TS Budget 2022 Highlights: తెలంగాణ బడ్జెట్ 2022–23
Telangana Budget 2022-23 Highlights: ‘టుడే తెలంగాణ ఈజ్ ఏ టార్చ్ బేరర్. నేడు రాష్ట్రం అమలు చేసే కార్యక్రమాలను రేపు దేశం అనుసరిస్తుంది. గత ఏడున్నర సంవత్సరాల చరిత్రే దీనికి సాక్ష్యం. ఈ ప్రగతి యాత్రకు కొనసాగింపే ఈ కొత్త బడ్జెట్’ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రజాస్వామ్య భారత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఓ అద్భుతమని చెప్పారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ను మార్చి 7న శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి.. రాష్ట్ర పురోగతిని వివరించారు. దేశంలో మరే రాష్ట్రం లో అమలు చేయలేని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత, వాటి ఫలితంగా రాష్ట్రం పురోగమిస్తున్న తీరును తెలిపారు. బడ్జెట్‌లో పథకాల తీరును వివరించారు.
ఇద్దరు మంత్రులు.. మూడోసారి..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వరుసగా మూడుసార్లు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనతను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు వరుసగా 2020–21, 2021–22, 2022–23 బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి వేముల కూడా వరుసగా మూడు వార్షిక బడ్జెట్‌లను మండలిలో ప్రవేశపెట్టారు.
బడ్జెట్ అంచనాలివే.. (రూ.కోట్లలో) |
|
మొత్తం బడ్జెట్ |
2,56,858.51 |
రెవెన్యూ రాబడి |
1,93,029.40 |
రెవెన్యూ వ్యయం |
1,89,274.82 |
రెవెన్యూ మిగులు |
3,754.58 |
పన్ను రాబడి |
1,08,211.93 |
పన్నేతర రాబడి |
25,421.63 |
కేంద్రపన్నుల్లో వాటా |
18,394.11 |
గ్రాంట్ ఇన్ ఎయిడ్ |
41,001.73 |
మార్కెట్ రుణాలు |
53,970 |
మూలధన వ్యయం |
29,728.44 |
ద్రవ్యలోటు |
52,167.21 |
రాబడి/ వ్యయం (రూ.కోట్లలో) |
|
రాక.. |
|
రెవెన్యూ ఆదాయం |
1,93,029 |
ప్రజా పద్దు |
4,200 |
రుణ వసూళ్లు |
60 |
ప్రజా రుణాలు |
59,672 |
పోక.. |
|
రెవెన్యూ వ్యయం |
1,89,274 |
మూలధన వ్యయం |
29,728 |
రుణాలు, అడ్వాన్సులు |
26,253 |
నికర మిగులు |
3 |
రుణాల చెల్లింపు |
11,701 |
కొన్నేళ్లుగా రెవెన్యూ రాబడుల తీరు.. (రూ.కోట్లలో) |
|||||
పన్ను రకం |
2018–19 |
2019–20 |
2020–21 |
2021–22 (అంచనా) |
2022–23 (అంచనా) |
కేంద్ర పన్నుల్లో వాటా |
18,560.88 |
15,987.59 |
11,731.25 |
13,990.13 |
18,394.11 |
ల్యాండ్ రెవెన్యూ |
0.42 |
0.99 |
6.94 |
6.31 |
6.71 |
అమ్మకపు, వాణిజ్య పన్నులు |
44,087.48 |
44,191.12 |
48,895.65 |
57,500 |
69,203 |
రాష్ట్ర ఎక్సైజ్ |
10,637.56 |
11,991.58 |
16,000 |
17,000 |
17,500 |
ఇతర పన్నులు |
9,948.61 |
11,413.80 |
11,293.06 |
18,403.69 |
21,502.22 |
పన్నేతర ఆదాయం |
10,007.42 |
7,360.32 |
19,305.58 |
30,557.35 |
25,421.63 |
గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ |
8,177.79 |
11,598.42 |
10,525.36 |
38,669.46 |
41,001.73 |
మొత్తం |
1,01,420.16 |
1,02,543.82 |
1,17,757.84 |
1,56,126.94 |
1,93,029.40 |
వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లలో) |
|
ఆర్థిక శాఖ |
43,088.00 |
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి |
29,586.06 |
వ్యవసాయం, సహకార |
24,254.35 |
రవాణా, రోడ్లు, భవనాలు |
23,191.37 |
నీటి పారుదల |
22,691.59 |
ఎస్సీ అభివృద్ధిశాఖ |
20,624.88 |
మాధ్యమిక విద్య, సచివాలయ |
13,727.97 |
విద్యుత్ |
12,209.86 |
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం |
11,237.33 |
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి |
10,903.66 |
హోం శాఖ |
9,315.48 |
