AP 10th Class Results 2022: ఈ ఫలితాలే... అసలు సిసలైనవి.. ఎందుకంటే..!
ఈ పరీక్షలలో కేవలం 67.26 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. నూటికి 67.26 శాతం అంటే అవి మంచి ఫలితాలే అని చెప్పవచ్చు. కానీ పత్రికల దగ్గర నుంచీ ప్రతిపక్షాల వరకూ పదవ తరగతిలో ఫలితాలు పడకేశాయి అంటూ చేస్తున్న విమర్శలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. వారి విమర్శలకు కారణం గత పదేళ్లుగా పదవతరగతి పరీక్షల్లో 90 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత అవుతూ వస్తున్నారు. 2011–2014 మధ్య కాలంలో 85 శాతం పైనే ఉన్న ఉత్తీర్ణత, 2015–2019 కి 95 శాతానికి చేరింది. నూటికి 95 శాతం మంది ఉత్తీర్ణులైన ఫలితాలు నిజమైనవా? లేక 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైన ఫలితాలు నిజమైనవా? అనే సందేహం సామాన్య ప్రజ లకు కలగకమానదు.
AP 10th Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సప్లిమెంటరీ పరీక్షల్లో..
‘పాస్ గ్యారెంటీ.. నూటికి తొంభై మార్కులు’..
ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా గత దశాబ్ద కాలంగా.. ‘పాస్ గ్యారెంటీ, నూటికి తొంభై మార్కులు’ వంటి వాగ్దానాలకు అలవాటు పడిపోయి ఆ వాగ్దానాలు చేసిన కార్పొరేట్ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్చడం మొదలుపెట్టారు కదా! తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అడుగంటాయి. కేవలం మన రాష్ట్రంలోనే ఈ కార్పొరేట్ సంస్థల మాయాజాలం నడుస్తోంది. అందుకనే దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో రాని ఫలితాలు మన దగ్గర వస్తున్నాయి. గుజరాత్‌లో నిర్వహించిన పదవ తరగతి ఫలితాల్లో కూడా కేవలం 65 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదయ్యింది.
MPC Course Benefits : ఇంటర్‌లో ఎంపీసీ కోర్సు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఇవే..
ఈ పరీక్షలలో ఎందుకు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు? అంటే..
నూటికి 95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు అంటే మన రాష్ట్రంలోని పిల్లలందరూ మేధావులేనా? మరి ఇంతమంది మేధావులు ఐఐటీ, జేఈఈ మెయిన్స్, ‘నీట్’ వంటి పరీక్షలలో ఎందుకు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు? అంటే.. ఈ ఫలితాలన్నీ కూడా బోగస్ అనే కదా అర్థం. కొంతకాలంగా పాఠశాల విద్యా వ్యవస్థలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఆధిపత్యం పెరిగిపోయింది. వారి కనుసన్నల్లోనే పరీక్షల నిర్వహణ కూడా జరగడం వల్ల, పెద్ద ఎత్తున పరీక్ష ప్రశ్నా పత్రాలు లీక్ అవ్వడం, మాస్ కాపీయింగ్ జరిగేవి. చివరకు పరీక్ష పత్రాల మూల్యాంకనంలో కూడా వారి పెత్తనమే కొనసాగడం వల్ల... నూటికి 95 శాతం ఉత్తీర్ణతలు సాధించడం సాధ్యమయింది. ఆ ఫలితాలను ఉపయోగించుకుని వ్యాపార ప్రకటనల ద్వారా అమాయకులైన తల్లిదండ్రులను ఏమారుస్తూ, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ వచ్చారు.
After 10th Bipc Courses Benefits : ఇంటర్‌లో 'బైపీసీ' కోర్సు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏటంటే..?
ఈ ఫలితాలు ప్రతి ఒక్కరికీ ఒక గుణపాఠం..
ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన వినూత్న బోధనా పద్ధతుల కారణంగా, కఠినంగా పరీక్షలు నిర్వహించినా 67 శాతం ఫలితాలు వచ్చాయి. ఏది ఏమైనా ఈ ఫలితాలు ప్రతి ఒక్కరికీ ఒక గుణపాఠం నేర్పాయి. కరోనా వంటి విపత్కర కాలంలో విద్యా వ్యవస్థకు వెన్నుదన్నుగా ఎలా నిలవాలో ప్రభుత్వానికి సూచిస్తే.. చూచి రాతలు, కాపీలు, ప్రశ్నాపత్రాల లీకేజీ, మూల్యాంకనలో పైరవీలు లేకుండా పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో కార్పొరేట్ పాఠశాలలకు పాఠం చెప్పాయి. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తాము విద్యార్థుల పట్ల ఎటువంటి శ్రద్ధ కనబరచాలో గుర్తుచేశాయి. అలాగే కార్పొరేట్ పాఠశాలల్లో డొల్లతనాన్ని కళ్ళకి కనపడేటట్టు చేసి ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని తెలియజెప్పాయి.
– వ్యాసకర్త ప్రిన్సిపాల్, ఇంజినీరింగ్ కాలేజీ, ఏఎన్‌యూ