Skip to main content

కేంద్ర ఆర్థిక సర్వే 2015-16

వృద్ధి పరుగులో ముందుండాలంటే సంక్షేమానికి చోటుండకూడదని ఆర్థిక సర్వే తేల్చింది. 8 నుంచి 10 శాతం వృద్ధి నమోదు కావాలంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించింది. సబ్సిడీల కోత, పొదుపు పథకాలపై పన్ను విధించటం, గ్యాస్ సిలెండర్ల సంఖ్యను తగ్గించటం, ఐటీ మినహాయింపుల్ని పరిమితం చేయటం వంటి చర్యల్ని సూచించిన సర్వే... అందాల్సిన వారికి అందకుండా పోతున్నాయనే కారణాన్ని చూపించింది. పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు ఏర్పడుతున్నా, వాటికి నిధులు దొరకటమైతే కష్టంగా ఉందని, పెట్టుబడులు అందుకున్న వాటి విలువలు కూడా తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఎగ్జిట్ కాలేకపోతున్నారంటూ... స్టార్టప్ ఇండియా సవాళ్లను సర్వే కళ్లకు కట్టింది. బ్యాంకుల దుస్థితినీ గుర్తించిన సర్వే... వాటికి మూలధనం ఇవ్వటానికి కొన్ని పీఎస్‌యూ కంపెనీల్ని విక్రయించటమే శరణ్యమని కూడా సూచించింది.
ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు...
 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7-7.75% మధ్య ఉంటుంది.
 • ఈ ఏడాది వృద్ధి మాత్రం 7.6% ఉంటుంది. ఎగుమతులు వేగంగా పెరిగినట్లయితే దీర్ఘకాలంలో 8-10 శాతం వృద్ధి సాధించే సత్తా ఉంది.
 • అంతర్జాతీయంగా అన్ని దేశాలూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో సుస్థిరతకు చిరునామాగా ఇండియా నిలుస్తోంది.
 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు 35 డాలర్ల వరకూ ఉండొచ్చు. ఈ ఏడాది అది 45 డాలర్లుగా ఉంది.
 • 2016-17 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5-5% ఉండొచ్చు.
 • ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో ఉండటంతో ధరల్లో స్థిరత్వం వస్తుంది.
 • ప్రస్తుతం సంపాదిస్తున్న వ్యక్తుల్లో 5.5 శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. దీన్ని 20 శాతానికి చేర్చాలి.
 • అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఆర్థిక విధానాలపై ఉంటుంది.
 • జీడీపీలో ద్రవ్యలోటు 3.9 శాతానికి కుదించాలన్న ఈ ఏడాది లక్ష్యం సాధించగలం. వచ్చే ఏడాది మాత్రం కాస్త కష్టం.
 • వచ్చే ఏడాది సబ్సిడీల బిల్లు జీడీపీలో 2 శాతం కన్నా తక్కువే ఉంటుంది.
 • జీఎస్‌టీ బిల్లు ఆమోదంలో ఆలస్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
 • కార్పొరేట్లు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు విపరీతమైన ఒత్తిడిలోనే ఉంటాయి. కారణాలు గుర్తించటం, తిరిగి మూలధనం కల్పించటం, సంస్కరణల బాట పట్టడం ద్వారానే దీన్ని అధిగమించగలం.
 • 2019 మార్చికల్లా ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.1.8 లక్షల కోట్ల మూలధనం కావాలి.
 • ఫిబ్రవరి మధ్యనాటికి కరెంటు ఖాతా లోటు 1-1.5 శాతంగా, విదేశీ మారక నిల్వలు 351.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
 • 2015-16లో సేవల రంగం 9.2 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది.
 • విదేశీ మూలధనం వెనక్కెళ్లిపోయే అవకాశం ఉంది. అందుకని దేశీయంగా డిమాండ్ పెంచే చర్యలు చేపట్టాలి.
 • ఇటీవలి సంస్కరణలతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగం, కార్పొరేట్ రంగం చక్కని పనితీరు కనబరుస్తున్నాయి.
 • ఆరోగ్య, విద్యా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు రావాలి. వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి.
 • బడ్జెట్ అంచనాకన్నా ప్రభుత్వ పన్ను ఆదాయాలు ఎక్కువగా ఉంటాయి.
 • ఎగుమతుల మందగమనం కొనసాగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వేగం పుంజుకుంటుంది.
 • వాణిజ్యంలో రక్షణాత్మక చర్యల్ని భారతదేశం అడ్డుకోవాలి.
 • ఎరువుల రంగానికి సంస్కరణల ప్యాకేజీ ఇవ్వాలి.ఐటీ మినహాయింపు పరిమితులు పెంచొద్దు..
వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపుల పరిమితులను పెంచుకుంటూ పోవటం మంచిది కాదు. ఆస్తి పన్ను పరిధిని మరింత విస్తృతం చేయాలి. వ్యక్తిగత ఆదాయాలు సహజసిద్ధంగా పెరిగేందుకు, పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయాలు దోహదపడతాయి. సంపన్న ప్రైవేట్ రంగానికి ప్రయోజనం చేకూరుస్తున్న పన్ను మినహాయింపుల విధానాలను సమీక్షించి, దశ లవారీగా తొలగించటమే మంచిది. అలాగే వ్యవసాయం కావొచ్చు పరిశ్రమలు, సర్వీసులు, రియల్టీ కావొచ్చు... ఏ మార్గంలోనైనా ఆదాయాల పరంగా మెరుగ్గానే ఆర్జిస్తున్న వారిపై సహేతుక రీతిలో పన్నులు విధించాలి. ప్రస్తుతం ఎకానమీలో ఇంకా 85 శాతం మంది పన్ను పరిధిలోనే లేరు. ఆదాయాలు ఆర్జిస్తున్న వారిలో కేవలం 5.5 శాతం మందే పన్ను పరిధిలో ఉన్నారు. దీన్ని కనీసం 23 శాతానికి చేర్చాల్సి ఉంది. ఆస్తి పన్ను రేట్లు మరింతగా పెంచాలి. ఇలా చేస్తే స్పెక్యులేషన్‌ను కట్టడి చేసే వీలుంటుంది.

Education News


పొదుపు పైనా పన్ను ..
ఒకవైపు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తుండగా... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి వాటిపై పన్ను మినహాయింపులను ఎత్తివేయాలని ఎకనమిక్ సర్వే సూచించటం గమనార్హం. ‘‘ఈ మొత్తాలను విత్‌డ్రా చేసుకునేటప్పుడు పన్ను వేయాలి. ఈఈటీ విధానం అనుసరించాలి’’ అని పేర్కొంది. ఈఈటీ విధానమంటే డిపాజిట్ చేసినపుడు, వడ్డీపైన పన్నుండదు. చివర్లో విత్‌డ్రా చేసుకున్నపుడు పన్ను విధిస్తారు. అంటే ఎగ్జంప్ట్, ఎగ్జంప్ట్- ట్యాక్సబుల్ అన్న మాట. పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై కూడా ఈఈటీ విధానం కింద పన్ను విధించాలని సర్వే పేర్కొంది. ‘‘సాధారణంగా ఇలాంటి స్కీములకిచ్చే ప్రయోజనాలు స్థితిమంతులకే ఉపయోగపడుతున్నాయి’’ అని సర్వే వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పీపీఎఫ్ కింద 15 ఏళ్ల డిపాజిట్లకు పెట్టుబడి పెట్టే దశలోనూ, వడ్డీ మీద, విత్‌డ్రాయల్ సమయంలోనూ పన్ను ఉండటం లేదు. 2014-15 బడ్జెట్‌లో పీపీఎఫ్ పెట్టుబడి పరిమితిని రూ.50,000కు పెంచిన తర్వాత డేటాను పరిశీలిస్తే ఎక్కువగా అధిక పన్నులు చెల్లించాల్సిన అధికాదాయ వర్గాలే ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకున్నట్లు తేలినట్లు సర్వే వెల్లడించింది.

లక్ష కోట్ల సబ్సిడీ... సంపన్నులకే
దాదాపు లక్ష కోట్ల విలువ చేసే సబ్సిడీలు స్థితిమంతులకే వెళుతున్నాయి. మెరుగైన ద్రవ్య నిర్వహణ కోసం వీటిలో తక్షణం కోత వేయాల్సి ఉంది. వంట గ్యాస్, రైల్వేలు, విద్యుత్, విమాన ఇంధనం, బంగారం, కిరోసిన్ వంటి ఆరు కమోడిటీలకు సంబంధించి సబ్సిడీ విధానాలు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై రాబడులు... పన్నులపరమైన ప్రయోజనాలు... తదితరాల రూపంలో ఈ సబ్సిడీలు కాస్త స్థోమత ఉన్నవారికి చేరుతున్నాయి.

పటిష్ఠంగా దేశీ మార్కెట్లు..
తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్లు కొంత పటిష్టంగానే ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెట్టుబడులకు గమ్యంగా ఎదిగేందుకు భారత్‌కు అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 2015 ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 31 శాతం ఎగిసి 24.8 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది (2014) ఇదే వ్యవధిలో ఇవి 18.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, సర్వీసులు, ట్రేడింగ్, ఆటోమొబైల్, నిర్మాణ, కెమికల్స్, టెలికమ్యూనికేషన్స్ తదితర రంగాల్లోకి ఎఫ్‌డీఐల రాక పెరిగింది. సింహభాగం నిధులు సింగపూర్, మారిషస్‌ల నుంచి వచ్చాయి.