వెనకబడిన తరగతులు, సంక్షేమం |
5,697.55 |
రెవెన్యూ |
3,547.66 |
గిరిజన అభివృద్ధి శాఖ |
3,415.41 |
పరిశ్రమలు, వాణిజ్యం |
3,135.44 |
ప్రణాళికశాఖ |
3,111.79 |
ఆహార, పౌర సరఫరాల శాఖ |
2,899.85 |
పాడి పరిశ్రమ, మత్య్సశాఖ |
2,768.68 |
ఉన్నత విద్య |
2,357.72 |
మహిళాశిశు, వికలాంగులు, వయోవృద్ధులు |
1,976.59 |
మైనారిటీ సంక్షేమం |
1,728.71 |
పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ |
1,419.35 |
న్యాయ శాఖ |
1,413.54 |
యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక |
1,026.41 |
సాధారణ పరిపాలన |
600.27 |
కార్మిక, ఉపాధి |
511.38 |
ఐటీ, కమ్యూనికేషన్ |
360.61 |
శాసనసభ వ్యవహారాలు |
157.01 |
TS Socio Economic Outlook: తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2021–22
వ్యవసాయ రంగం
2022–23 ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే గతేడాదితో పోల్చితే ఇది తక్కువ. 2021–22 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించగా.. ఈసారి అందులో రూ.746 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. రైతుబంధు పథకానికి రూ.14,800 కోట్లు కేటాయించింది.
ఆయిల్‌పామ్ రూ.1,000 కోట్లు..
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో నీటి వనరులు పుష్కలంగా ఉండటం, అనుకూల వాతావరణం నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రెండున్నర లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని భావిస్తోంది. అందుకోసం బడ్జెట్లో ఏకంగా రూ.1,000 కోట్లు కేటాయించింది.
వ్యవసాయ రంగ కేటాయింపులు ఇలా.. (రూ. కోట్లలో..)
- రైతుబంధు పథకానికి రూ.14,800 కోట్లు
- రైతుబీమా ప్రీమియం కోసం రూ.1,488 కోట్లు
- ఉద్యానశాఖకు రూ.994.85 కోట్లు. గతేడాదితో (రూ.242.30 కోట్లు) పోల్చితే రూ.752.55 కోట్లు అధికం.
- ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.75 కోట్లు
- శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.17.50 కోట్లు
- రైతు రుణమాఫీకి రూ.2,939.20 కోట్లు
- వ్యవసాయ యంత్రీకరణకు రూ.377.35 కోట్లు
- రైతు వేదికలకు రూ.12 కోట్లు
- విత్తనాభివృద్ధి సంస్థకు సాయం రూ. 25 కోట్లు
- రైతుబంధు సమితికి రూ. 3 కోట్లు
వ్యవసాయ రంగ కేటాయింపులు ఇలా.. |
|
ఆర్థిక ఏడాది |
రూ. కోట్లలో.. |
2014–15 |
8,511.17 |
2015–16 |
8,432.28 |
2016–17 |
8,676.08 |
2017–18 |
5,942 |
2018–19 |
20,820 |
2019–20 |
15,198 |
2020–21 |
25,811 |
2021–22 |
25,000 |
2022–23 |
24,254.35 |
నీటిపారుదల శాఖ
నీటి పారుదల శాఖకు కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు పెంచింది. గత ఏడాదితో పోల్చుకుంటే రూ.5,744 కోట్ల మేర నిధులు పెరిగాయి. 2022–23 బడ్జెట్‌లో నిర్వహణ పద్దు కింద రూ.13,397.84 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.9,277.16 కోట్లు కలిపి మొత్తం రూ.22,675 కోట్లను కేటాయించింది. 2021–22లో ప్రగతి పద్దు కింద రూ.6,424.28 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.10,506.58 కోట్లు కలిపి రూ.16,931 కోట్లు మాత్రమే కేటాయించింది.
విభాగాల వారీగా..
నీటి పారుదల శాఖ తాజా కేటాయింపులను విభాగాల వారీగా పరిశీలిస్తే.. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.21,401.08 కోట్లు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.1,245.30 కోట్లు, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ (క్యాడ్)కు రూ.18.69 కోట్లు, వరద నియంత్రణ/కాల్వలకు రూ.10 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయి.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు..
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి మళ్లీ వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలే కీలకం కానున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణం పూర్తి కావడానికి రూ.30 వేల కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.2,506 కోట్లను మాత్రమే కేటాయించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం రూ.50 వేల కోట్లను మించిపోగా, ఇప్పటివరకు రూ.18 వేల కోట్లను వ్యయం చేశారు. తాజా బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.1,225 కోట్లను కేటాయించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
గత కొన్నేళ్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తాజా బడ్జెట్‌లోనూ కొనసాగించారు. గతేడాది ఈ శాఖకు రూ.29,271 కోట్లు కేటాయించగా, 2022–2023 బడ్జెట్లో రూ.29,586.06 కోట్లు ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే పంచాయతీరాజ్ సంస్థల పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా బడ్జెట్‌లోనూ అదే దృష్టిని, ప్రాధాన్యతను ప్రభుత్వం కొనసాగించింది.
ఫింఛన్ల కోసం రూ.11,728 కోట్లు..
పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టే వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు తాజా బడ్జెట్‌లో రూ.3,330 కోట్లు ప్రతిపాదించారు. ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 38.41 లక్షల మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఇస్తున్నారు.
ఎస్టీ పంచాయతీ భవనాలకు రూ.600 కోట్లు..
గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత పంచాయతీ భవనాల నిర్మాణం నిమిత్తం ఒక్కోదానికి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.600 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్‌డీఎఫ్ నుంచి రూ.1,000 కోట్లు ప్రతిపాదించింది. పావలా వడ్డీ రుణాల కోసం రూ. 187 కోట్లు, మిషన్ భగీరథ అర్బన్ కింద రూ.800 కోట్లు కేటాయించింది.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి
దళిత, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.47,350.37 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇందులో ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.33,937.75 కోట్లు, ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రూ.13,412.62 కోట్లు చూపారు. గత బడ్జెట్‌లో ఈ నిధికి రూ.33,610.06 కోట్లు కేటాయించగా.. ఈసారి అంతకన్నా రూ.13,740.31 కోట్లు పెరిగాయి. ఈ ఫండ్‌కు కేటాయించిన నిధులను సంబంధిత సంక్షేమ శాఖలతోపాటు 42 ప్రధాన ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.
దళితబంధుకు భారీ నిధులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకానికి తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామని ప్రకటించింది. దళిత బంధు పథకానికి భారీగా నిధులు కేటాయించడంతో ఎస్సీ ఎస్డీఎఫ్‌లోనూ భారీ పెరుగుదల నమోదైంది.
విద్యా రంగం
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి గత ఏడాదితో పోలిస్తే, ఈసారి రూ.2,477 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. గత ఏడాది విద్యారంగం కేటాయింపులు రూ.13,608 కోట్లు ఉంటే.. 2022–23 బడ్జెట్‌లో ఈ పద్దు రూ.16,085 కోట్లకు చేరింది. ఉన్నత విద్యకు గత ఏడాది రూ.1,873 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.2,357.72 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు గత ఏడాది రూ.11,735 కోట్లు ఉంటే, ఈసారి ఇది 13,725.97 కోట్లకు పెరిగింది. మొత్తం మీద రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగం వాటా గత ఏడాది 6.1 శాతంగా ఉంటే, ఈసారి 6.2 శాతంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
కేటాయింపులు ఇలా..
మన ఊరు–మన బడి: స్కూళ్ల ఆధునీకరణకు అధిక ప్రాధాన్యం..: ప్రభుత్వ స్కూళ్ళను ఆధునీకరించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజా బడ్జెట్ కేటాయింపుల్లో దీనికి ప్రాధాన్యమిచ్చింది. మన ఊరు–మన బడి, మన బస్తీ– మన బడి పేరుతో చేపట్టే ఈ కార్యక్రమానికి రూ.7,289 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. అయితే తొలి దశలో 9,123 స్కూళ్ళలో చేపట్టే 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,497 కోట్లు ఇతర పద్దుల నుంచి కేటాయించారు.
మహిళా యూనివర్సిటీ: రాష్ట్రావతరణ తర్వాత మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఎట్టకేలకు ఈ ఏడాది వర్సిటీ ఏర్పాటుకు అనుమతించింది. కార్యాచరణకు కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాథమిక అవసరాల కోసం రూ.100 కోట్లు కేటాయించింది. అదే విధంగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మరో రూ.100 కోట్లు కేటాయించింది.
