NCHM-JEE 2023 After Class 10+2: ఆతిథ్య రంగంలో.. అందుకో అవకాశాలు!
- ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ-2023 నోటిఫికేషన్ విడుదల
- బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం
- ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ స్కోర్‌తో పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం
- ఇంటర్మీడియెట్ అర్హతతో పోటీ పడే అవకాశం
- బీఎస్సీ సర్టిఫికెట్‌తో ఫ్యూచర్ బెస్ట్ ఆపర్చునిటీస్
వృద్ధి బాటలో పయనిస్తూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో కీలకంగా నిలుస్తోంది.. హోటల్ మేనేజ్‌మెంట్ విభాగం. కాబట్టి బ్యాచిలర్ స్థాయిలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి భవిష్యత్తు అవకాశాలకు ఢోకా లేదు అంటున్నారు నిపుణులు.
చదవండి: After Inter: ఇంటర్మీడియెట్ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..
బ్యాచిలర్ టు పీజీ
హోటల్ మేనేజ్‌మెంట్‌లో రాణించేందుకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలు అందించే ఉద్దేశంతో.. కేంద్ర పర్యాటక శాఖ.. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ విభాగాన్ని నెలకొల్పింది. దీని పరిధిలో జాతీయ స్థాయిలో ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో బ్యాచిలర్ స్థాయి నుంచి పీజీ, ఇతర స్పెషలైజేషన్లలో హోటల్ మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సులు అందిస్తున్నారు. బ్యాచిలర్ స్థాయిలో.. బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రవేశానికి జరిపే పరీక్ష.. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఇందులో సాధించిన స్కోర్ ఆధారంగా ఆయా క్యాంపస్‌లలో ప్రవేశం ఖరారు చేస్తారు.
75 ఇన్‌స్టిట్యూట్‌లు.. 11,965 సీట్లు
- ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ స్కోర్ ఆధారంగా.. జాతీయ స్థాయిలో 75 ఇన్‌స్టిట్యూట్‌లలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. వీటిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 21 ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌లతోపాటు ఆయా రాష్ట్రాల పరిధిలో 28 ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి.
- అదే విధంగా 25 ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్ అనుబంధ కాలేజ్ ఉన్నాయి. వీటిలో మొత్తం11,965 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఏపీలో ఎస్‌ఐహెచ్‌ఎం-తిరుపతి(60 సీట్లు), తెలంగాణలో ఐహెచ్‌ఎం-హైదరాబాద్(285 సీట్లు), డాక్టర్ వైఎస్సార్ ఎన్‌ఐటీహెచ్‌ఎం(120 సీట్లు), ఐహెచ్‌ఎం శ్రీశక్తి కాలేజ్(120 సీట్లు), ఎస్‌ఐహెచ్‌ఎం-మెదక్(60 సీట్లు) క్యాంపస్‌లలో ఈ కోర్సు ఉంది.
అర్హతలు
ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి వయోపరిమితి నిబంధన లేదు.
ఐదు విభాగాలు-200 ప్రశ్నలు
- ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈని జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ విధానంలో.. 200 ప్రశ్నలకు నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల్లో పరీక్ష ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ అప్టిట్యూడ్ 30 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 60 ప్రశ్నలు, అప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ 50 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్ష ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు.
- మెరిట్ జాబితాను రూపొందించే క్రమంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో అత్యధిక మార్కులు పొందిన వారిని ముందుగా పరిగణనలోకి తీసుకుంటారు.
ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌తో సీట్ల భర్తీ
ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈలో స్కోర్ ఆధారంగా.. ఉమ్మడి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ విధానం ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకుని తమ ఇన్‌స్టిట్యూట్ ప్రాథమ్యాలతో ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. అందుబాటులో ఉన్న సీట్లు, అప్లికేషన్లు, విద్యార్థులు పొందిన స్కోర్‌ను గణించి సీట్ల కేటాయింపు చేస్తారు.
నాలుగో ఏడాది చదివే అవకాశం
ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ, బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు విషయంలో ఈ ఏడాది ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం.. మూడేళ్ల కోర్సు పూర్తయ్యాక ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరో ఏడాది చదివే అవకాశం కల్పించడం. నూతన విద్యా విధానం ప్రకారం-తొలిసారి ఈ ప్రణాళిక అమలు చేస్తున్నారు. దీంతో.. మూడేళ్ల బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తయ్యాక నాలుగో ఏడాది కూడా చదివితే ఆనర్స్ డిగ్రీ అందిస్తారు.
చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!
ఉపాధి అవకాశాలు విస్తృతం
హాస్పిటాలిటీ బీఎస్సీ పూర్తి చేసుకున్న వారికి టూరిజం, హాస్పిటాలిటీ సెక్టార్లలో విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్; ఫ్రంట్ డెస్క్ మేనేజర్; క్రూయిజ్ మేనేజర్; కిచెన్ ఎగ్జిక్యూటివ్; మార్కెటింగ్ మేనేజర్; సర్వీస్ ఎగ్జిక్యూటివ్; అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్; ట్రిప్ అడ్వైజర్; బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటివ్స్; చెఫ్స్ వంటి పలు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ బీఎస్సీ కోర్సులో ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఆధారంగా.. ఆయా విభాగాల్లో ఎంట్రీ లెవల్‌లో కొలువులు దక్కుతున్నాయి. ప్రారంభంలో సగటున రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకూ వేతనం అందుతోంది.
ఎంట్రెన్స్‌లో విజయం ఇలా
- న్యూవురికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్: అభ్యర్థికి మ్యాథమెటిక్స్‌లో ఉన్న బేసిక్ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. ఇందుకోసం హైస్కూల్ స్థాయిలోని మ్యాథమెటిక్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా శాతాలు, లాభ- నష్టాలు, నెంబర్ సిస్టమ్, సగటు, కాలం-పని, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, కాలం-వేగం-దూరం, నిష్పత్తులు, జామెట్రీ వాటిపై పట్టు సాధించాలి. అనలిటికల్ ఆప్టిట్యూడ్ విషయంలో.. నిర్దిష్టంగా డేటాను విశ్లేషించగలిగే సామర్థ్యం, డేటాలోని ముఖ్య సమాచారాన్ని క్రోడీకరించి.. ఇచ్చిన ప్రశ్నకు అనువుగా, సమాధానం ఇచ్చే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇందుకోసం గ్రాఫ్‌లు, పైచార్ట్‌లు, ఫ్లోచార్ట్‌లు వంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి.
- రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్: ఇందులో మెరుగైన ప్రతిభ కనబర్చాలంటే.. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్-డీకోడింగ్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్∙వంటి రీజనింగ్ ఆధారిత అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా డేటా సఫీషియన్సీ, వెన్ డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
- జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: హైస్కూల్ స్థాయిలోని పుస్తకాల్లో ఉండే చరిత్ర, రాజ్యాంగం, జాగ్రఫీ, ఎకనామిక్స్ పాఠ్యాంశాలు చదవాలి. హిస్టరీలో ముఖ్యమైన యుద్ధాలు-పరిణామాలు-పర్యవసానాలు, స్వాతంత్య్రోద్యమం వంటి అంశాలపై అవగాహన లాభిస్తుంది. జాగ్రఫీలో దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలు, ఖనిజ వనరులు-అవి ఎక్కువగా లభించే ప్రాంతాలు, నదులు, సరస్సులు, పర్వతాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు, వార్తల్లోని వ్యక్తులు, ఇటీవల కాలంలో అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్: కీలకమైన ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో రాణించడానికి అభ్యర్థులు గ్రామర్‌ను ఔపోసన పట్టాలి. టెన్సెస్, ప్రిపోజిషన్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్స్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. దీనికోసం బేసిక్ గ్రామర్ పుస్తకాలను అధ్యయనం చేయడంతోపాటు న్యూస్ పేపర్లను చదవడం, వాటిలోని కొత్త పదాలను తెలుసుకోవడం, ఆ పదాలను వినియోగించిన తీరుపై అవగాహన ఏర్పరచుకోవడం వంటివి లాభిస్తాయి. పదో తరగతి స్థాయి ఇంగ్లిష్ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ విభాగంలో పేర్కొన్న సిలబస్‌లో అధిక శాతం సిలబస్‌ను పూర్తి చేసుకోవచ్చు.
- ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్..స్పెషల్ సెక్షన్: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో ప్రత్యేకమైన విభాగంగా ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ విభాగాన్ని పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అభ్యర్థికి ఆతిథ్య, పర్యాటక రంగాల్లో ఉన్న ఆసక్తి,దృక్పథాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. వాస్తవ సంఘటన లేదా అంశం ఇచ్చి దానికి ఎలా స్పందిస్తారు? అనే తరహా ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు అభ్యర్థుల్లో ఎదుటి వారిని మెప్పించే తీరు,సందర్భానికి తగినట్లు వ్యవహరించే శైలికి సంబంధించి ఉంటాయి.
చదవండి: Career Guidance: మూడేళ్ల డిగ్రీ.. ఎలా ముందుకుసాగాలో తెలుసుకుందాం..
ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ-2023.. ముఖ్యాంశాలు
- దేశ వ్యాప్తంగా 21 ఐహెచ్‌ఎంలు, 28 ఎస్‌ఐహెచ్‌ఎంలు, 25 ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్, 1 పీఎస్‌యూ ఇన్‌స్టిట్యూట్‌లో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశం.
- ఈ ఏడాది నుంచి ఆనర్స్ డిగ్రీ విధానం ప్రారంభం.
- మూడేళ్ల కోర్సు తర్వాత మరో ఏడాది చదివితే ఆనర్స్ డిగ్రీ సర్టిఫికెట్.
- కోర్సు పూర్తి చేసుకుంటే ప్రముఖ హోటల్స్, హాస్పిటాలిటీ, టూరిజం విభాగాల్లో కొలువులు.
- ప్రారంభంలోనే సగటున రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షిక వేతనం
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 27, 2023
- ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ పరీక్ష తేదీ: మే14, 2023
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
- వెబ్‌సైట్: https://nchmjee.nta.nic.in