Apprentice Training : ఎన్‌ఏపీఎస్ సహా పలు అప్రెంటీస్‌షిప్ స్కీమ్స్.. ఈ ట్రైనింగ్‌తో క్షేత్ర నైపుణ్యాలు!
సంస్థలు అప్రెంటీస్ శిక్షణ పొందిన వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సులు, ఐటీఐ ట్రేడ్స్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల వరకూ.. అందరికీ ఇప్పుడు అప్రెంటిస్ శిక్షణ అత్యంత ఆవశ్యకంగా మారింది. ఈ నేపథ్యంలో.. విద్యార్థులకు అందుబాటులో ఉన్న అప్రెంటీస్ ట్రైనింగ్ మార్గాలు, ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర వివరాలు..
ఉద్యోగ నియామకాల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు రోజురోజుకూ ప్రాధాన్యం పెరుగుతోంది. స్కిల్స్ లేకుంటే ఉపాధి మార్గాలు మూసుకుపోతున్నాయి. దీంతో అన్ని రకాల కోర్సుల విద్యార్థులకు జాబ్ రెడీ స్కిల్స్ అందించడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. ఇందుకోసం విద్యార్థులకు అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ అవకాశాలు కల్పించే దిశగా.. డీజీఈటీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్), ఎన్‌ఎస్‌డీసీ (నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.
607 Jobs: కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి.. 435 పోస్టులకు 2,400 దరఖాస్తులు..
ఎన్‌ఏపీఎస్.. వినూత్నం
సంస్థలు స్టయిఫండ్, ఇతర ఆర్థిక వ్యయాలను పరిగణనలోకి తీసుకుని అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకునేందుకు వెనుకంజ వేస్తున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. 2016లో నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్(ఎన్‌ఏపీఎస్)కు రూపకల్పన చేసింది. ఈ స్కీమ్‌లో భాగంగా అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకునే సంస్థలకు నిధులు మంజూరు చేస్తోంది. అప్రెంటీస్ ట్రైనీకి శిక్షణ సమయంలో ఇచ్చే స్టయిఫండ్‌లో 25 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. దీంతోపాటు అప్రెంటీస్ ట్రైనింగ్ ఇచ్చేందుకు సంస్థకు అయ్యే వ్యయంలో 25 శాతాన్ని సర్కారు చెల్లిస్తుంది. ఇలా అప్రెంటిస్ శిక్షణకు వెచ్చించే మొత్తం వ్యయంలో 50 శాతం నిధులు కంపెనీలకు ప్రభుత్వం నుంచి అందుతాయి.
వివిధ రకాలుగా వర్గీకరణ
అప్రెంటీస్ ట్రైనీలను..ట్రేడ్ అప్రెంటీసెస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీసెస్, టెక్నిషియన్ అప్రెంటీసెస్, టెక్నిషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్, ఇతర ఆప్షనల్ ట్రేడ్ అప్రెంటీసెస్‌గా వర్గీకరించారు. గత ఏడాది నుంచి ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌కు సంబంధించిన విభాగాల్లో సైతం అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకునేలా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
Trade Apprentice Posts : ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
సర్టిఫికెట్లు కూడా
ఎన్‌ఏపీఎస్ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పేరుతో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్ కూడా అందిస్తారు. ఈ పరీక్షకు హాజరు కావాలంటే.. సదరు అభ్యర్థులు అప్రెంటీస్ ట్రైనింగ్ సమయంలో కనీసం 80 శాతం హాజరు కలిగుండాలి. అదే విధంగా ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌లో ట్రేడ్ ప్రాక్టికల్స్‌లో 60 శాతం, ట్రేడ్ థియరీలో 40 శాతం మార్కులు పొందాలి.
ఆన్‌లైన్‌లోనే అనుసంధానం
నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా.. సంస్థలను, విద్యార్థులను (అప్రెంటీస్) ఆన్‌లైన్‌లోనే అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు ఎన్‌ఏపీఎస్ వెబ్‌సైట్‌లో అప్రెంటీస్ ట్రైనింగ్ అవకాశాలు అందుబాటులో ఉన్న సంస్థల వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా సంస్థలు కూడా ఇదే వెబ్‌సైట్ ద్వారా అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న విద్యార్థుల సమాచారం పొందొచ్చు.
➤ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.apprenticeship.gov.in
Posts at SAIL : సెయిల్‌లో 249 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ఎన్‌ఏటీఎస్.. మరో మార్గం
అప్రెంటీస్ ట్రైనింగ్ అభ్యర్థులకు అందుబాటులో మరో ప్రధాన మార్గం.. నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారం–ఆర్ట్స్, హ్యుమానిటీస్, కామర్స్, ఇంజనీరింగ్, డిప్లొమా విద్యార్థులకు అప్రెంటీస్ ట్రైనింగ్ పొందే అవకాశం కల్పిస్తారు. డిప్లొమా ఉత్తీర్ణులకు నెలకు రూ.8 వేలు, ఇతర కోర్సుల వారికి నెలకు రూ.9వేల స్టయిఫండ్‌ను అందిస్తున్నారు. శాశ్వత ఉద్యోగులు 30 మంది ఉన్న సంస్థలు ఎన్‌ఏటీఎస్ విధానంలో అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవచ్చు. అదే విధంగా.. ప్రతి సంస్థ కనిష్టంగా నలుగురిని అప్రెంటీస్ ట్రైనీలుగా నియమించుకోవచ్చు.
