Skip to main content

Education: పేద పిల్లల విద్యపైనా రామోజీ ఏడుపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
Education
పేద పిల్లల విద్యపైనా రామోజీ ఏడుపు

రాష్ట్ర బాలలు అత్యున్నతస్థాయి ప్రమాణాలను అందుకుంటున్నారు. సీఎం జగన్‌ చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయి. పలు రాష్ట్రాలు, విదేశీ ప్రతినిధులు ఇక్కడి పాఠశాలల్ని పరిశీలించి, ఇవే చర్యలు వారి ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు నిర్ణయిస్తున్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఏ ఒక్క పాఠశాలా మూతపడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.

ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. వాస్తవానికి చంద్రబాబునాయుడు హయాంలో 1,785 స్కూళ్లు మూతపడగా, వాటన్నింటినీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి తెరిపించింది. విద్యా రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలతో ప్రజల్లో ముఖ్యమంత్రి పట్ల, ప్రభుత్వం పట్ల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఈనాడు రామోజీరావుకు నిద్ర పట్టడంలేదు. విద్యా రంగంపై రోజూ అసత్యాలతో ఈనాడులో వార్తలు వండివారుస్తున్నారు. అందులో భాగంగానే జూలై 24న‌ ఓ అసత్య కథనాన్ని ఈనాడు ప్రచురించింది. 

చదవండి: DEO Jagan Mohan Reddy: ప్రాథమిక విద్య విద్యార్థి జీవితానికి పునాది

గత మూడేళ్లలో తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యారంగంలో ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయి. పిల్లల్లో ఆరేళ్ల లోపు మెదడు ఎదుగుదల ఉంటుందని, ఆ సమయంలో వారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించాలన్న సత్సంకల్పంతో కేంద్ర నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ఫౌండేషన్‌ స్కూలు విధానాన్ని చేపట్టింది. పీపీ 1, పీపీ 2, 1, 2 తరగతుల పిల్లలకు ప్రత్యేకంగా ఫౌండేషన్‌ స్కూళ్లను ఏర్పాటు చేసింది.

3 వ తరగతి నుంచి పిల్లలకు సబ్జెక్టు టీచర్లతో బోధన సాగించేందుకు అప్పర్‌ ప్రైమరీ, హైస్కూళ్లకు అనుసంధానం చేసింది. దీనివల్ల 3వ తరగతి నుంచే సబ్జెక్టులపై పరిపూర్ణమైన పరిజ్ఞానం పెరుగుతుంది. పై తరగతుల్లోకి వెళ్లేకొద్దీ సబ్జెక్టుల్లో రాటుదేలుతారు. ఉన్నత విద్యలోనూ ఉన్నత ప్రమాణాలు అందుకుంటారు. తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పోటీనయినా ఎదుర్కొనగలుగుతారు.

హైస్కూళ్లలోని ఆట స్థలాలు, లైబ్రరీ, లేబోరేటరీ వంటివి కూడా వారికి అందుబాటులోకి వస్తాయి. గతంలోలా కాకుండా 3 వ తరగతి నుంచే పిల్లలు హైస్కూల్‌ వాతావరణానికి అలవాటు పడి, డ్రాపవుట్ల సంఖ్య కూడా పూర్తిగా తగ్గుతుంది. మన బడి నాడు – నేడు, ఆంగ్ల మాధ్యమం, డిజిటల్‌ తరగతులు, ఐఎఫ్‌పీ ప్యానెళ్ల ఏర్పాటు, జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన సహా అనేక పథకాలు విద్యా రంగం రూపురేఖలనే మార్చివేశాయి. వీటికోసం ప్రభుత్వం నభూతో నభవిష్యతి అన్నట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పిల్లల చదువులపై మేనమామగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను తల్లిదండ్రులు కొనియాడుతున్నారు. 

