Skip to main content

భారత ఆర్థిక నివేదిక 2012-13

భారత ఆర్థిక నివేదిక 2012-13ని ఆర్థిక మంత్రి చిదంబరం ఫిబ్రవరి 27న లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. గత కొంతకాలంగా వృద్ధి క్షీణించిందని ఇకపై దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి రోజులు రానున్నాయని విత్త మంత్రి ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2013-14)లో 6.2-6.7 శాతం జీడీపీ వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. అయితే ఈ ఏడాదికి ఇది 5 శాతానికే పరిమితమవుతుందని పేర్కొంది. ఇది ఈ దశాబ్దపు కనిష్టస్థాయి. ప్రభుత్వ రాబడుల లక్ష్యం చేరుకోలేకపోతున్నామని సబ్సిడీలకు కోతపెట్టాల్సిందే నని సర్వే చెబుతోంది.

ఈ సర్వేని ముఖ్య ఆర్థిక సలహాదారు రఘురామ్ నేతృత్వంలోని ఆర్థిక వేత్తల బృందం తయారు చేసింది. మదుపుదారుల్లో విశ్వాసం పెంచడం ద్వారా వచ్చే సంవత్సరంలో 6 శాతం వృద్ధి సాధ్యమేనని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యయాలను వినియోగ ధోరణి నుంచి పెట్టుబడుల దిశగా మలుచుకోవడం, ఉద్యోగ కల్పన, పెట్టుబడులకు ఆటంకాలు తొలగించడం, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి చర్యలు ద్వారా మళ్లీ అధిక వృద్ధి దిశ వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సర్వేలోని ముఖ్యాంశాలు
  1. ప్రభుత్వంపై సబ్సిడీల భారం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ద్రవ్యపరమైన లక్ష్యాలు అదుపు తప్పుతున్నాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. దీనికోసం పెట్రోలియం ఉత్పత్తులపై ప్రధానంగా డీజిల్, వంటగ్యాస్‌పై ధరలను అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెంచాలని సూచించింది.
  2. 2012-13 సంవత్సరానికి ద్రవ్యలోటును 5.1 శాతానికి కట్టడి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ప్రభుత్వ వ్యయాలు, పన్నుల్లో మందకొడి ధోరణి వల్ల ఇది 5.3 శాతానికి ఎగబాకవచ్చని లక్ష్యాన్ని సవరించారు. అయితే వచ్చే సంవత్సరానికి దీనిని 4.8 శాతానికి కట్టడి చేస్తామని చిదంబరం చెబుతున్నారు.
  3. ఈ ఏడాదికి సబ్సిడీల బిల్లు 1.79 లక్షలకు చేరనుందని సరే ్వ అంచనా. దీనిలో చమురు సబ్సిడీ రూ. 43,580 కోట్లు, ఆహార సబ్సిడీ రూ. 75,000 కోట్లు, ఎరువుల సబ్సిడీ రూ. 60,974 కోట్లుగా ఉంటుందని అంచనా.
  4. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పలు విధాన పరమైన సంస్కరణ చర్యలు కరెంట్ అకౌంట్ డెఫిసిట్(క్యాడ్) కు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ రాబడుల మెరుగునకు దోహదం చేసుంతదని సర్వే పేర్కొంది.
  5. క్యాడ్‌కు అడ్డుకట్ట వేయడానికి పసిడి దిగుమతులను మరింత కట్టడి చేయాలని సర్వే నొక్కి చెప్పింది. (మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చి వెళ్లే విదేశీ మారక ద్ర వ్యంలో వ్యత్యాసమే క్యాడ్ )బంగారం ఇతరత్రా కమోడిటీస్ దిగుమతులను నిరూత్సాహపరిచి ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సర్వే చెప్పింది. ప్రభుత్వం బంగారంపై దిగుమతి పన్నును 4 నుంచి 6 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.
గత 5 సంవత్సరాల్లో జీడీపీలో రంగాల వారీగా వృద్ధిరేటు(2004-05 ధరల ప్రకారం-శాతాల్లో)
2012-13 2011-12 2010-11 2009-10
జీడీపీ 5.0 6.2 9.3 8.6
వ్యవసాయం అడువులు,చేపల పెంపకం 1.8 3.6 7.9 0.8
గనులు, క్వారీయింగ్ 0.4 -0.6 4.9 5.9
తయారీ రంగం 1.9 2.7 9.7 11.3
విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా 4.9 6.5 5.2 6.2
నిర్మాణ రంగం 5.9 5.6 10.2 6.7
ఆర్థిక సేవలు,బీమా,వ్యాపార స్థిరాస్థి సేవలు 8.6 11.7 10.1 9.7
సామాజిక మరియు వ్యక్తిగత సేవలు 6.8 6.0 4.3 11.7
ఆధారం కేంద్ర గణాంక సంస్థ
  1. ఎగుమతులను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలు, పన్నులు, రుణాలు, వాణిజ్య సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం భారత ఎగుమతులకు సవాలుగా మారింది. భారత్ వ్యవసాయ, ఆహార ఎగుమతుల్లో 10వ స్థానానికి చేరింది.
  2. 2012-13 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ నెలల్లో రుణ మార్కెట్ల నుంచి భారత కంపెనీలు రూ.2.81 లక్షల కోట్లు సమీకరించాయి. 2011-12లో ఈ సమీకరణ 3.09 లక్షలు ఉంది. ఈ కాలంలో 20 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి.
విదేశీ రుణాలు(బిలియన్ డాలర్లలో)
సంవత్సరం రుణం
2010 260.9
2011 305.9
2012(జూన్) 348.8
2012(సెపెంటంబర్) 365.3


