APPSC Group 1, 2 Preparation Tips : గ్రూప్‌–1, 2 పోస్టుల పూర్తి వివరాలు ఇవే.. గ్రూప్స్ కొట్టాలంటే.. ఇలా చ‌ద‌వాల్సిందే..

appsc group 1, 2 syllabus, exam pattern and preparation tips

ఏపీపీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలు మీ లక్ష్యమా.. ఉన్నత స్థాయి సర్కారీ కొలువులు స్వప్నంగా చేసుకున్నారా.. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారా!! అయితే.. ఇక మీ లక్ష్యంపై గురిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది! ఎందుకంటే.. మరికొద్ది రోజుల్లోనే.. ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఆగస్ట్‌ నెలలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, 2 పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, విజయానికి మార్గాలు... 

  • వచ్చే నెలలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌
  • 110 గ్రూప్‌–1 పోస్ట్‌లు, 182 గ్రూప్‌–2 పోస్ట్‌లు
  • నోటిఫికేషన్‌ తర్వాత రెండు లేదా మూడు నెలల వ్యవధిలో పరీక్ష
  • అభ్యర్థులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవాల్సిన తరుణం

‘ఇటీవల కాలంలో ఏపీపీఎస్సీ నిరంతరం పలు నోటిఫికేషన్లతో ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురింపచేస్తోంది. త్వరలో గ్రూప్‌–1, 2 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ కలెక్టర్, సీటీఓ, ఆర్‌టీఓ, డీఎస్పీ వంటి పోస్ట్‌లు ఉండే అత్యున్నత సర్వీసుగా పేర్కొనే గ్రూప్‌–1; అదే విధంగా డిప్యూటీ తహశీల్దార్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్, ఏసీటీఓ తదితర పోస్ట్‌లు ఉండే గ్రూప్‌–2 సర్వీస్‌లను సొంతం చేసుకోవడం రాష్ట్రంలో లక్షల మంది గ్రాడ్యుయేట్ల స్వప్నం. 

చ‌ద‌వండి: APPSC Group 4 Exams for 730 Posts: సిలబస్‌ + సమకాలీనంతో... సక్సెస్‌

గ్రూప్‌–1,2 మొత్తం 292 పోస్ట్‌లు

ఏపీపీఎస్సీ తాజా ప్రకటన ప్రకారం– గ్రూప్‌–1, 2 సర్వీసుల్లో మొత్తం 292 పోస్ట్‌లకు ఆగస్ట్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఇందులో గ్రూప్‌1కు సంబంధించి 110 పోస్టులు, గ్రూప్‌ 2లో 182 పోస్టులు ఉన్నాయి.

గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియ.. ఇలా

గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో రెండు దశలుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. మొదటి దశలో ప్రిలిమినరీ, రెండో దశలో మెయిన్‌ పరీక్ష ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా.. 1:50 నిష్పత్తిలో మలిదశలో డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగే మెయిన్‌కు ఎంపిక చేస్తారు.

చ‌ద‌వండి: Group 1 Preliminary Exam: 60 డేస్‌ ప్రిలిమ్స్‌ ప్లాన్‌.. సిలబస్‌, సబ్జెక్ట్‌ అంశాలు..

ప్రిలిమ్స్‌.. రెండు పేపర్లుగా

గ్రూప్‌–1 సర్వీసు తొలి దశ ప్రిలిమ్స్‌ రెండు పేపర్లుగా ఉంటుంది. ఆ వివరాలు..

పేపర్‌ సబ్జెక్ట్‌లు మార్కులు
1 ఎ) హిస్టరీ అండ్‌ కల్చర్‌
బి) రాజ్యాంగం, పాలిటీ, సోషల్‌ జస్టిస్, అంతర్జాతీయ సంబంధాలు
సి) భారత్, ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ
డి) జాగ్రఫీ
120
2 జనరల్‌ అప్టిట్యూడ్‌
ఎ) జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ
బి–1) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ 
బి–2) ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు
120
మొత్తం   240

మెయిన్‌.. అయిదు పేపర్లుగా

  • గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి వారికి మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉండే మెయిన్‌ ఎగ్జామినేషన్‌ అయిదు పేపర్లుగా 750 మార్కులకు నిర్వహిస్తారు. 
  • తెలుగు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్లను అర్హత పేపర్లుగా నిర్దేశిస్తారు. ఈ పేపర్లలో కనీసం 40శాతం (ఓసీ అభ్యర్థులు), 35 శాతం (రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు) మార్కులు సాధిస్తేనే మెయిన్‌ ఎగ్జామినేషన్‌ మిగతా పేపర్ల మూల్యాంకన చేస్తారు. అందుకే మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను ప్రధానంగా అయిదు పేపర్లుగానే గుర్తింపు పొందింది.
పేపర్‌ సబ్జెక్ట్‌ మార్కులు
లాంగ్వేజ్‌ తెలుగు 150
లాంగ్వేజ్‌ ఇంగ్లిష్‌ 150
పేపర్‌–1 జనరల్‌ ఎస్సే (ప్రాంతీయ, జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న సమకాలీన 
అంశాలు)
150
పేపర్‌–2 భారత్, ఏపీ చరిత్ర సంస్కృతి, 
భౌగోళిక శాస్త్రం
150
పేపర్‌–3 పాలిటీ, రాజ్యాంగం, పాలన, లా, ఎథిక్స్‌ 150
పేపర్‌–4 ఎకానమీ, భారత దేశ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి  150
పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు 150
మొత్తం మార్కులు   750