గ్యాస్ సిలిండర్లను 10కి తగ్గించాలి..
వంట గ్యాస్ సబ్సిడీని క్రమబద్ధీకరించే దిశగా సబ్సిడీపై ప్రతి కుటుంబానికి అందించే సిలిండర్ల సంఖ్యను వార్షికంగా 10కే పరిమితం చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి 12గా ఉంది. 14.2 కేజీల సిలిండర్ ఒక్కింటికి మార్కెట్ రేటు ప్రస్తుతం రూ. 575గా ఉండగా, సబ్సిడీపై రూ. 419.26కి లభిస్తోంది. యూపీఏ హయాంలో 2012లో తొలుత ఏడాదికి ఆరు సిలిండర్లు చొప్పున పరిమితిని నిర్ణయించగా.. ఆ తర్వాత ఏడాది జనవరిలో దీన్ని తొమ్మిదికి, 2014 జనవరిలో 12కి పెంచారు. మరోవంక సబ్సిడీ, సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలిండర్లపై పన్నులు, ఎక్సైజ్ సుంకాల విధానాలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. వాణిజ్య సిలిండర్లతో పోలిస్తే సబ్సిడీ సిలిండర్లపై ఎక్సయిజ్, కస్టమ్స్ సుంకాలు ఉండవు కనక వీటిని ఇతర అవసరాల కోసం బ్లాక్‌మార్కెట్‌కు మళ్లించడం జరుగుతోంది.

ద్రవ్య లోటు క ట్టడి కష్టమే..
ద్రవ్య లోటును ఈ ఏడాది 3.9 శాతానికి కట్టడి చేయగలిగినా.. వచ్చే సారి మాత్రం ఇది కష్టసాధ్యమే. 7వ పే కమిషన్ సిఫార్సుల అమలు వల్ల పడే అదనపు భారం, అంతర్జాతీయ మందగమనం దీనికి ప్రధాన కారణాలవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును స్థూల దేశీయోత్పత్తిలో 3.5%కి కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఏడాదికి పైగా స్తబ్దుగా ఉన్న ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సర నుంచి పుంజుకునే అవకాశముంది. కమోడిటీల క్షీణతతో వాణిజ్య, కరెంటు అకౌంట్ల లోటులు అదుపులోనే ఉండొచ్చు.

2017 నాటికి అన్ని పోస్టాఫీసుల కంప్యూటరీకరణ..
దేశవ్యాప్తంగా ఉన్న 1.55 లక్షల పై చిలుకు పోస్టాఫీసుల కంప్యూటరీకరణ వచ్చే ఏడాది కల్లా పూర్తయ్యే అవకాశముంది. ఇందులో భాగంగా ఐటీ ఆధునీకరణ ప్రాజెక్టు కోసం పోస్టల్ విభాగం దాదాపు రూ. 4,909 కోట్లు వెచ్చిస్తోంది. దీని కింద దేశవ్యాప్తంగా మెయిల్ ఆఫీసులు, అకౌంట్ ఆఫీసులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు మొదలైన వాటన్నింటినీ అనుసంధానం చేయడం జరుగుతుంది. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే క్రమంలో పోస్టాఫీసు పొదుపు ఖాతాల సంఖ్య 30.86 కోట్ల నుంచి 33.97 కోట్లకు చేరుకున్నాయి. వీటిలో మొత్తం డిపాజిట్లు, నగదు సర్టిఫికెట్ల విలువ రూ. 6.53 లక్షల కోట్లుగా ఉంది.

వ్యవసాయానికి ఊతమిచ్చే చర్యలు..
దేశీ వ్యవసాయ రంగానికి ఊతమివ్వటానికి పలు చర్యలు చేపట్టాల్సి ఉంది. హైబ్రిడ్, జన్యు పరివర్తిత (జీఎం) విత్తనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, పంటలకు అధిక మద్దతు ధర లభించేలా చూడటంతో పాటు సాగు నీటి లభ్యతను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపర్చడం వంటివి ఈ చర్యల్లో కీలకం. జీఎం విత్తనాల భద్రతపై చర్చించి, వచ్చే ఆరు నెలల్లోగా వాటిని ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలి. గతేడాది దేశమంతటా వాతావరణ పరిస్థితులను తీవ్రంగా మార్చేసిన ఎల్ నినో ప్రభావాలు ఈసారి ఉండకపోవచ్చు. అయితే, అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగు అత్యవసర ప్రణాళికలతో సిద్ధంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది.

