13735 Jobs for SBI: ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్ కొలువు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య 13,735
ప్రతి ఏటా వేల సంఖ్యలో క్లరికల్ కేడర్ పోస్ట్‌లను భర్తీ చేస్తున్న ఎస్‌బీఐ.. తాజా నోటిఫికేషన్‌లోనూ అదే పంథా కొనసాగించింది. ఇటీవల మొత్తం13,735 జూనియర్ అసోసియేట్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి అదనంగా మరో 609 బ్యాక్‌లాగ్ పోస్ట్‌ల భర్తీ కూడా చేపట్టనుంది.
తెలుగు రాష్ట్రాల్లో 392 పోస్ట్‌లు
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ పోస్ట్‌లకు సంబంధించి సర్కిల్స్ వారీగా ఖాళీలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 342 పోస్ట్‌లు, అమరావతి (ఆంధ్రప్రదేశ్) సర్కిల్‌లో 50 పోస్ట్‌లు ఉన్నాయి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం–అభ్యర్థులు ఏదో ఒక సర్కిల్‌కు దరఖాస్తు చేసుకుని పోటీ పడొచ్చు.
అర్హతలు
- 2024, డిసెంబర్ 31 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- వయసు: 2024, ఏప్రిల్ 1 నాటికి 20–28 ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది.
రెండు దశల రాత పరీక్ష
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే నియామకాల తుది ఖరారుకు మెయిన్ పరీక్షలో చూపిన ప్రతిభను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
చదవండి: JK Bank Recruitment: జమ్మూకశ్మీర్ బ్యాంక్‌లో 278 అప్రెంటిస్‌లు.. నెలకు రూ.10,500 జీతం..
100 మార్కులకు ప్రిలిమ్స్
ఎంపిక ప్రక్రియలో తొలిదశ ప్రిలిమినరీ పరీక్ష 100 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహా మిగతా విభాగాలకు సంబంధించి అభ్యర్థులు తమ రాష్ట్రానికి చెందిన లేదా తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషలో పరీక్ష రాయొచ్చు.
మొత్తం 200 మార్కులకు మెయిన్
తొలిదశ ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా 1:10 నిష్పత్తిలో (ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున) తదుపరి దశ మెయిన్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరిగే మెయిన్ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో 190 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటుంది. ఇందులో–జనరల్ /ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు–40 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు. మెయిన్ ఎగ్జామ్‌లోనూ అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలను తమకు ఆసక్తి, అర్హత ఉన్న ప్రాంతీయ భాషలో హాజరయ్యే అవకాశం ఉంది.
చదవండి: 600 SBI Jobs: ఎస్‌బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.85,920 జీతం..
స్థానిక భాష పరీక్ష
అభ్యర్థులు తాము పరీక్షకు హాజరయ్యే మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే పరీక్ష పేపర్ మాధ్యమం ఉంటుంది. ఒకవేళ మాతృ భాష కాకుండా వేరే భాషల్లో పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపిన అభ్యర్థులకు.. మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత ప్రత్యేకంగా వారు ఎంపిక చేసుకున్న భాషలో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సర్కిల్‌లో అధికార భాషకు సంబంధించిన లాంగ్వేజ్ టెస్ట్‌కు హాజరు కావాలి.
ప్రిపరేషన్ ఇలా
ఎస్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం–ప్రిలిమినరీ పరీక్షను 2025 ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశముంది. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ మార్చి/ఏప్రిల్‌లో జరుగుతుంది. అభ్యర్థులకు ప్రిలిమ్స్‌కు గరిష్టంగా నెలన్నర, మెయిన్స్‌కు మూడు /నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ పరీక్ష తేదీ వరకు.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో కామన్‌గా ఉన్న సబ్జెక్ట్‌ల సన్నద్ధత సాధించాలి. ఆ తర్వాత మెయిన్స్‌పై దృష్టి పెట్టాలి. మెయిన్‌లో మాత్రమే ఉన్న జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇడియమ్స్, ఫ్రేజెస్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్‌మెంట్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
న్యూమరికల్ ఎబిలిటీ
మెయిన్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సరితూగే విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ప్రధానంగా అర్థమెటిక్ అంశాల (పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలు)పై పూర్తిగా అవగాహన పొందేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై పట్టు సాధించాలి.
రీజనింగ్
ఈ విభాగం ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్ సమయానికే ఈ అంశాల్లో పట్టు సాధిస్తే.. మెయిన్‌లో అధిక శాతం సిలబస్‌ను పూర్తి చేసినట్లవుతుంది.
జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్
మెయిన్‌లో మాత్రమే ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. తాజా బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ప్రాధాన్యం ఇవ్వాలి.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్
అభ్యర్థులకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించే ఉద్దేశంతో మెయిన్‌లో పొందుపరిచిన విభాగమిది. దీనికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీబోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి.
మాక్ టెస్టులు
అభ్యర్థులు గత ప్రశ్న పత్రాల సాధన, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు. దీనిద్వారా ఆయా విభాగాలు, అంశాల పరంగా ఏ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్‌కు ఎంత వెయిటేజీ ఉంటుందనే విషయంపై అవగాహన లభిస్తుంది. గ్రాండ్ టెస్ట్‌ల సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా.. తాము ఇంకా అవగాహన పొందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్ టెస్ట్‌లకు హాజరవడం వల్ల పరీక్ష హాల్లో టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది.
సీజీఎం స్థాయికి
ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్‌గా కొలువులో చేరితే..భవిష్యత్‌లో పదోన్నతుల ద్వారా చీఫ్ మేనేజర్,డీజీఎం వంటి ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధిస్తే.. ట్రైనీ ఆఫీసర్ హోదా లభిస్తుంది. జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ విధానంలో 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే సమయానికి డీజీఎం హోదాకు చేరుకోవచ్చు. ప్రస్తుతం అమలవుతున్న సర్వీస్ నిబంధనల ప్రకారం క్లర్క్ స్థాయిలో కొలువుదీరిన వారు చీఫ్ మేనేజర్ స్థాయికి చేరుకునే వీలుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2025, జనవరి 7
- ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2025 ఫిబ్రవరిలో
- మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ: 2025 మార్చి/ఏప్రిల్‌లో
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bank.sbi/web/careers/current-openings
Tags
- SBI Junior Associate
- Sbi Junior Associates Guidance
- Notification out for 13735 Junior Associates post at SBI
- SBI Clerk Recruitment 2024
- SBI Clerk Recruitment 2025
- SBI recruitment Junior Associate 2024
- SBI Junior Associate Syllabus
- 13735 Jobs for SBI
- SBI Clerk Notification 2025 Out Apply Online
- SBI Clerk Exam Guidance
- Jobs
- latest jobs