School education: ఒకే గొడుగు కిందకు పాఠశాల విద్య
జూన్ 6న టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2,095 మునిసిపల్ స్కూళ్ల పర్యవేక్షణను పాఠశాల విద్యాశాఖకు కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, టీచర్ల సంఘాల ప్రతినిధులు గతంలో తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కోరారని చెప్పారు. ఈ స్కూళ్లు ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో ఉన్నందున విద్యా వ్యవహారాలు, పాలనాపరమైన అంశాలపై విద్యాశాఖ సూచనలను అనుసరించి ముందుకు వెళ్లడంలో సమన్వయ లోపం ఏర్పడుతోందని వారు తన దృష్టికి తెచ్చారన్నారు. ఇటీవల ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఒకే విభాగం పర్యవేక్షణలో అన్ని స్కూళ్లు ఉండడమే మంచిదని భావించి అందుకు ఆమోదం తెలిపారన్నారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నట్లు చెప్పారు.
చదవండి: ఏపీ పదో తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఆస్తులన్నీ పురపాలక సంస్థల పరిధిలోనే
మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన ఆస్తులన్నీ పురపాలక సంస్థల పరిధిలోనే ఉంటాయని, కేవలం అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను మాత్రమే విద్యాశాఖ పర్యవేక్షిస్తుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియెట్ బోర్డు విలీనంపై మంత్రి స్పందిస్తూ దీనిపై జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫౌండేషన్ విద్యను బలోపేతం చేసే దిశగా కొత్త విధానంపై చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దీనిపై పాఠశాలల మ్యాపింగ్, తరగతుల మెర్జింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. శాటిలైట్ స్కూల్స్ (ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2), ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు), ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1–5 తరగతులు), ప్రీ హైస్కూల్స్ (3 నుంచి 7 లేదా 8వ తరగతి), హైస్కూల్స్ (3 నుంచి 10 తరగతి), హైస్కూల్ ప్లస్ (3 నుంచి 12వ తరగతి) విధానంలో ఉండేలా కసరత్తు చేస్తున్నామన్నారు. నాడు – నేడు ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే కాకుండా బోధనా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు తగినంత మంది టీచర్లను నియమించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు.