Skip to main content

భారత ఆర్థిక నివేదిక 2014-15

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు, సుస్థిర ప్రభుత్వం కొలువుదీరడంతో భవిష్యత్తులో రెండంకెల వృద్ధి సాధ్యమే అంటోంది భారత ఆర్థిక నివేదిక.
ముడి చమురు ధరల్లో తగ్గుదల, ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గడంతో ద్రవ్యోల్బణం తగ్గుదల వంటివి రెండంకెల వృద్ధికి సూచనలుగా కన్పిస్తున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం (ఫిబ్రవరి) 2014-15 ఏడాది ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16)లో మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏకంగా 8.1-8.5 శాతానికి దూసుకెళ్తుందని సర్వే అంచనా వేసింది. అటు తర్వాత సంవత్సరాల్లో కూడా 8-10 శాతం స్థాయిలో రెండంకెల వృద్ధిని అందుకునేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయని పేర్కొంది. జీడీపీ గణాంకాల లెక్కింపునకు బేస్ రేటును 2005-06 నుంచి 2011-12కు మార్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.4 శాతానికి(గత అంచనా 6 శాతం) చేరుతుందని ప్రభుత్వం తాజాగా అంచనా వేయడం తెలిసిందే. మొత్తం మీద మోదీ సర్కారు చెప్తున్న మంచి రోజులు రానున్నాయని సర్వే వెల్లడించింది.

సర్వేలోని ముఖ్యాంశాలు..
 • 2015-16 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 8.1 నుంచి 8.5 శాతం మధ్య ఉంటుంది.
 • దేశంలో రెండంకెల అభివృద్ధి సాధ్యం. 8 నుంచి 10 శాతం మధ్య జీడీపీ.
 • 2014-15లో ద్రవ్యోల్బణం తగ్గింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.
 • 2014-15లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 257.07 మిలియన్ టన్నులు. గత ఐదేళ్ల సరాసరి కంటే రాబోయే రోజుల్లో ఈ ఉత్పత్తి 8.5 మిలియన్ టన్నులు అధికం
 • ప్రభుత్వం అనుసరించనున్న జన్‌ధన్- ఆధార్-మొబైల్(జామ్) వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా నగదు బదిలీ సులభతరం కానుంది.
 • వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) జీడీపీలో 1 శాతానికి పరిమితం కావచ్చు.
 • రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 5-5.5 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా. 2013 చివరినుంచి చూస్తే ద్రవ్యోల్బణం రేటులో 6 శాతంపైగా తగ్గుదల నమోదైంది.
 • కొత్త ఉద్యోగాల సృష్టికి చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు ప్రోత్సాహం. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.
 • ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ సేవల ఉత్పత్తి 12 నుంచి 14 శాతం పెరగొచ్చు.
 • ఈ-కామర్స్‌ను ప్రోత్సహించడంతోపాటు వినియోగదారుల హక్కుల రక్షణకు చర్యలు.
 • వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు (గేమ్ చేంజింగ్) సుసాధ్యం కానున్నాయి.
 • వృద్ధి రేటుకు బూస్ట్ లభించాలంటే రిజర్వ్ బ్యాంక్ పాలసీ వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది.
 • భారీగా దిగొచ్చిన ముడిచమురు ధరలు, సంస్కరణలు, రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటం వంటివి కూడా వృద్ధికి చేదోడుగా నిలవనున్నాయి.
 • విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఓ) నిధుల ప్రవాహం... డాలరుతో రూపాయి మారకం విలువ స్థిరపడేందుకు(ప్రస్తుతం 62 స్థాయిలో ఉంది) దోహదం చేసింది. ఏప్రిల్ 2014 నుంచి 38.4 డాలర్ల విదేశీ నిధులు దేశీ స్టాక్, డెట్ మార్కెట్లోకి ప్రవహించాయి.
 • దీనివల్ల దేశీ స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి సెన్సెక్స్ 31% పైగా దూసుకెళ్లింది.
 • ఈ ఏడాది మార్చి చివరినాటికి భారత విదేశీ మారక నిల్వలు 340 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. 26 బిలియన్ డాలర్లమేర పెరుగుదల నమోదుకానుంది.
 • బొగ్గు గనుల వేలం, బీమాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి పెంపు, భూసేకరణ చట్ట సవరణల కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లు ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచాయి. అయితే, వీటిని వేగంగా చట్టరూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
 • మన ముందున్న రెండు సవాళ్లు.. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన.
 • మహిళా అక్షరాస్యతతోపాటు విద్యాభివృద్ధికి ఊతం.
 • భారీ సంస్కరణలను ప్రవేశపెట్టడంతో ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచేందుకు చర్యలు.
 • లక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సౌర శక్తి ప్రాజెక్ట్‌లు.
 • మేక్ ఇన్ ఇండియా( భారత్‌ను ప్రపంచ తయారీ హబ్‌గా మార్చేందుకు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం), స్కిల్ ఇండియా(నైపుణ్యాల పెంపునకు ఉద్దేశించిన ప్రాజెక్టు) మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలి.
 • వృద్ధికి ఎంతో కీలకమైన పెట్టుబడులు పుంజుకోవాలంటే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానానికి కొత్త రూపు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
కఠిన పన్నుల వ్యవస్థకు చెక్ పెట్టాలి
దేశంలో పన్నుల వ్యవస్థ, యంత్రాంగాన్ని పారదర్శకంగా, మరింత సరళంగా తీర్చిదిద్దాలని.. తద్వారా పన్ను చెల్లింపుదారులకు అత్యంత స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించాలని సర్వే సూచించింది. అవసరమైన పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను కూడా కల్పించాలని పేర్కొంది. దీనివల్ల కార్పొరేట్ రంగానికి పెట్టుబడి నిధులపై భారం తగ్గడంతోపాటు దేశంలో పొదుపును కూడా ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. వృద్ధి, పెట్టుబడులు పుంజుకోవాలంటే సంస్కరణల అమలుతో పాటు పన్నుల యంత్రాంగాన్ని మెరుగుపరచడం కూడా చాలా కీలకమైన అంశమని పేర్కొంది. వ్యాపారాలకు మెరుగైన పరిస్థితుల కల్పన.. కార్మిక, భూసేకరణ సంస్కరణలు, సబ్సిడీల హేతుబద్ధీకరణ, ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల జోరు పెంచడం వంటివి కూడా ఆర్థికాభివృద్ధికి ప్రధానమైనవేనని సర్వే తేల్చిచెప్పింది.

ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం 3%...
ఆర్థిక క్రమశిక్షణ దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సర్వే నొక్కిచెప్పింది. రానున్న సంవత్సరాల్లో ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయ, వ్యయాల్లో వ్యత్యాసం) జీడీపీలో 3 శాతానికి పరిమితం చేయాలని నిర్ధేశించింది. ‘స్థిరమైన వృద్ధి పెరుగుదలకు ప్రభుత్వ పెట్టుబడులు చాలా కీలకం. దీనికోసం వ్యయాల నియంత్రణ, సబ్సిడీల తగ్గింపు-హేతుబద్ద్ధీకరణ ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలి.

స్టార్టప్‌ల జోరు...
దేశంలో స్టార్టప్ కంపెనీలు జోరు మీద ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రస్తుతం 3,100 పైగానే దేశంలో స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి . టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల వృద్ధి దీనికి ప్రధాన కారణం. ఐటీ సంబంధిత అనుబంధ పరిశ్రమలు దేశంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. కన్సల్టెన్సీ మార్కెట్ల విషయంలో కూడా దేశం వేగంగా వృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ మంచి వృద్ధి సాధిస్తోంది.

పసిడి దిగుమతి ఆంక్షల తొలగింపు
పసిడి దిగుమతులపై ఆంక్షలను తొలగించాల్సిన సమయమిది. ఇందుకు తగిన పరిస్థితులన్నీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో నెలకొన్నాయి. కరెంట్ అకౌంట్ లోటు కట్టడి, దేశంలోని విదేశీ పెట్టుబడుల రాక, గణనీయ స్థాయిలో పెరిగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు, దాదాపు స్థిర మారకపు విలువల పరిస్థితి... ఇలా పలు ఆర్థిక అంశాలు నియంత్రణల తొలగింపునకు పూర్తి సానుకూలంగా ఉన్నాయి. ఆంక్షల వల్ల అక్రమ రవాణా పెరుగుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనాంశం.

ఈ కామర్స్‌లో అద్భుత అవకాశాలు
భారత్ ఈ-కామర్స్ రంగం రానున్న ఐదేళ్ల కాలంలో 50 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుంది. ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తుండడం దీనికి ప్రధాన కారణం. అయితే ఇక్కడ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణపై కొంత ఆందోళన నెలకొంది. వినియోగదారుల పరిరక్షణా చట్టంలో కొన్ని సవరణలను ప్రతిపాదిస్తున్నాం. పీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం 2014లో ఈ కామర్స్ రంగం విలువ 16.4 బిలియన్ డాలర్లు. 2015లో ఇది 22 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.

వ్యవసాయానికి మరింత సహాయం
వ్యవసాయ రంగం అభివృద్ధికి మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రంగంలో పరిశోధనలకు సంబంధించి పెట్టుబడులు పెరగాలి. గిడ్డంగులు వంటి బ్యాక్‌ఎండ్ మౌలిక సదుపాయాల కల్పనపైనా వ్యయాలు పెరగాలి. నీటి సరఫరా సదుపాయాలు మెరుగుపడాలి. సబ్సిడీలు లక్ష్యాలను చేరేలా లోటుపాట్లను సవరించాలి. రైతుల ఆదాయాలు పెరిగేలా వ్యవస్థలో మార్పులు జరగాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించాలి.

Current Affirs

Current Affirs

Current Affirs
Published date : 28 Feb 2015 03:26PM

Photo Stories