Text Books in Schools: బడులు తెరిచేలోగా పాఠ్య పుస్తకాలు

సాక్షి, హైదరాబాద్‌: వేసవి సెలవుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరిచేలోగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలను బడులకు చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. రెండు విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యూనిఫారాల తయారీ సంస్థల ఎంపికను కొత్తగా ఏర్పాటైన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించనున్నారు.

ముందే కాంట్రాక్ట్‌ ప్రక్రియతో.. 

పాఠ్య పుస్తకాలు, యూనిఫారాల పంపిణీపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఏటా బడులు తెరిచిన రెండు, మూడు నెలల వరకు పుస్తకాల పంపిణీ జరగకపోవడం, తరగతులకు ఇబ్బంది అవడంపై అందులో చర్చించారు. దీనివల్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయని.. ఆలస్యంగా బోధన చేపట్టడంతో హడావుడిగా సిలబస్‌ను ముగించాల్సి వస్తోందని అభిప్రాయానికి వచ్చారు.

కొన్నేళ్లుగా కాంట్రాక్టుల ప్రక్రియ లో ఆలస్యం అవుతుండటం, కాంట్రాక్టర్లకు పేపర్‌ సకాలంలో దొరక్క ప్రింటింగ్‌కు ఆలస్యం అవుతుండటం కూడా దీనికి కారణమని గుర్తించారు. ఈ క్రమంలో ఈసారి ముందే కాంట్రాక్ట్‌ ప్రక్రియ చేపట్టామని అధికారులు చెప్తున్నారు. 

చదవండి: Model School Entrance Exam: మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో తనిఖీ.. హాజరైన విద్యార్థుల సంఖ్య!

మే నెలాఖరు నాటికి 1.40 కోట్ల పుస్తకాలు 

2024–25 విద్యా సంవత్సరంలో మొత్తంగా 1,98,06, 381 పాఠ్య పుస్తకాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది పంపిణీ చేయగా 8,31,121 పుస్తకా లు మిగిలిపోయాయి. ఇంకా 1,89,75,260 పుస్తకాలు అవసరం. ఇందులో 1.40 కోట్ల పుస్తకాలను మే నెలాఖరు నాటికల్లా బడులకు చేర్చాలని నిర్ణయించారు. మిగతా పుస్తకాలను స్కూళ్లు తెరిచే నాటికి అందించవచ్చని భావిస్తున్నారు.

చదవండి: World Record: స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ డుప్లాంటిస్ ప్రపంచ రికార్డు

పాఠశాల ప్రింటింగ్‌ విభాగం ఈ పుస్తకాలను జిల్లా కేంద్రాలకు చేరుస్తుంది. అక్కడి నుంచి మండలాలు, పాఠశాలలకు చేర్చాల్సి ఉంటుంది. గతంలో మండల కేంద్రాల నుంచి హెడ్‌ మాస్టర్లు స్కూళ్లకు తీసుకెళ్లే విధానం ఉండేది. ఈ విధానాన్ని గత ఏడాది మార్చారు. జిల్లా పరిధిలో అన్ని స్కూళ్లకు పుస్తకాలను పంపిణీ చేసే బాధ్యతను ఒక సంస్థకు అప్పగిస్తున్నారు. 

ఆదర్శ కమిటీలకే యూనిఫారాల బాధ్యత 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫారాలను అందిస్తారు. ఈ బాధ్యతను ఈసారి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించాలని నిర్ణయించారు. గతంలో స్థానిక మహిళా సంఘాల ద్వారా దుస్తులను కుట్టించేవారు. వస్త్రాన్ని చేనేత సంస్థల నుంచి కొనుగోలు చేసేవారు. దీనివల్ల ఆలస్యమవుతోందని అధికారులు భావిస్తున్నారు.

జిల్లా కేంద్రం యూనిట్‌గా ఒకే సంస్థకు యూనిఫారాల తయారీ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ‘అమ్మ’కమిటీలు.. స్కూళ్లలో ఎంత మందికి, ఏయే సైజుల్లో యూనిఫారాలు అవసరమనేది గుర్తిస్తాయి. యూనిఫారాలు స్కూళ్లకు చేరి, విద్యార్థులకు అందేదాకా పర్యవేక్షిస్తాయి.   
 

#Tags