ఇంటర్వ్యూలపై త్వరలో నిర్ణయం

  • గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో ఇప్పటి వరకు మెయిన్‌ ఎగ్జామినేషన్‌ తర్వాత మరో 75 మార్కులకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు.
  • మెయిన్‌లో పొందిన మార్కుల ఆధారంగా.. అందుబాటులో ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని 1:2 నిష్పత్తిలో చివరి దశ పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అయితే గత ఏడాది జూన్‌లో అన్ని సర్వీసులకు ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో విడుదల చేయనున్న నోటిఫికేషన్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ తెలిపారు. ఒకవేళ ఇంటర్వ్యూలు నిర్వహిస్తే.. మొత్తం 825మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

చ‌ద‌వండి: APPSC&TSPSC: గ్రూప్స్‌కు సొంతంగా నోట్స్‌ రాసుకుని.. గుర్తు పెట్టుకోవ‌డం ఎలా..?

కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌

రానున్న గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ నుంచి అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ను కూడా తప్పనిసరి చేయనున్నట్లు సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు కంప్యూటర్‌ పరిజ్ఞానం పెంచుకోవాల్సి ఉంటుంది. సీపీటీ విషయంలో మార్కులు, ఇతర విధి విధానాలపై నోటిఫికేషన్‌ సమయానికి స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

గ్రూప్‌–2.. రెండు దశల రాత పరీక్ష

182 పోస్ట్‌లతో నిర్వహించే గ్రూప్‌–2 ఎంపిక ప్రక్రియలో రెండు దశలుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తొలి దశ రాత పరీక్షను స్క్రీనింగ్‌ టెస్ట్‌గా, రెండో దశ రాత పరీక్షను మెయిన్‌ టెస్ట్‌గా పేర్కొంటారు. వీటికి సంబంధించిన వివరాలు..

గ్రూప్‌–2.. స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఇలా

గ్రూప్‌–2 తొలి దశ రాత పరీక్షగా పేర్కొనే స్క్రీనింగ్‌ టెస్ట్‌ మూడు విభాగాల్లో 150 మార్కులకు జరుగుతుంది. వివరాలు..

విభాగం సబ్జెక్ట్‌ మార్కులు
సెక్షన్‌–ఎ  జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ  
సెక్షన్‌–బి  ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సాంస్కృతిక చరిత్ర; భారత రాజ్యాంగం  
సెక్షన్‌–సి ప్లానింగ్‌ అండ్‌ ఎకానమీ 150

గ్రూప్‌–2 మెయిన్‌.. మూడు పేపర్లు

గ్రూప్‌–2 ఎంపిక ప్రక్రియలో రెండో దశగా నిర్వహించే మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను మూడు పేపర్లుగా 450 మార్కులకు నిర్వహిస్తారు. వివరాలు..

విభాగం సబ్జెక్ట్‌ మార్కులు
పేపర్‌–1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ  150
పేపర్‌–2 సెక్షన్‌–1: సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు)
సెక్షన్‌–2: భారత రాజ్యాంగం సమీక్ష 
150
పేపర్‌–3 ప్లానింగ్‌ ఇన్‌ ఇండియా, ఇండియన్‌ ఎకానమీ, సమకాలీన సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి 150
మొత్తం మెయిన్స్‌ మార్కులు 450

కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌

గ్రూప్‌–2 అభ్యర్థలుకు కూడా చివరగా కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. మొత్తం అర్హత పొందిన అభ్యర్థుల నుంచి 1:2 నిష్పత్తిలో జాబితా రూపొందించి వారికి కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 

చ‌ద‌వండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

విజయానికి అడుగులు ఇలా

గ్రూప్‌–1, 2 పరీక్షల్లో విజయంలో అత్యంత ప్రధానమైన సాధనం.. సిలబస్‌ అంశాలపై పట్టు సాధించడం. మొదట అభ్యర్థులు సిలబస్‌ ఆసాంతం అవగాహన చేసుకోవాలి. సిలబస్‌లో ఆయా అంశాలకు కల్పిస్తున్న వెయిటేజీని గమనించాలి. దీనికి అనుగుణంగా ప్రిపరేషన్‌ కోసం సదరు టాపిక్స్‌ ప్రత్యేక సమయం కేటాయించాలి. గ్రూప్‌–1, గ్రూప్‌–2 సిలబస్‌లను పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు 80 శాతం అంశాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. అభ్యర్థులు గ్రూప్‌–1 ఓరియెంటేషన్‌తో.. డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో ముందుకు సాగితే గ్రూప్‌–2 సిలబస్‌లోనూ పట్టు సాధించే అవకాశం ఉంది. 

