Good News for Singareni Employees: సింగరేణి వర్కర్లకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు

సాక్షి, హైదరాబాద్‌: కారుణ్య నియామకాల ద్వారా సింగరేణి భూగర్భ గనుల్లో బదిలీ వర్కర్లు, జనరల్‌ వర్కర్లుగా పనిచేస్తున్న వారికి ఉన్నతస్థాయి ఉద్యోగాలు లభించనున్నాయి.

ఇప్పటివరకు సింగరేణిలోని వివిధ విభాగాల్లో ఖాళీ అయిన 986 పోస్టులకు ఇన్‌సర్వీసు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సింగరేణి సంస్థ ఇటీవల రెండు నోటిఫికేషన్లను జారీ చేసింది. ఇందులో 204 అధికార హోదా కలిగిన పోస్టులుండగా, 782 టెక్నికల్‌ పోస్టులున్నాయి.

కారుణ్య నియామకాలు పొందిన 16 వేల మంది యువకుల్లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌తో పాటు పాలిటెక్నిక్‌ డిప్లొమా, ఐటీఐలు పూర్తి చేసిన వారు ఎక్కువగా ఉన్నారని, వీరికి ఉన్నత ఉద్యోగావకాశాలు కల్పించేందుకే ఈ నోటిఫికేషన్లు విడుదల చేశామని సింగరేణి కార్యాలయ వర్గాలు మార్చి 15న‌ ఒక ప్రకటనలో వెల్లడించాయి.

చదవండి: Singareni: సింగరేణిలో రాణిస్తున్న మహిళా ఉద్యోగులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సింగరేణి సీఎండీ ఎన్‌.బలరాం నేతృత్వంలో 20 రోజుల వ్యవధిలోనే ఈ నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపాయి. వీటితో పాటు మరో 599 ఎక్స్‌టర్నల్‌ పోస్టుల్లో కూడా సింగరేణి ఇన్‌సర్వీస్‌ ఉద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని, ఈ లెక్కన 1,585 ఉద్యోగాల కోసం సింగరేణి సిబ్బంది పోటీపడే అవకాశం లభించిందని తెలిపాయి.

కాగా, సింగరేణి చరిత్రలో తొలిసారి పెద్ద ఎత్తున ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్లు విడుదల చేశామని, ఉన్నతస్థాయి డిగ్రీలున్న సింగరేణి ఇన్‌సర్వీసు ఉద్యోగులకు ఇదో గొప్ప అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో సింగరేణి సీఎండీ ఎన్‌. బలరాం కోరారు.  

చదవండి: Singareni Jobs: సింగరేణి ఉద్యోగులకు గోల్డెన్‌ చాన్స్‌

#Tags