Skip to main content

భారత ఆర్థిక సర్వే : 2020-21

‘‘మరిన్ని సంస్కరణలు దేశానికి అవసరం. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే కాదు. వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది. ప్రజారోగ్యంపై మరిన్ని నిధులను వెచ్చించాల్సి ఉంది. 2021-22లో ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 11 శాతానికి పెరుగుతుంది. ఇందుకు క్రమబద్ధమైన చర్యల మద్దతు కూడా ఉండాలి.’’ అని 2020-21 భారత ఆర్థిక సర్వే వెల్లడించింది. జనవరి 30న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచారు. సర్వేలోని అంశాలు, సూచనలు, అభిప్రాయాలు, అంచనాలను పరిశీలిస్తే...

 

11 శాతం వృద్ధి రేటు...2021-22 ఆర్థిక ఏడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును సాధిస్తుంది. నామినల్ జీడీపీ 15.4 శాతంగా ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020-21లో జీడీపీ మైనస్ 7.7 శాతానికి పడిపోవచ్చు. అయినా 2021-22 ఆర్థిక ఏడాదిలో వృద్ధి రేటు వీ(v) షేప్ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుంది. దేశ జీడీపీ చివరిగా 1979-80 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5.2 శాతం వృద్ధిని చవిచూసింది. 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 4.2 శాతంగా ఉంటుందని అంచనా.

17 ఏళ్ల తర్వాత...
17 ఏళ్ల తర్వాత మళ్లీ 2020-21లో మనదేశం కరెంటు ఖాతా మిగులు నమోదు చేసే అవకాశం ఉంది. కరెంటు ఖాతా మిగులు జీడీపీలో 2 శాతంగా ఉండొచ్చు. సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతులు పెరగడం ఇందుకు దోహదం చేస్తాయి. గత పదేళ్లలో కరెంటు ఖాతా లోటు సగటున 2.2 శాతంగా ఉంది. 2019-20 నాలుగో త్రైమాసికంలో కరెంటు ఖాతా మిగులులోకి (జీడీపీలో 0.1 శాతం) మనదేశం వచ్చింది. వాణిజ్య లోటు తగ్గడం ఇందుకు కారణం.

వ్యాపార సంస్థగా వ్యవసాయ రంగం...
వ్యవసాయరంగంలో పురోగతి దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ ఆదాయ వర్గాల భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే వ్యవసాయ రంగాన్ని గ్రామీణ ఉపాధి హామీ రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. స్థిరమైన, నిలకడైన వృద్ధి కోసం ఈ రంగంలో సత్వరమే సంస్కరణలను తీసుకురావాలి. జీడీపీలో భాగమైన ఇతర రంగాలు కరోనా ప్రభావంతో నేలచూపులు చూసిన వేళ... వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఒక్కటే ఆశాకిరణంలా నిలిచాయి.

 

 

  • రుణ, మార్కెట్ సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ కింద ఆహార శుద్ధికి తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి పెరిగింది.
  • దేశంలో సమ్మిళిత వృద్ధి అన్నది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేకుండా సాధ్యం కాదు. ఇది వ్యవసాయరంగంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంది.
  • మరింత పరిజ్ఞానంతో సాగు చేస్తే ఫలితాలు అధికమవుతాయి. అందుకే గ్రామీణ వ్యవసాయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
  • వ్యవసాయం, అనుబంధ రంగాలు (అటవీ, మత్స్య) దేశ ఉపాధిలో సగం వాటా ఆక్రమిస్తుండగా.. జీడీపీలో 18 శాతాన్ని సమకూరుస్తున్నాయి.
  • నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది.
  • నూతన తరహా మార్కెట్ స్వేచ్ఛకు నూతన వ్యవసాయ చట్టాలు తోడ్పడతాయి.
  • మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతోనే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించడం జరిగింది.


మౌలిక రంగానికి ప్రాముఖ్యత...
మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు... వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉత్తమ మార్గం. మొత్తం మీద ఆర్థికాభివృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి మౌలిక రంగం కీలకమైంది. 2020-25 కాలంలో రూ.111 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల నిధి అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేది. ఇన్‌ఫ్రాలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం పీపీపీ అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రూ.66,600 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను సిఫారసు చేసింది.

ప్రజారోగ్యానికి పెద్దపీట...
వైద్య రంగంపై ప్రభుత్వ వ్యయం పెరిగితే తద్వారా ప్రజలపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం జీడీపీలో కేవలం 1 శాతం మేర వైద్య రంగంపై ఖర్చు చేస్తున్నారు. దానిని 2.5 నుంచి 3 శాతం వరకు పెంచితే వైద్యం కోసం ప్రజలు చేసే వ్యయం 30 నుంచి 65 శాతం వరకు తగ్గుతుంది. ఆరోగ్య సౌకర్యాల అందుబాటులో మన దేశం ప్రపంచంలో 145వ స్థానం (మొత్తం 180 దేశాలకుగాను)లో ఉంది. లాక్‌డౌన్ విధానం కరోనా కేసులను నివారించడంతోపాటు లక్షమంది ప్రాణాలను కాపాడింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ మెరుగైన వైద్య సేవల కోసం టెలీమెడిసిన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలి.

రేషన్ ధరలు పెంచాలి...
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 80 కోట్ల మందికి పైగా విక్రయిస్తున్న ఆహార ధాన్యాల(రేషన్ సరకులు) ధరలను పెంచాల్సిన అవసరం ఉంది. రేషన్ షాపుల్లో బియ్యం కిలో ధర రూ.3, గోధుమలు కిలో రూ.2, ముతక ధాన్యాల ధరలు కిలో రూ.1గా ఉన్నట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం చెబుతోంది. ఖర్చులు పెరుగుతున్నా 2013 నుంచి వీటి ధరల్లో మార్పు చేయలేదు. పీడీఎస్ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020-21 బడ్జెట్‌లో కేంద్రం రూ.1,15,569 కోట్లను కేటాయించింది.

సరిగ్గా వినియోగించుకుంటే...
గ్రామీణ‌ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లను కలిగిన విద్యార్థులు 36 శాతం నుంచి 2020-21లో 61 శాతానికి పెరిగింది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, విద్యా పరంగా అసమానతలను తగ్గించొచ్చు. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు మంచివే. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు 9-12 తరగతుల్లో క్రమేణా వృత్తి విద్య కోర్సులను ప్రారంభించాలి.

ముఖ్యాంశాలు...

  • 2020-21లో కరెంటు ఖాతాలో 2 శాతం మిగులు ఉంటుంది.
  • రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్ ప్రతిఫలించడం లేదు.
  • 2014-15 లో ప్రతీ రోజూ 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018-19 నాటికి 30 కిలోమీటర్లకు పెరిగింది. 2020-21లో కరోనా కారణంగా 22 కిలోమీటర్లకు పడిపోయింది.
  • కరోనా కాలంలోనూ భారత ఏవియేషన్ పరిశ్రమ నిలదొక్కుకుని, దీర్ఘకాలంలో బలంగా పుంజుకోగలదు.
  • 2019 జూలై నుంచి 2020 అక్టోబర్ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగర్‌మాల ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది.
  • రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
  • కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వృద్ధిని తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐలు కలిసి మొత్తం రూ.29.87 లక్షల కోట్ల(జీడీపీలో 15 శాతం) ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాయి.
  • సామాజిక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2020-21లో రూ.17.16 లక్షల కోట్లకు వృద్ధి చెందింది.
  • పన్నుల వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు కావాలి.
  • ఐటీ-బీపీఎమ్ రంగం 2019-20లో 7.9 శాతం వృద్ధిని సాధించింది.
  • నెలవారీ సగటున ఒక చందాదారు వైర్‌లెస్ డేటా వినియోగం 2019లో మార్చి నాటికి 9.1జీబీగా ఉంటే 2020లో 12.2 జీబీకి పెరిగింది.
  • కొవిడ్ సంక్షోభంలోనూ వర్ధమాన దేశాల్లో భారత్‌కు మాత్రమే విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు వచ్చాయి.


2020-21 భారత ఆర్థిక సర్వేకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆర్థిక సర్వే గురించి...
ఆర్థిక సర్వే అంటే ఏంటి?
గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, పనితీరు ఎలా ఉందో ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది. భవిష్యత్ సవాళ్లు ఏంటివి? వీటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలు కూడా ఆర్థిక సర్వేలో ఉంటాయి. ఏటా బడ్జెట్‌కు ముందు ఈ సర్వేను విడుదల చేస్తారు.
ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు?
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ (డీఈఏ)లోని ఎకనమిక్ డివిజన్ ప్రతి ఏడాది ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. ప్రధాన ఆర్థిక సలహాదారు(చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్- సీఈఏ) నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. ప్రస్తుతం కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ సీఈఏగా ఉన్నారు. సర్వేను ఆర్థికమంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారు. తొలి ఆర్థిక సర్వేను 1950-51లో ఆవిష్కరించారు.

Published date : 01 Feb 2022 05:40PM

Photo Stories