Education: బాలికల విద్యకు భరోసా
ముఖ్యంగా బాలికల కోసం మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ప్రభుత్వ విద్యా విధానం మెరుగు పడడమే కాకుండా ఎక్కువ మంది వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మే 19న ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మరుగుదొడ్ల నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 245 మండలాల్లో మాత్రమే బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయని, మిగిలిన 434 మండలాల్లో జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తేవాలని సూచించారు. అందుకోసం కేజీబీవీ లేదా హైస్కూల్‌ను ప్లస్ 2 స్థాయికి పెంచడం లేదా ఉన్న కాలేజీల్లోనే బాలికలకు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం చేస్తే విద్యార్థులు వినియోగించుకునే అవకాశాలు మెరుగు పడతాయని చెప్పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
23,975 స్కూళ్లలో నాడు–నేడు రెండోదశ
- పాఠశాలల ప్రమాణాలను పెంచేందుకు నాడు–నేడు కార్యక్రమం చేపట్టాం. రెండో దశలో భాగంగా 23,975 స్కూళ్లలో రూ.8 వేల కోట్లతో సమూల మార్పులు చేయాలి. అన్ని స్కూళ్లలో నెల రోజుల్లో పనులు నూరు శాతం ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
- ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం పెంచేలా చర్యలు తీసుకోవాలి. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, మరుగుదొడ్ల నిర్వహణ సమర్థవంతంగా ఉండేలా చూడాలి. అందుకోసం పక్కాగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) పాటించాలి.
- గోరుముద్ద (మధ్యాహ్న భోజనం)పై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఎక్కడా రాజీ పడకుండా పూర్తి నాణ్యతతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం. టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్), స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్), గోరుముద్ద పథకాన్ని మరింత మెరుగ్గా ఎలా అమలు చేయవచ్చో అధికారులు ఆలోచించాలి.
- విద్యార్థులకు అందించే విద్యా కానుక నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కిట్లు ఉండాలి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరిచే జూలై 4 నాటికి కిట్లు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జూన్ లో అమ్మ ఒడి అమలు చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి.
- ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సర్వశిక్షా అభియాన్ ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మీ స్ఫూర్తితోనే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం
- బెండపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సీఎం వైఎస్ జగన్ తో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియంలో బోధన వంటి గొప్ప కార్యక్రమాల ద్వారా మీరే మాకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.
- విభజన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇన్ని గొప్ప పథకాలు ప్రవేశపెడుతున్నారని, మీ వల్లే ఇంత గొప్పగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకోగలుగుతున్నామని ఎనిమిదో తరగతి విద్యార్థిని తేజస్విని ఆనందం వ్యక్తం చేసింది. తన చెల్లితో కలిసి కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బులు రూ.929 సీఎంకు విరాళంగా అందజేసింది. అయితే బాలిక గుర్తుగా సీఎం కేవలం రూ.19 తీసుకుని మిగతా డబ్బును తిరిగిచ్చారు.
- పదో తరగతి విద్యార్థిని మేఘన ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగపడిందని, తాను తన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆంగ్ల భాషపై పట్టు సాధించానని చెప్పింది. అంతర్జాతీయ ఇంగ్లిష్ న్యూస్ చానెళ్లు కూడా తన భాషా పరిజ్ఞానానికి ఎంతో ఉపయోగపడ్డాయంది.
- మరో విద్యార్థిని రిష్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టింది సీఎం జగన్ మాత్రమేనని, తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ప్రపంచంతో అనుసంధానం అయ్యేందుకు ఇంగ్లిష్ మాత్రమే ఉపయోగ పడుతుందని పేర్కొంది.
- ఏడో తరగతి విద్యార్థి అనుదీప్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై వస్తున్న విమర్శలను పట్టించుకోవద్దు. మీ నిర్ణయంపై మీరు (సీఎం) య«థావిధిగా ముందుకెళ్లాలి. మీ నమ్మకాన్ని మేం వమ్ము చేయం. మీ వెనుక మేముంటాం. నేను బాగా చదువుకుని ఐఏఎస్ అవుతా. అప్పుడూ మీరే సీఎంగా ఉండాలి. నేను మీ వద్ద సెక్రటరీగా పనిచేసి ఇప్పుడు విమర్శిస్తున్న అందరి నోళ్లు మూయిస్తా. నాకు ఆ అవకాశం ఇస్తానని మాటివ్వండి’ అని కోరాడు. అనుదీప్ మాటలపై సీఎం జగన్ తో పాటు అక్కడున్న అధికారులంతా ఆనందపడ్డారు.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 37 వేల అదనపు తరగతి గదులు అవసరం. నాడు–నేడు రెండో దశలో వీటి నిర్మాణం చేపట్టనున్నాం. ఇంగ్లిష్ భాషా బోధన, అభ్యాసం, ఫొనెటిక్స్ కోసం ప్రత్యేకంగా గూగుల్ సహకారంతో ‘గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్’ను రూపాందించాం. దీనిని మే 20న అందుబాటులోకి తేనున్నాం. సమగ్రమైన ఇంగ్లిష్ బోధనకు ఈ యాప్ చాలా ఉపయోగకరం. అమ్మ ఒడికి బదులుగా రాష్ట్రంలో 8.21 లక్షల మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు కావాలని ఆప్షన్ ఎంచుకున్నారు.
– సీఎం వైఎస్ జగన్ తో అధికారులు