ఆరోగ్య రంగం
వైద్య, ఆరోగ్య శాఖకు ఈసారి నిధులు గణనీయంగా పెరిగాయి. 2021–22 బడ్జెట్లో రూ.6,295 కోట్లు కేటాయిస్తే.. 2022–23 బడ్జెట్లో రూ.11,237 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే రూ.4,942 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రతి జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు.
ప్రతి జిల్లాకో వైద్య కళాశాల
- ప్రతి జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ ఏర్పడినప్పుడు 5 మెడికల్ కాలేజీలే ఉన్నాయి.
- రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలో కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించింది. వీటిలో పీజీ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి.
- ప్రస్తుతం మరో 8 కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రాబోయే వైద్య విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి.
- ఇక రాబోయే రెండు సంవత్సరాల్లో మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 8 కళాశాలలను ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు.
- 2023 సంవత్సరంలో మిగతా జిల్లాలు.. మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో ఏర్పాటు చేయనున్నారు.
- మరోవైపు హైదరాబాద్ నగరం నలుదిక్కులా.. అంటే గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- వరంగల్‌లో హెల్త్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేటాయింపులు ఇలా..
- ప్రతి జిల్లాకో వైద్య కళాశాల స్థాపన కోసం రూ.1,000 కోట్లు
- ఆరోగ్యశ్రీకి రూ.1,343 కోట్లు
- కేసీఆర్ కిట్‌కు రూ.443 కోట్లు
- ఆసుపత్రుల నిర్వహణకు రూ. 1,377 కోట్లు
- వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రూ. 300 కోట్లు
- వైద్య పరికరాలకు రూ. 500 కోట్లు
- సర్జికల్స్ కోసం రూ. 200 కోట్లు
- మందుల కొనుగోలుకు రూ. 377 కోట్లు
- సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రూ. 1,000 కోట్లు
సంక్షేమ శాఖలు
వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 2022–23 బడ్జెట్‌లో కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.175.46 కోట్లు ఎక్కువగా రూ.5,697.55 కోట్లను సర్కారు కేటాయించింది. ఇక ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.20,624.88 కోట్లు ప్రతిపాదించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే పద్దు రూ.15,036.91 కోట్లు పెరిగింది. దళితబంధు పథకానికి ఏకంగా రూ.17,700 కోట్లు ప్రకటించడంతో బడ్జెట్ అమాంతం పెరిగింది.
బడ్జెట్‌లో సంక్షేమ శాఖలకు కేటాయింపులు ఇలా.. (రూ. కోట్లలో) |
||
సంక్షేమ శాఖ |
2021-22 |
2022-23 |
బీసీ |
5,522.09 |
5,697.55 |
ఎస్సీ |
5,587.97 |
20,624.88 |
ఎస్టీ |
3,056.12 |
3,415.41 |
మైనార్టీ |
1,606.39 |
1,728.71 |
రాష్ట్ర అప్పులు 3.29 లక్షల కోట్లు
రాష్ట్ర అప్పుల పద్దు రూ.3 లక్షల కోట్లు దాటుతోంది. ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరంలో సమీకరించుకుంటామని ప్రతిపాదించిన రుణాలతో కలిపి మొత్తం అప్పులు రూ.3,29,988 కోట్లకు చేరనున్నాయి. 2021–22 ఏడాదికిగాను సవరించిన బడ్జెట్ అంచనాలు.. రాష్ట్ర అప్పులు రూ.2,85,120 కోట్లు. తాజా బడ్జెట్‌లో కొత్తగా రూ.59 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో పాత రుణాలకు సంబంధించి చెల్లింపులు పోగా.. రూ.45 వేల కోట్లు అదనంగా జతకానున్నాయి. మొత్తం అప్పులు రూ.3.29 లక్షల కోట్లు దాటనున్నాయి. ఈ అప్పులను 2011 జనాభా లెక్కలతో పోల్చితే, తలసరి అప్పు రూ.94,272 కోట్లకు చేరుతోంది.
గత ఏడేళ్లుగా అప్పు పెరిగిన తీరు (రూ.కోట్లలో) |
||
ఏడాది |
రుణాలు |
జీఎస్‌డీపీలో శాతం |
2016–17 |
1,29,531 |
20.04 |
2017–18 |
1,52,190 |
20.21 |
2018–19 |
1,75,281 |
20.25 |
2019–20 |
2,05,858 |
21.32 |
2020–21 |
2,44,019 |
25.00 |
2021–22 |
2,85,120 |
25.00 |
2022–23 |
3,29,988 |
25.00 |
ఆదాయ పద్దు
రాష్ట్ర చరిత్రలో పన్ను ఆదాయ ప్రతిపాదనలు తొలిసారి రూ. లక్ష కోట్లను మించాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 1,08,212 కోట్ల మేర సొంత పన్ను ఆదాయం వస్తుందనే అంచనాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. గతేడాది ప్రతిపాదించిన రూ. 92 వేల కోట్ల పన్ను రాబడుల్లో 100 శాతం రావడంతో ఈసారి అదనంగా రూ. 17 వేల కోట్లను అంచనా వేస్తూ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించింది.
మరికొన్ని కేటాయింపులు ఇలా..
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.2,750 కోట్లు
- మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి రూ.1,976.59 కోట్లు. ఇది గత బడ్జెట్ కంటే రూ. 343.91 కోట్లు ఎక్కువ.
- కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన, శిక్షణ శాఖలకు రూ.511.38 కోట్లు
- రాష్ట్రంలో తొలి మహిళా వర్సిటీ కోసం రూ.100 కోట్లు, అటవీ విశ్వ విద్యాలయం కోసం రూ.100 కోట్లు
- డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు.
- గొర్రెల పంపిణీకి రూ. వెయ్యి కోట్లు
- రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణకు రూ.1,542 కోట్లు
- మెట్రో రైలును పాత బస్తీలో 5.5 కిలోమీటర్లకు అనుసంధానానికి రూ.500 కోట్లు, ప్రజా రవాణాకు రూ. 1,500 కోట్లు.
- కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌కు రూ.750 కోట్లు
- అర్బన్ మిషన్ భగీరథకు రూ.800 కోట్లు
- అంతర్జాతీయ విమానాశ్రయంతో మెట్రో కనెక్టవిటీకి రూ.500 కోట్లు
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు
- పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ.2,142 కోట్లు
- దళిత బంధుకు 17,700 కోట్లు
- కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.1,000 కోట్లు
- వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, గృహాలకు రాయితీపై విద్యుత్ సరఫరా కోసం డిస్కంలకు రూ.7665కోట్లు
- ఇంధన శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 1607.11కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.7767.75కోట్లు కలిపి మొత్తం రూ.9374.86 కోట్లు కేటాయింపు
- పోలీస్ శాఖకు రూ. 1,104 కోట్లు
- పురపాలక శాఖకు రూ.10,903 కోట్లు
- పాతబస్తీకి మెట్రోరైలు కోసం రూ.500 కోట్లు
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉచిత మంచినీటి సరఫరా చేస్తున్నందున జలమండలికి రూ.300 కోట్లు
- యాదాద్రి పట్టణాభివృద్ధి సంస్థకు 350 కోట్లు
- పట్టణాల్లో మిషన్ భగీరథ కింద రూ.800 కోట్లు
- అటవీశాఖకు రూ.1,419 కోట్లు
- తెలంగాణ హరితహారం అమలు కోసం రూ.932కోట్లు
- పారిశ్రామిక రంగానికి రూ.3,220 కోట్లు
- ఐటీ రంగానికి రూ.356.99 కోట్లు
- ఆర్టీసీకి రూ.1,500 కోట్లు
2021–22 బడ్జెట్‌లో తగ్గిన రూ. 20 వేల కోట్లు
2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా రూ.2,29,876.94 కోట్లతో 2021–22 బడ్జెట్‌ను ప్రతిపాదించగా.. రూ.2,09,876.94 కోట్లకే పరిమితం కానున్నట్టు సవరణల్లో పేర్కొంది. రాష్ట్ర పన్ను రాబడులు, కేంద్రం నుంచి వచ్చే వాటా 100 శాతం సమకూరుతున్నాయని.. కానీ కేంద్రం నుంచి అందుతాయనుకున్న గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో రూ.10 వేల కోట్లు తక్కువ వచ్చాయని తెలిపింది. ఇదే సమయంలో పన్నేతర ఆదాయ అంచనాల్లోనూ రూ.10 వేల కోట్లు తగ్గాయని.. మొత్తంగా అనుకున్నదానికంటే రూ.20 వేలకోట్లు తగ్గాయని వెల్లడించింది.