607 Jobs: కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి.. 435 పోస్టులకు 2,400 దరఖాస్తులు..
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు కీలక కేడర్‌లలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఈ మేరకు 36(8 కొత్త మెడికల్ కాలేజీలతో కలిపి) ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 607 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం 34 డిపార్ట్‌మెంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉండగా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలో కలిపి 85 పోస్టులకుపైగా ఉన్నాయి. మిగిలిన డిపార్ట్‌మెంట్లలో పరిమిత సంఖ్యలో పోస్టులున్నాయి.
చదవండి: Medical College: మెడికల్ కళాశాలకు మంగళం!
అకాడమిక్ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కులు, కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
435 ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టులకు 2,400 దరఖాస్తులు
ప్రభుత్వ దవాఖాన్లలోని 435 ఎంబీబీఎస్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్) డాక్టర్ పోస్టుల భర్తీకి ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 11వ తేదీ సాయంత్రానికి అప్లికేషన్ల గడువు ముగియనుంది.
జూలై 10న నాటికి సుమారు 2400 మంది డాక్టర్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకో వెయ్యి దరఖాస్తులు వరకూ వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఒక్కో పోస్టుకు ఐదుగురు డాక్టర్లు దరఖాస్తు చేయగా, ఈసారి ఒక్కో పోస్టుకు 7 నుంచి 8 అప్లికేషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు ప్రాక్టీస్‌పై బ్యాన్ పెట్టినప్పటికీ, ప్రభుత్వ సర్వీసులోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుండడం గమనార్హం.
కొత్త మెడికల్ కాలేజీలకు నో.. కారణం ఇదే..!
సాక్షి, హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ఝలక్ ఇచ్చింది. మొత్తం 8 మెడికల్ కాలేజీలకు అనుమతి లేఖ (లెటర్ ఆఫ్ పర్మిషన్ – ఎల్‌వోపీ) ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు మెయిల్ పంపించింది.
మౌలిక సదుపాయాలు లేకపోగా, అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించడంతో అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. సౌకర్యాలు సరిగాలేని కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా గద్వాల, నారాయణపేట, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో వైద్య కళాశాలల కోసం గతేడాది ప్రభుత్వం దరఖాస్తు చేసింది.
ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం తనిఖీలకు వచ్చిన ఎన్‌ఎంసీ బృందం బోధనా సిబ్బంది లేకపోవడం (జీరో ఫ్యాకల్టీ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొత్త మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ల, ఇన్‌పేషెంట్లు విషయమై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని బోధనాస్పత్రుల్లో ఓపీ బాగానే ఉన్నప్పటికీ, ఐపీ మాత్రం ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు లేదు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 50 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే.. 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి.
అలా ఒక్కో కాలేజీకి మొత్తం 59 మంది అధ్యాపక సిబ్బంది ఉండాలి. కానీ రాష్ట్ర కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ మినహా మిగతా సిబ్బంది లేరు. అలాగే నిబంధనల ప్రకారం సీనియర్ రెసిడెంట్ వైద్యులు కూడా ఉండాలి.
కానీ వాళ్లు లేకుండానే కాలేజీల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. కాగా ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల్లోగా సవరించుకోవాలి. లేనిపక్షంలో అనుమతులివ్వదు. కాగా ఈ విషయంపై డీఎంఈ డాక్టర్ వాణి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. లెటర్ల కోసం ఎదురుచూస్తున్నామని, అవి అందిన తర్వాత అప్పీలుకు వెళ్తామని తెలిపారు.
బోధనా సిబ్బంది లేరు.. వసతుల్లేవు
రాష్ట్రంలో 29 ప్రైవేటు వైద్య కళాశాలలు కలిపి మొత్తం 56 మెడికల్ కాలేజీలున్నాయి. వీటిల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో 3,790 సీట్లు ఉండగా ఎక్కువ కాలేజీల్లో 150 చొప్పున మాత్రమే ఉన్నాయి.
వీటిల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. అనేకచోట్ల పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు తరగతులు లేక ఖాళీగా ఉంటున్నారు.
ఔట్ పేషెంట్లు రాకపోవడంతో పీజీ విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణ పొందలేకపోతున్నారు. కొందరు విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను తూతూ మంత్రంగా పూర్తి చేస్తున్నారు. కొందరు పీజీ మెడికల్ కోసం కోచింగ్‌లకు వెళ్తున్నారు.
ఏదో పరీక్ష పాసైతే చాలన్న అభిప్రాయం అటు విద్యార్థులు, ఇటు కాలేజీల యాజమాన్యాల్లోనూ నెలకొందనే విమర్శలు విని్పస్తున్నాయి. వాస్తవానికి వసతులు లేవని విద్యార్థులు కూడా బయటకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. చెప్పినా, నిరసన వ్యక్తం చేసినా ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోంది.
గతంలోనే ఎన్‌ఎంసీ గరం
ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ అనేకచోట్ల ఇటువంటి పరిస్థితి ఉంటోందని ఎన్‌ఎంసీ గతంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50 శాతం వరకు అధ్యాపకుల కొరత ఉందని ఎన్‌ఎంసీ గతంలోనే తేల్చడం గమనార్హం.
150 ఎంబీబీఎస్ సీట్లున్న మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్‌పేòÙంట్లు ఉండాలి. కానీ ఒక చాలా కాలేజీల్లో సగం మేరకు కూడా ఔట్ పేషెంట్లు రావడంలేదు. ఇది వైద్య శిక్షణకు ఏమాత్రం సరిపోదని నిపుణులు అంటున్నారు.
ఇక మెడికల్ కాలేజీ ఆసుపత్రికి 600 పడకలు అవసరం కాగా, చాలాచోట్ల 500–550తోనే నడిపిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ కేవలం 10 శాతం వరకే ఉంటోంది. వైద్య విద్యకు ఇది ఏమాత్రం సరిపోదని చెబుతున్నారు. లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు అవసరమైన సంఖ్యలో లేవు.
మెడికల్ కాలేజీల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా 450 మందికి సరిపోయేలా హాస్టల్ వసతి ఉండాల్సి ఉండగా, 150 మంది బాలికలు, 190 మంది బాలురకు సంబంధించిన హాస్టల్ వసతి మాత్రమే ఉంది. కొన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల శిక్షణ కోసం అవసరమైన అల్ట్రాసౌండ్ యంత్రాలు కూడా లేకపోవడం గమనార్హం.
Tags
- Medical Colleges
- 607 Jobs
- medical education
- Medical and Health Department
- Medical and Health Services Recruitment Board
- Civil Assistant Surgeon
- MBBS
- doctor posts
- Government medical colleges recruitment
- Job vacancies in medical colleges
- State medical department news
- Medical and Health Services Recruitment Board updates
- Academic year job openings
- Healthcare sector employment
- Hyderabad government jobs
- Medical education vacancies
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications