Skip to main content

Jagananna Vidya Deevena: తీర్పును పునఃసమీక్షించండి

‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను కాలేజీల ఖాతాలకే జమచేయాలన్న తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
High Court
హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌

వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలోనే జమ చేసేందుకు వీలు కల్పిస్తూ జారీ చేసిన జీవో 28ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. స్కాలర్‌షిప్‌లు, ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా కాలేజీల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై నవంబర్‌ 25న జస్టిస్‌ విజయలక్ష్మి విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, కోర్టు తీర్పుననకు అనుగుణంగా పథకంలో మార్పులు చేశామని చెప్పారు. తల్లి ఖాతాలో రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను జమ చేస్తే సంబంధిత కాలేజీకి తెలిసేలా మార్పులు చేశామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఫీజును ఎవరైనా కాలేజీకి చెల్లించకపోతే, ఆ కాలేజీలు జ్ఞానభూమి వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. వార్డు, గ్రామ వలంటీర్‌లు తల్లుల వద్దకు వెళ్లి ఫీజు చెల్లించేలా చూస్తారని వివరించారు. జీవో 28ని సవాలు చేసిన అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకృష్ణదేవరాయ ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఎస్‌హెచ్‌ఆర్‌ ప్రసాద్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, ఈ పునఃసమీక్ష పిటిషన్ ను కొట్టవేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ పిటిషన్ పై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

చదవండి: 

LAWCET: కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఇదే..

Justice Durga Prasad Rao: న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులకు విపరీతమైన డిమాండ్‌

Vijaya Mohan: ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు’లో ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి

Published date : 26 Nov 2021 02:58PM

Photo Stories