మెరుగైన ఉద్యోగాలు రావాలి..
మంచి జీతంతో పాటు భద్రత కూడా కల్పించే ఉద్యోగాల కల్పన కోసం చర్యలు అవసరం. ఇందులో ప్రైవేట్ రంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి కూడా కీలక పాత్ర ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగుల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. తయారీ రంగంలో నమోదైన మొత్తం సిబ్బందిలో కాంట్రాక్టు వర్కర్ల వాటా 1999లో 12 శాతంగా ఉండగా.. 2010 నాటికి 25 శాతానికి పైగా పెరిగింది.

ప్రైవేట్ వైద్యం..పెను భారం...
వైద్య సేవల్లో ప్రైవేట్ ఆస్పత్రులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. ప్రసూతి మినహాయిస్తే.. ఇతరత్రా వైద్యం ఖర్చులు ప్రభుత్వాస్పత్రులకన్నా బోలెడన్ని రెట్లు అధికంగా ఉంటున్నాయి. అందుబాటు రేటులో వైద్యాన్ని అందించడంలో ఎదురవుతున్న సవాళ్లను ఇది ప్రతిబింబిస్తోంది. వైద్యరంగంలో పరిమిత వనరులు, అపరిమిత డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రాధాన్యాంశాలపైనే వ్యయాలు చేయాలి. 2014 జనవరి-జూన్ మధ్య నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) నిర్వహించిన సర్వే ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరిన వారి చికిత్స ఖర్చులు సగటున రూ.6,120గా ఉండగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అదే చికిత్సకు ఏకంగా రూ.25,850 అవుతోంది.

రక్షణాత్మక చర్యలతో ఐటీకి విఘాతం..
వివిధ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణుల వల్ల దేశీ ఐటీ-బీపీవో రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వ్యాపారాభివృద్ధికి కంపెనీలు అంతర్గతంగా జరిపే నిపుణుల బదిలీలను... ఆయా దేశాలకు వలసలుగా ముద్ర వేసి, నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయి. నివేదిక ప్రకారం 2015-16లో ఐటీ-బీపీవో రంగం(హార్డ్‌వేర్‌సహా) 143 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేయగలదని అంచనా. దేశీ ఐటీ రంగం వృద్ధికి వీసా సమస్యలు మొదలైన వాటిని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

బ్యాంకులకు నిధుల కోసం పీఎస్‌యూల అమ్మకం..
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి, ఆ నిధులను ఇందుకోసం వినియోగిస్తే బాగుంటుంది. ఆర్థికేతర కార్యకలాపాల సాగించే కొన్ని నిర్ధిష్ట సంస్థల్ని ఇందుకోసం పరిశీలించవచ్చు. రుణ సమస్యల పరిష్కారానికి ‘4ఆర్’ సూత్రాలను పాటిస్తే మంచిది. సమస్యాత్మక రుణాలను గుర్తించడం (రికగ్నిషన్), తగు మూలధనాన్ని సమకూర్చుకోవడం (రీక్యాపిటలైజేషన్), పరిష్కారం అమలు(రిసొల్యూషన్), భవిష్యత్‌లో మళ్లీ సమస్య తలెత్తకుండా సంస్కరించుకోవడం (రిఫార్మింగ్) ఇందులో భాగం.

దేశంలో 19వేల పైగా స్టార్టప్‌లు..
దేశీయంగా దాదాపు 19,400 టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లున్నాయి. వీటిలో 5వేల పైచిలుకు స్టార్టప్‌లు గతేడాదే ప్రారంభమయ్యాయి. అయితే, ప్రాథమిక స్థాయిలో వీటిలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వైదొలగాలంటే చాలా తక్కువ వాల్యుయేషన్లే లభిస్తున్నాయి. 2015 ప్రథమార్ధంలో దేశీ స్టార్టప్‌లు 3.5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. క్రియాశీలకంగా ఉన్న ఇన్వెస్టర్ల సంఖ్య 2014లో 220గా ఉండగా.. 2015లో 490కి పెరిగింది.


Volume I

Volume II

Economic Outlook, Prospects, and Policy Challenges

State of the Economy: An Overview

The Chakravyuha Challenge of the Indian Economy

Public Finance

Spreading Jam across India's Economy

Monetary Management and Financial Intermediation

Agriculture: More from Less

External Sector

Mother and Child

Prices, Agriculture and Food Management

Bounties for the Well-Off

Industrial, Corporate, and Infrastructure Performance

Fiscal Capacity for the 21st Century

Services Sector

Preferential Trade Agreements

Climate Change and Sustainable Development

The Fertiliser Sector

Social Infrastructure, Employment and Human Development

Structural Changes in India's Labour Markets

 

Powering "One India"For Official website Click here
Published date : 02 Mar 2016 05:45PM

Photo Stories