ఆహార ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధిక స్థాయిలో ఉందని, దీనిని అదుపుచేయడానికి ప్రాధాన్యం పెంచాలని సర్వే పేర్కొంది. 2013 మార్చి నాటికి టోకు ధరలసూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6.2-6.6 శాతానికి తగ్గొచ్చని అంచనా. ప్రస్తుత తరుణంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరింత తగ్గించాలని సర్వే పేర్కొంది.

టోకు ధరల ప్రకారం ద్రవ్యోల్బణం
సంవత్సరం ద్రవ్యోల్బణం(శాతం)
2010-11 39.6
2011-12 8.9
2012-13 7.6
2013-14 6.2-6.6(ప్రస్తుత అంచనా)
  1. వచ్చే సంవత్సరం చివరినాటికి మరో 40 కోట్ల ఆధార్ కార్డులు ఇవ్వాలని యూఐడీఏఐ నిర్దేశించుకున్నట్లు సర్వే చెబుతోంది. 2012 డిసెంబర్ చివరినాటికి 24.93 కోట్ల మేర ఆధార్ నంబర్లు కేటాయించగా, 20 కోట్ల ఆధార్ లేఖలను పంపినట్లు సర్వే చెబుతోంది.
  2. గడిచిన నాలుగేళ్లలో వ్యవసాయ రంగ వృద్ధిరేటు 4 శాతానికే పరిమితమైంది. దీనిని పెంచాలంటే ఈ రంగంలో తక్షణమే సంస్కరణలు తీసుకురావాలని సర్వే పేర్కొంది. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ వృద్ధి, లక్ష్యం 4శాతం కాగా ఇది 3.6 శాతానికే పరిమితమైంది. అయితే 9వ ప్రణాళిక(2.5శాతం), పదో ప్రణాళిక(2.4 శాతం) కంటే మెరుగ్గానే వృద్ధి రేటు ఉందని సర్వే చెబుతోంది.
  3. దేశంలో పలు ప్రాంతాలను అనుసంధానించి రైల్వే రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా 5 ఫ్రైట్ కారిడార్ల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని సర్వే పేర్కొంది. కొత్తగా ఈస్ట్-వెస్ట్ కారిడార్ (కోల్‌కతా-ముంబై), నార్‌‌త-సౌత్ (ఢిల్లీ-చెన్నై), ఈస్ట్‌కోస్ట్ (ఖరగ్‌పూర్-విజయవాడ), సదరన్ (గోవా-చెన్నై)కారిడార్‌లు ఏర్పాటు కానున్నాయి.
  4. పారిశ్రామిక రంగం సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. గతేడాది అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ 8.3 శాతం మెరుగైన వృద్ధిని కనబరిచినా ఆ తర్వాత రెండు నెలల్లో ప్రతికూలత(మైనస్) వృద్ధిని నమోదు చేసింది.
  5. యూరోజోన్ రుణ సంక్షోభం తీవ్రతరం అవుతుండటం, అమెరికా రికవరీపై అనిశ్చితి వంటి విదేశీ పరిణామాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రిస్క్‌లో పడనుంది.
ఆహార ధ్యాన్యాల ఉత్పత్తి

సవంత్సరం ఉత్పత్తి(మి.టన్నులలో)
2009-10 218.1
2010-11 244.5
2011-12 259.3
2012-13 250.1


సర్వే తేల్చిన 16 రాష్ట్రాల ప్రగతి వివరాలు
వృద్ధిరేటు, స్త్రీ పురుషుల ఆయుప్రమాణం, గ్రామీణ, పట్టణ పేదరికం, నిరుద్యోగం, శిశుమరణాలు, తలసరి ఆదాయం పెరుగుదల, పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య, ఇందిరా ఆవాస్ యోజన, వైద్య సౌకర్యాలు వంటి పలు అంశాల్లో 16 రాష్ట్రాల పనితీరును సర్వే విశ్లేషించింది.
  1. ఇటీవల కాలంలో బీహార్ రాష్ర్టం అధిక వృద్ధిని నమోదు చేస్తూ ముందంజలో ఉంది. 16.71 శాతంతో ఈ రాష్ర్టం ముందుండగా, మధ్యప్రదేశ్ 11.98 శాతం, మహారాష్ర్ట, 8.54 శాతం, తమిళనాడు, 7.34 శాతం, కర్ణాటక 7.52 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మనరాష్ర్టం 6.72 వృద్ధి శాతంతో వెనుకబడి ఉంది.
  2. తలసరి ఆదాయ విషయంలోనూ 15.44 వృద్ధి శాతంతో బీహారే ముందువరుసలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ 10.48 శాతం, మహారాష్ర్ట, 8.73 శాతం, కేరళ 7.13 శాతం, తమిళనాడు, 6.72 శాతం, కర్ణాటక 6.69 తలసరి వృద్ధిని సాధించాయి. అయితే ఈ విషయంలోనూ మన రాష్ర్టం 5.75 శాతంతో 11వ స్థానంలో ఉంది.
  3. దేశంలో అత్యంత పేదరికం గల రాష్ట్రాల్లో బీహార్ 53.5 శాతంతో మొదటి స్థానంలో ఉంది. అతి తక్కువ 9.5 శాతం పేదరికంతో హిమాచలప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మన రాష్ర్టంలో పేదరికం 21.1 శాతం. పేదరికం అధింకగా ఉండే రాష్ట్రాల్లో ప్రజలు వారి ఆదాయంలో అధిక వ్యయం ఆహారానికే ఖర్చు చేస్తున్నారు. బీహార్‌లో 65 శాతం, కేరళలో 46 శాతం, మనరాష్ర్టంలో గ్రామాల్లో 58.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 44.8 శాతం ఆహారంపై ఖర్చు చేస్తున్నారు.
  4. జాతీయ స్థాయిలో పురుషుల సగటు ఆయుప్రమాణం 64.9 సంవత్సరాలు కాగా మహిళలది 69 ఏళ్లు. ఇదిలా ఉండగా రాష్ర్టంలో పురుషుల ఆయుప్రమాణం 63.5 సంవత్సరాలు, మహిళలది 68.2 ఏళ్లు. అయితే 16 రాష్ట్రాల్లో మనస్థానం మాత్రం 12కే పరిమితమైంది.
  5. శిశు మరణాల రేటులో మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యిమందికి 59 మంది మరణిస్తున్నారు. అతితక్కువ రేటును కేరళ(12) నమోదు చేసింది. ఈ విషయంలో మనరాష్ర్టంలో ప్రతి వెయ్యిమందికి 43మంది మరణిస్తున్నారు. ఎక్కువ శిశుమరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో మనస్థానం ఏడు.
  6. రాజస్థాన్‌లో గ్రామీణ నిరుద్యోగం ప్రతి వెయ్యి మందికి 4గా అత్యల్పంగా ఉండగా, మనరాష్ర్టం మాత్రం ప్రతి వెయ్యిమందికి 12గా ఆరోస్థానంలో ఉంది. అయితే పట్టణ నిరుద్యోగంలో తొమ్మిదో స్థానంలో ఉంది.
  7. 6-13 సంవత్సరాల మధ్య పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య 92 మందితో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. ఈ విషయంలో 122.6 శాతంతో మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉంది.
  8. 1844 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలిగి వైద్య సదుపాయాల కల్పనలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, హిమాచల ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా మనరాష్ర్టంలో వీటి సంఖ్య కేవలం 1183 మాత్రమే.
  9. ఉపాధి హామీ పథకంలో సగటున ప్రతి కుటుంబానికి 58 రోజులు పని కల్పించి మన రాష్ర్టం ముందంజలో ఉంది. తమిళనాడు 48, రాజస్థాన్ 47, కేరళ 45, కర్ణాటక 42 పనిదినాలు కల్పించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహిళలకు అధికంగా ఉపాధి పనులు కల్పిస్తున్న వాటిలో 92.76శ శాతంతో కేరళ అగ్రస్థానంలో నిలిచింది.
  10. గడిచిన దశాబ్ద కాలంలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడంలో హర్యానా 59.5 శాతం వృద్ధితో ప్రథమ స్థానంలో ఉండగా, మనరాష్ర్టం 35.4 శాతంతో మూడోస్థానంలో ఉంది. హిమాచల ప్రదేశ్ 89.1 శాతం గృహాలకు బ్యాంకు ఖాతాలు కలిగి ప్రథమస్థానంలో ఉంది. మన రాష్ర్టంలో ఇది 53 శాతం. జాతీయ సగటు మాత్రం 58.7 శాతంగా ఉంది.
  11. ఇందిరా ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణంలో 4,69,000 గృహాలు నిర్మించి బీహార్ అగ్రస్థానంలో ఉండగా 3,07,000 ఇళ్లతో ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో, 2,49,000 ఇళ్లతో మనరాష్ర్టం మూడో స్థానంలో ఉంది.
Published date : 01 Apr 2013 04:20PM

Photo Stories