చదవండి: Famous Scientist Interaction: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త

జీర్ణించుకోలేకపోతున్న రామోజీరావు 

ప్రజల్లో ప్రభుత్వానికి పెరిగిపోతున్న మంచి పేరును చూసి రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో వేల స్కూళ్లు మూతపడ్డాయి. తన బినామీ సంస్థలుగా ఉన్న నారాయణ, చైతన్య స్కూళ్లను పెంచి పోషించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు సాధారణంగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా స్కూళ్లను నిర్వీర్యం చేసినా ఈనాడు ఒక్క అక్షరమూ రాయలేదు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పేద విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతుంటే ఈనాడు కడుపు మంటతో తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. ఇలాంటి చర్యలు ఆపకపోతే ఈనాడు, రామోజీరావుపై న్యాయపరమైన చర్యలు తప్పవని విద్యా శాఖ హెచ్చరించింది. 

ఎన్నో కార్యక్రమాలతో విద్యా రంగం ముందంజ 

  • గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పాఠశాల విద్యార్థులు తరగతులకు తగ్గ సామర్థ్యాలను అందుకోలేకపోయారు. దీన్ని సరిచేయడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఫౌండేషన్‌ విద్య, మ్యాపింగ్‌ వంటి చర్యలు చేపట్టింది. దీనివల్ల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెరిగాయి. ప్రభుత్వ పరిధిలోని అన్ని వనరులను సమర్థంగా వినియోగించుకొని పిల్లలను ప్రపంచపౌరులుగా తీర్చిదిద్దేందుకు కొత్త విధానం ఉపకరిస్తోంది 
  • గతంలో లేని ప్రీప్రైమరీ విద్యను పిల్లలకు అందుబాటులోకి తెచ్చి çపూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసింది. 
  • 3వ తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్టు టీచర్లతో బోధన వల్ల వారిలో ప్రమాణాలు పెరుగుతున్నాయి 
  • గతంలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండే 18 సబ్జెక్టులను ఒకరిద్దరు టీచర్లు పూర్తి చేయడం కష్టంగా ఉండేది. విద్యార్థులకు సరైన పరిజ్ఞానం కూడా అందేది కా­దు. 5వ తరగతి నుంచి 6వ తరగతిలో చేరే విద్యార్థులు ఎలాంటి ప్రమాణాలు లేనందున పై తరగతుల్లో వారిని తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకు భారంగా ఉండేది. కొత్త విధానంతో విద్యార్థుల్లో ఆ లోపం కనుమరు­గైంది. దీనిని టీచర్లు, హెడ్మాస్టర్లు కూడా స్వాగతించారు. 
  • 2022–23 విద్యా సంవత్సరంలో 1 కిలోమీటర్‌ పరిధిలో 8,643 స్కూళ్లు ఉండగా వాటిలో కేవలం 4,943 ప్రైమరీ, యూపీ స్కూళ్లను మాత్రమే 3,557 హైస్కూళ్లకు మ్యాపింగ్‌ చేసింది. 2,43,540 మంది విద్యార్థులు హైస్కూళ్లకు మ్యాపింగ్‌ అయ్యారు. 
  •  మ్యాపింగ్‌ అయిన హైస్కూళ్లలో 66,245 మంది సబ్జెక్టు టీచర్లు అవసరం కాగా ఇప్పటికే 59,663 మంది పనిచేస్తున్నారు. 6,582 మంది సబ్జెక్టు టీచర్లను ప్రభుత్వం పదోన్నతుల ద్వారా అందుబాటులోకి తెచ్చింది. 
  • విద్యార్థుల సదుపాయం కోసం 13,868 అదనపు తరగతులను కూడా ప్రభుత్వం నాడు – నేడు ద్వారా నిర్మించింది. 
  •  జననాల రేటు తగ్గడం వల్ల 2019 నుంచి ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లలో చేరికల్లో తగ్గుదల కనిపిస్తోంది.

పత్తిపాడు మండలం నిమ్మగడ్డవారిపాలెం స్కూలు వాస్తవం ఇది 

  • ఈనాడులో అసత్యపు వార్తలో పేర్కొన్న పత్తిపాడు మండలం నిమ్మగడ్డవారిపాలెం ఎంపీపీఎస్‌ స్కూలు అసలు మ్యాపింగ్‌ చేయలేదు. గత ఏడాది 5 మంది విద్యార్థులలో ఇద్దరు రెండో తరగతి, ఇద్దరు నాలుగో తరగతి, ఒకరు ఐదో తరగతి చదివా­రు. 2023–24 విద్యా సంవత్సరంలో వీరిలో నలుగురు ప్రైవేటు స్కూల్లో చేరగా, మరో విద్యార్థి రేపల్లె ఎస్టీ హాస్టల్‌లో చేరాడు. 
  • ఈ స్కూలుకు అనుసంధానంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో మూడేళ్ల వయసు పిల్లలు 8 మంది ఉన్నారు.  2023–24లో ఐదుగురు చేరారు.