చ‌ద‌వండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

కాన్సెప్ట్స్‌ + కరెంట్‌ ఈవెంట్స్‌

సిలబస్‌ అంశాలను సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకుంటూ డిస్క్రిప్టివ్‌ విధానంలో ప్రిపరేషన్‌ సాగించాలి. ఫలితంగా కోర్‌ సబ్జెక్ట్‌ నైపుణ్యంతోపాటు సమకాలీన పరిస్థితుల్లో అన్వయించే నైపుణ్యం కూడా లభిస్తుంది. ముఖ్యంగా గ్రూప్‌1 అభ్యర్థులకు ఇది ఎంతో కలిసొచ్చే అంశం.

విశ్లేషణతో.. విజయం దిశగా

  • గ్రూప్‌–1 అభ్యర్థులు ప్రిలిమ్స్‌ నుంచే ఆయా అంశాలను విశ్లేషించుకుంటూ.. అభ్యసించే నైపుణ్యం సొంతం చేసుకుంటే విజయం దిశగా అడుగులు వేయొచ్చు. సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన, విశ్లేషణ, స్వీయ అభిప్రాయ దృక్పథం పెంచుకోవాలి. ముఖ్యమైన అంశాలకు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో పట్టు సాధించాలి. 
  • ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా నవరత్నాలు, అమలు చేస్తున్న పథకాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్‌ కేటాయింపులు, ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య తదితర వివరాలను అవపోసన పట్టాలి. రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, వాటిద్వారా కలిగిన అభివృద్ధిపై దృష్టి సారించాలి. అలాగే జాతీయ స్థాయిలో తాజా రాజ్యాంగ సవరణలు, నూతన జాతీయ విద్యా విధానం, ఇటీవల కాలంలో కీలకమైన తీర్పుల గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి.

చ‌ద‌వండి: TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేర‌య్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చ‌దివారంటే..

సబ్జెక్ట్‌ వారీగా ఇలా

  • హిస్టరీ విషయంలో రాష్ట్ర చరిత్ర, సంసృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ.. ముఖ్యమైన అంశాలపై పట్టు సాధించాలి. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. ఇదే తీరులో భారత దేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. 
  • జాగ్రఫీకి సంబంధించి రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరుల గురించి తెలుసుకోవాలి. వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి. అదే విధంగా గత ఏడాది కాలంలో చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు.. వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
  • పాలిటీలో రాణించేందుకు రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, భావనలు మొదలు తాజా పరిణామాలు(రాజ్యాంగ సవరణలు వాటి ప్రభావం) తెలుసుకోవాలి. గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్‌ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు,ప్రజాసేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. వాస్తవానికి దీనికి సంబంధించి ప్రత్యేక పుస్తకాలు లేనప్పటికీ.. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పుస్తకాలు కొంత మేలు చేస్తాయి. న్యాయపరమైన అంశాలపైనా పట్టు సాధించాలి. ప్రాథమిక హక్కులు, విధులు,కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు..వీటికి సంబంధించి న్యాయ వ్యవస్థకున్న అధికారాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా, సివిల్, క్రిమినల్‌ లా, కార్మిక చట్టాలు, సైబర్‌ చట్టాలు, ట్యాక్స్‌ లాస్‌ గురించి తెలుసుకోవాలి.
  • ఎకానమీలో ప్రిపరేషన్‌ ప్రారంభ దశలో మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకోవాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటిద్వారా లబ్ధి చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తాజాగా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్‌ సర్వేలపై అవగాహన పొందాలి.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్, డీఆర్‌డీఓ, ఇంధన వనరులు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పొందాలి.

పునర్విభజన చట్టంపై ప్రత్యేకంగా

గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన మరో కీలక అంశం.. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014. జనరల్‌ స్టడీస్,ఎకానమీ,హిస్టరీ పేపర్లు అన్నింటిలోనూ.. ఈ చట్టం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశాలున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఈ చట్టాన్ని ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. విభజన తర్వాత ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు.. వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సమకాలీన అంశాలతో కూడిన సమాచారంతో పరీక్ష సమయానికి సన్నద్ధత సాధించాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్స్‌.. తాజా సమాచారం

  • బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో గ్రూప్స్‌ పరీక్షలకు పోటీ పడే అవకాశం. 
  • వచ్చే నెలలో 110 గ్రూప్‌–1, 182 గ్రూప్‌–2 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌.
  • ఈసారి గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలోనూ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహణ.
  • నోటిఫికేషన్‌ వెలువడిన మూడు నెలలలోపు తొలి దశ రాత పరీక్షలు నిర్వహించే అవకాశం.
  • డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో అడుగులు వేస్తే ఒకే సమయంలో గ్రూప్‌–1,2 రెండింటికీ సన్నద్ధత పొందొచ్చు.

చ‌ద‌వండి: APPSC/TSPSC Group1,2 Exams: చరిత్రను పట్టు సాధించి... విజేతలవ్వండి!​​​​​​​

#Tags