Skip to main content

APPSC Group 1&2 Notification: త్వరలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు

APPSC Group1 and Group2 notifications soon

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. గ్రూప్‌–1, గ్రూప్‌–2లే కాకుండా డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్లు (డీఈవో), ఎన్విరాన్‌­మెంటల్‌ ఇంజనీర్లు, లైబ్రేరియన్లు తదితరాలు కలిపి 1,199 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు.

వీటితోపాటు 2020 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 220 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ ఇవ్వనున్నామని వెల్లడించారు. 17 ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో గ్రూప్‌–2 పరీక్షల సిలబస్, పరీక్ష విధానంలోనూ మార్పులు చేస్తున్నామన్నారు. పాత సిలబస్‌ పూర్తిగా డూప్లికేషన్‌తో ఉందని.. దీన్ని మార్చాలని అభ్యర్థుల నుంచి వినతులు వచ్చాయన్నారు. గ్రూప్‌–2లో గతంలో మూడు పేపర్లుండగా ఇప్పుడు రెండు పేపర్లుగా మార్చా­మని తెలిపారు.

చదవండి: APPSC Group 1 Rankers 2023: ఏపీపీఎస్సీ గ్రూప్‌–1లో మెరిసిన జిల్లావాసులు

కొత్త నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఏపీపీఎస్సీ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు గతంలో లాగా లోపాలు తలెత్తకుండా అంతర్గత కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

నాలుగేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 1,31,364 పోస్టుల భర్తీ
కాగా గత నాలుగేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 1,31,364 పోస్టులను భర్తీ చేశామని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపా­రు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో పోస్టుల భర్తీ జరగ­లేదని గుర్తు చేశారు. వీటిలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 1,26,728 పోస్టుల­ను భర్తీ చేశామన్నారు. మీడియా సమావేశంలో ఏపీపీఎస్సీ సభ్యులు సలాంబాబు, సుధీర్, సెలీ­నా, శంకరరెడ్డి, కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూళ్లు విడుదల
కాగా రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల షెడ్యూళ్లను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారు.

చదవండి: APPSC Group 1 & 2 Jobs Notification 2023 : ఈలోపే గ్రూప్-1 & 2 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌.. అలాగే ఈ ఉద్యోగాల‌కు కూడా..

Published date : 19 Aug 2023 10:31AM

Photo Stories