APPSC Group 1 Rankers 2023: ఏపీపీఎస్సీ గ్రూప్–1లో మెరిసిన జిల్లావాసులు
అనంతపురం: ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో జిల్లావాసులు సత్తా చాటారు. గురువారం విడుదలైన ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన భూమి రెడ్డి భవానీ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకుతో మెరిశారు. జేఎన్‌టీయూ (ఏ)లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన కే. ప్రవీణ్ కుమార్ రెడ్డి నాలుగో ర్యాంకు దక్కించుకుని పలువురితో శభాష్ అనిపించుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని గ్రామీణాభివృద్ధి విభాగంలో పరిశోధన చేస్తున్న దానం జ్ఞానానంద రెడ్డి గ్రూప్–1లో ర్యాంకు సాధించి అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ (గతంలో సీటీఓ) ఉద్యోగం దక్కించుకున్నారు.
ఇకపై డీఎస్పీ భవాని..
కదిరి: తలుపుల మండలం గంజివారిపల్లికి చెందిన టి.భవాని డీఎస్పీగా ఎంపికయ్యారు. భవాని ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో డిప్యూటి తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. అంతకు మునుపు గ్రూప్–2లో ఎంపికై వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో కూడా పని చేశారు. భవాని భర్త విశ్వనాథ్ వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ ధర్మల్ విద్యుత్ ఉత్పాదన సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. తల్లి కె.తులసి గృహిణి కాగా తండ్రి చెన్నకృష్ణ కదిరిలో ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. తమ కుమార్తె డీఎస్పీగా ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆమెను గంజివారిపల్లికి చెందిన వీఆర్‌ఓ నరసింహారెడ్డి, మరికొందరు స్థానికులు అభినందించారు.
ఎంపీడీఓ కుమారుడు..
బెళుగుప్ప ఎంపీడీఓ గాజుల శ్రీరాములు, లక్ష్మి దంపతుల కుమారుడు గాజుల రామచంద్రవరుణ్ గ్రూప్–1 ఫలితాల్లో సత్తాచాటి ఎంపీడీఓగా ఎంపికయ్యారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రిలిమ్స్‌కు హాజరై అర్హత సాధించారు. జూన్‌లో జరిగిన మెయిన్స్‌లో ప్రతిభ చూపి ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. విజయవాడలో ఆగస్టు 3న జరిగిన ఇంటర్వూల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. గురువారం సాయంత్రం విడుదలైన మెయిన్స్ ఫలితాల్లో ఎంపీడీఓగా ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్–1లో 110 పోస్టులు ఉండగా, 16 ఎంపీడీఓ పోస్టులు ఉన్నాయి. ఇందులో గాజుల రామచంద్ర వరుణ్ ఎంపిక కావడం గమనార్హం.
నాన్న స్ఫూర్తితోనే
ఎన్‌పీ కుంట మండలం, మర్రికొమ్మ దిన్నె మా స్వగ్రామం. నాన్న వీఆర్వోగా పనిచేస్తున్న సమయంలోనే గ్రూప్–1 సాధించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నా. అమ్మ అరుణ కుమారి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 అధికారి కావాలనే నాన్న కల నన్ను ఇంత వరకు నడిపించింది. కానీ ఆ కల నెరవేరే సమయానికి ఆయన లేరనే బాధ ఉంది. నా భార్య రవళి గ్రూప్–1కు సన్నద్ధమవుతున్నారు. ఎస్కేయూలో రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందడమే నాకు జీవితంలో ఒక మలుపు లాంటిది. అక్కడ పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులే నాకు స్ఫూర్తి.
– జ్ఞానానంద రెడ్డి, ర్యాంకర్