయి తెలుసుకోవాలి.
  • మెడికల్ ఔత్సాహికులు కేవలం ఎంబీబీఎస్ కోణంలోనే ఆలోచించకుండా ఇతర ఆప్షన్స్‌పైనా దృష్టి సారించాలి.
  • కామర్స్/మేనేజ్‌మెంట్ ఔత్సాహికులు బీకాం చదవాలా? లేదా సీఏ, సీఎస్, సీఎంఏ వంటి కోర్సులను ఎంచుకోవాలా? అనే విషయంలో స్పష్టత పొందాలి.
  • హెచ్‌ఈసీ ఎంచుకున్న విద్యార్థులు తమ భవిష్యత్తు అవకాశాల గురించి ఆందోళన చెందనక్కర్లేదు. ఇప్పుడు ఆర్ట్స్, సోషల్ సెన్సైస్‌లోనూ విస్తృత అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సోషల్ వర్క్, ఎన్‌జీఓ మేనేజ్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్ వంటి విభాగాల్లో అనేక కోర్సులు, కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి. హెచ్‌ఈసీ అభ్యర్థులు తమ అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కోర్సు, కెరీర్ పరంగా ప్రణాళిక రూపొందించుకుంటే సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌తో సమాన స్థాయిలో హోదాలు సొంతం చేసుకోవచ్చు.

కెరీర్ ప్లానింగ్‌లో అనుసరించాల్సిన అంశాలు

  • పదో తరగతి నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలి.
  • స్వీయ సామర్థ్యం/ నైపుణ్యాలు గుర్తించాలి.
  • సబ్జెక్ట్ పరిజ్ఞానం ఆధారంగా ముందుకు సాగాలి.
  • వ్యక్తిగత శైలికి అనుగుణంగా వ్యవహరించాలి.
  • వ్యక్తిగత పరిమితులు గుర్తించి ఆ మేరకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించాలి.
  • వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి.

చ‌ద‌వండి: 
After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు
Inter Special: ఎంపీసీ.. అకడమిక్‌ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్‌!!
After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!

After 10+2/Inter: ఇంటర్ ఎంపీసీ తర్వాత ఎన్నో అవకాశాలు

Published date : 08 Jan 2022 01:03PM

Photo Stories