➤ వివరాలకు వెబ్‌సైట్: https://mhrdnats.gov.in
డీజీఈటీ.. అప్రెంటీస్‌షిప్ స్కీమ్
డీజీఈటీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్) ఆధ్వర్యంలోని అప్రెంటీస్‌షిప్ స్కీమ్ ప్రకారం–ఇంటర్మీడియెట్, ఐటీఐ, ఇంజనీరింగ్ వంటి సాంకేతిక కోర్సులకు సంబంధించి అప్రెంటీస్ ట్రైనింగ్ అవకాశాలను అన్వేషించే వీలుంది. దాదాపు మూడు వందల ట్రేడ్‌లలో ప్రస్తుతం ఈ శిక్షణ సదుపాయం లభిస్తోంది. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న కోర్సులు, ట్రేడ్‌ల ఆధారంగా శిక్షణ వ్యవధి ఆరు నెలల నుంచి నాలుగేళ్ల వరకు ఉంటోంది. డీజీఈటీ నిబంధనల ప్రకారం–పారిశ్రామిక సంస్థలు తప్పనిసరిగా అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవాలి. ఈ నిబంధనల మేరకు ఒక సంస్థ మొత్తం ఉద్యోగుల్లో కనిష్టంగా మూడు శాతం, గరిష్టంగా పది శాతానికి సమానమైన సంఖ్యలో అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవచ్చు. నిర్దిష్ట వ్యవధిలోని అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేశాక.. అభ్యర్థులకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ ట్రేడ్ టెస్ట్ పేరుతో పరీక్ష నిర్వహిస్తుంది. ఈ ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ చేతికందుతుంది.
➤ వివరాలకు వెబ్‌సైట్: https://dgt.gov.in/Apprenticeship_Training
CLAT 2025 Notification : నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు క్లాట్ నోటిఫికేషన్ విడుదల..
విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ
బ్యాచిలర్ స్థాయిలో ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అప్రెంటీస్ ట్రైనింగ్ కల్పించే దిశగా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు 130 విభాగాల్లో అప్రెంటీస్ ట్రైనింగ్ చేసే అవకాశం లభిస్తోంది. అభ్యర్థులు కేంద్ర విద్యాశాఖకు చెందిన నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీమ్ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకుంటే.. వారి అర్హతలకు సరితూగే కంపెనీలకు అనుసంధానం చేసి అవకాశాలు కల్పించే విధంగా ఈ స్కీమ్ రూపకల్పన జరిగింది.
➤ వివరాలకు వెబ్‌సైట్: www.mhrdnats.gov.in
పీఎంకేవీవై.. మరో మార్గం
వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకుని క్షేత్ర స్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలనుకున్న వారికి అందుబాటులోకి ఉన్న మరో అవకావం.. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై). నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ సిఫార్సుల ఆధారంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇందులో షార్ట్‌టర్మ్,లాంగ్ టర్మ్ శిక్షణ సదుపాయం అందుబాటులో ఉంది. దీని ప్రకారం–అభ్యర్థులు తమ ప్రాంతంలోని అధీకృత ట్రైనింగ్ సెంటర్‌లోనే శిక్షణ పొందొచ్చు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తోంది.ఈ స్కీమ్ అన్ని ప్రాంతాలకు చెందిన వారికి చేరాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్లతో ఒప్పందం చేసుకునే విధానం అమలవుతోంది.
➤ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: pmkvyofficial.org
Jobs In Medical College: వైద్య కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
మారుతున్న సంస్థల దృక్పథం
అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకునే విషయంలో సంస్థల దృక్పథంలో సానుకూల మార్పు కనిపిస్తోంది. కారణం.. సదరు సంస్థలు కార్యకలాపాల నిర్వహణ పరంగా సుశిక్షితులైన సిబ్బంది కొరతను ఎదుర్కొవడమే. దీంతోపాటు అప్రెంటీస్ ట్రైనింగ్ ద్వారా అభ్యర్థులను తమ అవసరాలకు తగిన రీతిలో శిక్షణ ఇవ్వచ్చొని కంపెనీలు భావిస్తున్నాయి. అంతేకాకుండా అప్రెంటీస్ ట్రైనింగ్ సమయంలో మెరుగైన పనితీరు చూపిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. ఎన్‌ఏపీఎస్ ద్వారా ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తుండటంతో.. అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకునేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి.
ట్రేడ్ టెస్ట్ సర్టిఫికెట్స్
అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎన్‌సీవీటీ, డీజీఈటీలు నిర్వహించే ట్రేడ్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధిస్తే.. ఉద్యోగావకాశాలను దక్కించుకోవడంలో మరింత ముందంజలో నిలుస్తారు. ఎంట్రీ లెవల్‌లోనే ఐటీఐ అభ్యర్థులకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు; డిప్లొమా వారికి రూ.15 వేల నుంచి రూ.18 వేల మధ్యలో వేతనం లభిస్తుంది.
SSC Constable Results 2024 : కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణులైన వారికి త్వరలోనే..
అప్రెంటీస్‌షిప్ మార్గాలు.. ముఖ్యాంశాలు
➤ అప్రెంటీస్ ట్రైనింగ్‌కు ప్రధాన మార్గంగా నిలుస్తున్న నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్.
➤ ఎంహెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలోనూ అప్రెంటీస్ ట్రైనింగ్.
➤ గత ఏడాది నుంచి ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌లోనూ అప్రెంటీస్ ట్రైనింగ్ అవకాశం.
➤ అప్రెంటీస్ ట్రేడ్ సర్టిఫికెట్స్‌తో జాబ్ మార్కెట్‌లో సత్వర ఉపాధికి మార్గం.
➤ ట్రెడిషనల్ గ్రాడ్యుయేట్లకు కూడా ఉపయుక్తంగా నిలుస్తున్న అప్రెంటీస్ ట్రైనింగ్.
➤ ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు స్టయిఫండ్ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకం.