Medical College: మెడికల్ కళాశాలకు మంగళం!
కళాశాల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరైనట్టు ప్రొసీడింగ్‌ను కూడా విడుదల చేసింది. అయితే మెడికల్ కళాశాల ఏర్పాటుకు సరైన వసతులులేవని, సిబ్బంది కొరత కూడా ఉందనే కారణంతో జాతీయ వైద్య మండలి కళాశాల అనుమతిని నిరాకరించింది. ఈ పిడుగులాంటి వార్తతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
జిల్లాకు 2023లో మెడికల్ కళాశాల మంజూరైంది. దీంతో కళాశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఎంసీహెచ్ ఆస్పత్రి పక్కనే క్రిటికల్ కేర్ ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు 350 పడకల ఆస్పత్రి అందుబాటులో ఉండాలనేది నిబంధన. అయితే జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు ఎంసీహెచ్, ఆస్పత్రులు ఉన్నాయని మెడికల్ కళాశాల నిర్వహణకు సరిపోతుందని నిర్ణయించారు.
చదవండి: Vocational Inter students : ఒకేషనల్ ఇంటర్ విద్యార్థులు అప్రెంటీస్ చేయాలి
భవనానికి గ్రీన్ సిగ్నల్
మెడికల్ కళాశాల నూతన భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు పిల్లికోటాల్‌లోని పాత కలెక్టరేట్ భవనం మెడికల్ కళాశాలకు అనువుగా ఉంటుందని సంబంధిత అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెదక్ ప్రభుత్వ వైద్యకళాశాల అనే బోర్డును సైతం తగిలించారు. ఆ భవనంలో కొనసాగుతున్న బాలికల గురుకుల పాఠశాలను రామాయంపేటకు తరలించారు. అంతా ఓకే అనుకున్న సమయంలో ఒక్కసారిగా అనుమతులు నిరాకరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మళ్లీ ప్రయత్నిస్తాం..
సిబ్బంది లేరనే కారణంగా మెడికల్ కళాశాలకు జాతీయ వైద్యమండలి అనుమతులు నిరాకరించిన విషయం వాస్తవమే. ప్రస్తుతం డీఎంఈ వద్ద రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. జూలై 9న 20మంది డాక్టర్లు వచ్చారు. మరో 2, 3 రోజుల్లో పూర్తిస్థాయిలో సిబ్బందిని రప్పించి అనుమతుల కోసం మళ్లీ అప్పీల్ చేస్తాం.
– రవికుమార్, ప్రిన్సిపాల్, మెదక్ మెడికల్ కళాశాల
ముందుకు రాని సిబ్బంది
మెడికల్ కళాశాలలో ఎనిమిది డిపార్ట్‌మెంట్‌లు ఉంటాయని. ఫస్టియర్‌లో మాత్రం 4 నుంచి 5 డిపార్ట్‌మెంట్‌లు అవసరం ఉంటుందని ఓ డాక్టర్ తెలిపారు. సెకండ్ ఇయర్‌కు మరికొన్ని డిపార్ట్స్‌మెంట్‌లు పెరిగే అవకాశం ఉంటుంది.
నాలుగున్నర సంవత్సరాలు కోర్సు ఉండగా ఒక్క సంవత్సరం పాటు హౌస్‌సర్జన్ ఉంటుంది. మెడిసిన్ పూర్తిచేసేందుకు మొత్తం ఐదున్నర సంవత్సరాల సమయం పడుతుంది. మొదటి సంవత్సరంలో అటానమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఎస్‌పీఎం ప్రధానమైన కోర్సులు.
సెకండ్ ఇయర్‌లో మరికొన్ని అదనంగా పెరుగుతాయి. అటానమి ప్రొఫెసర్, మరో ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, ట్యూటర్‌లతోపాటు ఒక్కో డిపార్ట్‌మెంట్‌లో 10 నుంచి 12మంది డాక్టర్లు అవసరం. అయితే మెదక్ మారుమూల ప్రాంతం అని భావించి వైద్యులు ముందుకు రావడంలేదని సమాచారం. అందుకే సిబ్బంది కొరతను కారణంగా చూపించి కళాశాలకు అనుమతులు నిరాకరించినట్టు తెలిసింది.