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కొలుములపేట ఎంపీపీ స్కూలు వాస్తవాలు ఇవీ.. 

  • కొలుముల పేట గ్రామం చింతలచెరువు గ్రామానికి కిలోమీటర్‌ దూరంలో శివారు గ్రామంగా ఉంది. గత ఏడాది ఈ స్కూల్లో 2వ తరగతిలో ఐదుగురు, 3వ తరగతిలో ఐదుగురు, 4వ తరగతిలో నలుగురు, 5వ తరగతిలో ఐదుగురు ఉండేవారు. 3 నుంచి 5 తరగతులను కిలోమీటర్‌ లోపు దూరంలో ఉన్న చింతలచెరువు హైస్కూలుకు మ్యాపింగ్‌ చేశారు. విద్యార్థులందరూ హైస్కూలుకు వెళ్తున్నారు. గత ఏడాది కానీ, ఈ ఏడాది కానీ ఎలాంటి సమస్యా ఇక్కడ లేదు. 
  • మిగిలిన 1, 2 తరగతుల్లో ఇద్దరు ఒకటో తరగతి చదువుతుండగా, రెండో తరగతిలో ఎవరూ లేరు. ఒకటో తరగతిలో ఉన్న ఇద్దరు పిల్లలను తల్లిదం­­డ్రుల అభీష్టం మేరకు చింతలచెరువు ఎంపీపీ స్కూలులో చేర్చారు. వారు రెగ్యులర్‌గా ఆ స్కూలుకు వెళ్తున్నారు. చింతలచెరువు స్కూల్లో 348 మంది విద్యార్థులున్నారు. వారికి సరిపడా టీచర్లను ప్రభుత్వం నియమించింది.

అనకాపల్లి జిల్లా గొలుగొండ­పేట స్కూలు స్థితి ఇదీ 

  • ఈ స్కూలులో 31 మంది విద్యార్థులున్నారు. 3 నుంచి 5 తరగతులను చినగొలుగొండపేట యూపీ స్కూలుకు మ్యాపింగ్‌ చేశారు. కిలోమీటర్‌లోపు ఉన్న ఈ స్కూలుకు ఇక్కడి విద్యార్థులు రెగ్యులర్‌గా వెళ్తున్నారు. గొలుగొండపేట ప్రైమరీ స్కూలులోని 1, 2 తరగతుల్లో ఆరుగురు విద్యార్థులున్నారు. ఈ ఏడాది కొత్తగా ఎవరూ చేరలేదు. రెండో తరగతి విద్యా­ర్థులు చినగొలుగొండపేట యూపీ స్కూల్లో చేరారు. 

తిరుపతి అర్బన్‌లోని మున్సిపల్‌ స్కూలు.. వాస్తవం ఇదీ 

  • ఈ స్కూలును మ్యాపింగ్‌ చేయలేదు. గత ఏడాది ఇక్కడ ఏడుగురు విద్యార్థులు ఉండేవారు. వారిలో ఐదుగురు ప్రత్యేక అవసరాలున్న పిల్లలు. వారిని తిరుపతిలోని టీటీడీ డఫ్‌ అండ్‌ డమ్‌ స్కూలులో చేర్చారు. మిగతా ఇద్దరు పిల్లలు 5వ తరగతి పూర్తి చేయడంతో సమీపంలోని హైస్కూలులో చేరారు.
  • ఈ స్కూళ్లకు సంబంధించి ప్రత్యేకంగా చేరికల డ్రైవ్‌ నిర్వహించి పిల్లలను చేర్చే ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ యుద్ధప్రాతిపదికన చేపట్టింది. త్వరలోనే ఈ స్కూళ్లలో పిల్లలను చేర్చి తరగతులను కొనసాగించేలా చర్యలు తీసుకుంటోంది.   
Published date : 25 Jul 2023 05:01PM

Photo Stories