NEET Exam 2024 : నీట్ పరీక్షలో వివాదాలు.. విద్యార్థుల్లో ఆందోళన.. అసలేం జరిగింది?
సాక్షి ఎడ్యుకేషన్: పరీక్షల్లో విద్యార్థులు పాసవడం, ఫెయిలవడం సహజం. కానీ వ్యవస్థే ఫెయిలవడం, తత్కారణంగా విద్యార్థులు గురి తప్పడం ఎప్పుడన్నా చూస్తామా? వైద్య విద్యాలయాల్లో ప్రవేశానికై జరిపే అఖిల భారత పరీక్ష నేషనల్ ఎలిజబిలిటీ– కమ్– ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) విషయంలో అదే జరిగింది. పేపర్ లీకులు, గ్రేస్ మార్కులు, పలువురికి నూరుశాతం మార్కులు, కటాఫ్ మార్కుల్లో గణనీయంగా పెరుగుదల... ఇలా ఈ ఏటి ‘నీట్’ పరీక్షలో వివాదాలు అనేకం. ఈ అవకతవకలన్నీ విద్యార్థుల్లో ఆవేదన, ఆందోళన, నిరాశ రేపుతున్నాయి.
ఈసారి పరీక్ష జరిగిన కంగాళీ వ్యవహారంపై కోచింగ్ సంస్థలు, డాక్టర్లు, ప్రతిపక్ష నేతలు గొంతెత్తేలా చేశాయి. చివరకిలాంటి దేశవ్యాప్త పరీక్షలు నిర్వహించే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై పిల్లలకూ, తల్లితండ్రులకూ నమ్మకమే పోయే పరిస్థితి వచ్చింది. కొన్నిచోట్ల పేపర్ లీకైందన్న వార్తల్ని ఎన్టీఏ కొట్టిపారేసినా, విద్యార్థులు, కోచింగ్ సంస్థల వారు కోర్టు కెక్కారు. ఫలితాలను రద్దు చేయాలన్న వారి పిటిషన్‌పై కేంద్రానికీ, ఎన్టీఏకీ సుప్రీం కోర్ట్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. పరీక్ష పవిత్రతే దెబ్బతిన్నదంటూ జవాబు కోరింది. వెరసి కొన్నేళ్ళు గా రచ్చ రేపుతున్న ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విశ్వసనీయతకు ఇప్పుడు అగ్నిపరీక్ష ఎదురైంది.
Most Expensive Indian City: దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో అగ్రస్థానంలో ఉన్నదిదే.. ఇక్కడ ఈ ఖర్చులు ఎక్కువే..!
దేశంలోని 700 పైచిలుకు విద్యాలయాల్లో లక్షా 8 వేల చిల్లర ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఎంబీబీఎస్ చదివేందుకు ఏటా కొన్ని లక్షల మంది ‘నీట్’కు హాజరవుతారు. 2017లో 12 లక్షల మంది హాజరుకాగా, ఏడేళ్ళలో ఆ సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది ‘నీట్’కు 24 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 5న పరీక్ష జరగగా, తర్వాత నెలరోజులకే, నిర్ణయించిన తేదీ కన్నా పది రోజుల ముందరే జూన్ 4న ఫలితాలను ప్రకటించారు. దేశమంతా ఎన్నికల ఫలితాల హడావిడిలో ఉండగా సందట్లో సడేమియాగా ఈ ఫలితాల వెల్లడి అనుమానాలు రేపింది.
పైగా, ఏటా ఈ ప్రవేశ పరీక్షలో ఏ ఒక్కరో నూరు శాతం మార్కులు సాధిస్తారు. ఆ మాటకొస్తే, అసలీ పరీక్షలో 650, ఆ పైన మార్కులు సంపాదించడం సైతం కష్టం. కఠోరసాధనతోనే సాధ్యం. అలాంటిది... ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చాయి. ఫలితంగా.. గతంలో 650 మార్కుల స్కోరుకు సైతం విద్యార్థులకు పదివేలల్లో ర్యాంకులొస్తే, ఈసారి ఆ మార్కులకు ముప్ఫై, నలభై వేల మధ్య ర్యాంకులే దక్కడంతో విద్యార్థులు, తల్లితండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు.
UPSC Civils Free Coaching: 'సివిల్స్' ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..
