APPSC Group 1 Ranker: గ్రూప్–1 పరీక్షల్లో మెరిసిన తెనాలి తేజం
![Toppers of APPSC Group 1 Exam 2023,Tenali Tejam](/sites/default/files/images/2023/08/19/appsc-group-1-ranker-1692421671.jpg)
తెనాలి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో తెనాలి తేజం మెరిసింది. గురువారం సాయంత్రం వెలువడిన ఫలితాల్లో పట్టణానికి చెందిన మారంరెడ్డి స్రవంతిరెడ్డి గ్రూప్–1 సర్వీసెస్‌లో 10వ స్థానంలో నిలిచి అసిస్టెంట్ కమిషనర్ జీఎస్టీ పోస్టుకు ఎంపికై ంది. స్థానిక ఎన్‌ఆర్‌కే అండ్ కేఎస్‌ఆర్ గుప్తా కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న మారంరెడ్డి దశరథరామిరెడ్డి కుమార్తె స్రవంతిరెడ్డి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్శిటీకి అనుబంధంగా గల బాపట్ల వ్యవసాయ కళాశాలలో 2015–19లో అగ్రికల్చర్ బీఎస్సీ చదివి 93.5 జీపీఏతో స్రవంతిరెడ్డి ఉత్తీర్ణురాలైంది. 2022లో నాటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ విష్ణువర్ధనరెడ్డి చేతులమీదుగా బంగారు పతకం స్వీకరించింది. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్ పరీక్షలకు ప్రిపేరవుతూ ముందుగా వచ్చిన గ్రూప్–1 పరీక్షలు రాసిన స్రవంతిరెడ్డి తొలి యత్నంలోనే విజయం సాధించింది. అసిస్టెంట్ కమిషనర్ జీఎస్టీగా ఎంపికైంది. సివిల్స్ సాధించాలనేది తన లక్ష్యమని, గ్రూప్–1 పరీక్షల్లో విజయంతో వచ్చిన ఉద్యోగంలో చేరి, సివిల్స్ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటానని స్రవంతిరెడ్డి చెప్పారు.
చదవండి: APPSC Group 1&2 Notification: త్వరలో గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లు
బొగ్గరం యువకుడి సత్తా
ఈపూరు: పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాడు బొగ్గరం యువకుడు. గ్రూపు–1 పరీక్ష ఫలితాల్లో సత్తాచాటాడు. ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన కోటా సుబ్బారావు–నాగమల్లేశ్వరీ దంపతుల రెండో కొడుకు కోటా నాగ సతీష్ గ్రూప్–1కు ఎంపికయ్యాడు. తండ్రి కోట సుబ్బారావు గ్రామంలో చిన్నపాటి చిల్లర దుకాణం నిర్వహిస్తుంటారు. ఇద్దరు కుమారులను తన రెక్కల కష్టంతో చదివించారు. ప్రాథమిక దశ నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన సతీష్ ఇంటర్ నుంచి ప్రైవేటు కళాశాలల్లో చదివాడు. బీకాం పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ లక్ష్మణారావు ఇనిస్టిట్యూట్‌లో నాలుగేళ్లు గ్రూప్–1కు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఈసందర్భంగా నాగసతీష్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, తనకు విద్య నేర్పిన ఉపాధ్యాయుల సహకారంతో తాను ఈస్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. తాను గ్రూప్–1లో ఆదాయ పన్ను విభాగ అధికారి పోస్టును ఎంచుకున్నట్టు వివరించారు.
-అసిస్టెంట్ కమిషనర్ జీఎస్టీగా స్రవంతిరెడ్డి