ఆన్‌లైన్ పరీక్ష ‘క్లాట్’కూ, ఆఫ్‌లైన్‌లో జరిగే ‘నీట్’కూ విధానాల్లో తేడాలున్నాయి. కానీ, క్లాట్‌లో లాగా ఇక్కడా 1563 మంది విద్యార్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు కలిపింది. అదేమంటే కొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల విద్యార్థులకు సమయం వృథా అయిందనీ, వారు చదివిన పాత – కొత్త పాఠ్యపుస్తకాల్లో తేడాలున్నాయనీ, అందుకే అదనపు మార్కులు కలిపామనీ చెప్పింది. కాంపిటీటివ్ పరీక్షల్లో కనీవినీ ఎరుగని గ్రేస్ మార్కులు, ఈ వివరణలు హాస్యాస్పదం. పైగా, సరైన జవాబుకు 4 మార్కులు – తప్పితే ఒక మార్కు మైనస్ గనక, ఏ లెక్కన చూసినా అసంభవమైన 717, 718 లాంటి స్కోర్లు రావడమేమిటో దేవుడికే తెలియాలి.
పాట్నాలో పేపర్ లీకైందనీ, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, గుజరాత్‌లలో ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాశారనీ ఫిర్యాదులున్నాయి. హర్యానాలో ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్ రావడం, పైగా వారి దరఖాస్తులు ఆరోహణ క్రమంలో ఒకరి తర్వాత మరొకరివి కావడం విడ్డూరం. నీట్‌లో 715 మార్కులొచ్చిన విద్యార్థి తీరా ఇంటరే పాసవని విచిత్రం సరేసరి. అందుకే, అసలు నిజాలను ఎన్టీఏ దాచిపెడుతోందని అనుమానాలొస్తున్నాయి. లీకులు, వివాదాలు కొత్త కాకున్నా ఈసారి జరిగింది పక్కా స్కామ్ అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష రద్దు చేసి, మళ్ళీ జరపాలనే డిమాండ్లూ వస్తున్నాయి.
Indian Painted Frog: కవ్వాల్ టైగర్‌జోన్‌లో కనిపించిన ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్.. దీని పేరు ఇదే!
ఇప్పుడు నీట్‌లో మంచి మార్కులొచ్చి కూడా ఎప్పటిలా మంచి ర్యాంక్, కోరుకున్న కాలేజీలో సీటు రాని విచిత్రపరిస్థితి విద్యార్థులది. నిస్పృహతో కొందరు పిల్లలు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడడం విషాదం. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పేదలకూ, సామాజిక న్యాయానికీ ఈ నీట్ నిర్వహణ పూర్తిగా వ్యతిరేకమని తమిళనాడు ఎప్పటి నుంచో వాదిస్తోంది. 2021లో వచ్చిన స్టాలిన్ సర్కార్ జస్టిస్ రాజన్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేసింది.
కమిటీ సిఫార్సుల మేరకు లోపభూయిష్ఠమైన నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలంటూ, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. దీర్ఘకాలంగా రాష్ట్రపతి ముద్ర కోసం వేచి చూస్తోంది. ఎన్టీఏ మాత్రం తప్పులు ఒప్పుకొని, దిద్దుబాటుకు సిద్ధం కావట్లేదు. తాజా పరీక్షలో జవాబులు గుర్తుపెట్టే ఓఎంఆర్ షీట్ చినిగిపోయిందంటూ ఎన్టీఏ ఒకరి ఫలితం ఆపేసింది. తీరా చూస్తే ఆ విద్యార్థినికి 715 మార్కులు రావడం గమనార్హం.
Admissions at Para Medical Courses : పీజీఐఎంఈఆర్‌లో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..
ఇలాంటి విచిత్ర విన్యాసాలు చూశాకనైనా... మన పరీక్షా వ్యవస్థలో, ఉపయోగించే సాంకేతికతలో పారదర్శకత తీసుకురాక తప్పదు. అవసరమైతే వైద్య విద్యాలయాల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వాయిదా వేసి, కూలంకషంగా దర్యాప్తు చేయాలి. అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్న ఉన్నతస్థాయి ప్యానెల్ మరో వారంలో తన నివేదిక ఇవ్వనుంది. అది చేసే సిఫార్సుల మాట అటుంచితే, ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు ఈ వివాదంపై ఇప్పటి దాకా నోరు విప్పకపోవడం విషాదం.
చదువుల నుంచి ఉద్యోగాల దాకా మన దేశంలో సమస్త పరీక్షలకూ లీకుల జాడ్యం, అవకతవకల మకిలి అంటుకుంది. గత అయిదేళ్ళలో 15 రాష్ట్రాల్లో మొత్తం 41 పేపర్ లీకుల వల్ల 1.4 కోట్ల మంది ఉద్యోగార్థులకు కష్టం, నష్టం కలిగాయి. ఇది మన వ్యవస్థకే సిగ్గుచేటు. బాగా చదువుకోవాలనుకున్న పసివారి భవిష్యత్తుకు సైతం ఈ పీడ తప్పకపోవడమే మరీ బాధాకరం. సమూల ప్రక్షాళనతో ఇలాంటి పరీక్షలను లోపరహితంగా మార్చడమే మార్గం.