D.Pharmacy: డీ–ఫార్మసీతో ఉపాధికి భరోసా.. రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు చేసుకోండి
మురళీనగర్: ఇంటర్మీడియట్ అనంతరం ఫార్మసీ రంగంలో శిక్షణ పొందేందుకు డిప్లమా ఇన్ ఫార్మసీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లతో పాటు కొన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో కూడా నిర్వహిస్తున్నారు. ఈ కోర్సు చేసిన విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తో ఫార్మసీ కంపెనీలతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగం ఆస్పత్రుల్లోనూ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారు తక్షణ ఉపాధి అవకాశాలు పొందవచ్చు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లాంటి కాలేజీల్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు. అనంతరం మూడు నెలల ప్రభుత్వ ఆస్పత్రిలో శిక్షణ ఉంటుంది.
విద్యార్హత: ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా బైపీసీ, నేషనల్/ స్టేట్ ఓపెన్ స్కూల్ లో ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా బైపీసీ, సీబీబీఎస్‌ఈ /ఐసీఎస్‌ఈ బోర్డు ద్వారా ఇంటర్మీడియట్‌కు సమానమైన పరీక్ష ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
https://apsbtet.in/pharmacy వెబ్‌సైట్లో నేరుగా జూన్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మే 21 నుంచే దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.
ఎంపిక విధానం:
కోర్సులో శిక్షణకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం మేరకు మెరిట్ ప్రాతిపదికగా ర్యాంకులు కేటాయిస్తారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు అవకాశాలను బట్టి కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చు.
కళాశాలల వివరాలు..
రాష్ట్రంలో 8 ప్రభుత్వ కళాశాలలు, ఒక ఎయిడెడ్ కళాశాల, 35 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. కోస్తాంధ్రలో విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్, శ్రీకాకుళం, కాకినాడ, గుంటూరు మహిళా పాలిటెక్నిక్, రాయలసీమలో తిరుపతి, కర్నూలు ప్రభుత్వ పాలిటెక్నిక్, కడప, హిందూపూర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా ఎయిడెడ్ పాలిటెక్నిక్.
పాఠ్యాంశాలు..
ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ప్రథమ సంవత్సరంలో ఐదు సబ్జెక్టులు, రెండో సంవత్సరంలో ఆరు సబ్జెక్టులతో పాటు కోర్సులో భాగంగా మందులు తయారు చేయడం, మానవ శరీర అవయవాల మీద మందులు పని చేసే విధానం, ఔషధ మొక్కలు, ఫార్మసీ చట్టాలపై అవగాహన, ఫార్మసిస్టుగా డ్రగ్స్ డిస్పెన్సింగ్, పేషంట్ కౌన్సిలింగ్‌లో అవగాహన కల్పిస్తారు. రెండేళ్ల కోర్సులో సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు ప్రాక్టికల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రెండు నెలలు కోర్సు పూర్తి చేసిన అనంతరం మూడు నెలలు ప్రయివేటు ఆస్పత్రుల్లో శిక్షణ ఇస్తారు.
Semester Exams: రేపటి నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం..
ఉపాధి అవకాశాలు..
డిప్లమా ఇన్ ఫార్మసీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్యశాలలు, పరిశ్రమలు, రైల్వే ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రిలో కమ్యూనిటీ ఫార్మసిస్ట్, హాస్పిటల్ ఫార్మసిస్ట్, మార్కెటింగ్ డ్రగ్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఔషధ దుకాణాలలో రిటైల్ ఫార్మసిస్టులుగా ఉద్యోగాలు ఉన్నాయి. ఫార్మస్యూటికల్ కంపెనీల్లో ఫార్మసీ సూపర్‌వైజర్, ఫార్మసిస్టు ఉద్యోగాలు పొందవచ్చు.
ఆర్థిక స్థోమత ఉన్నవారు సొంతంగా మెడికల్ షాపు ఏర్పాటు చేసుకొని తనతోపాటు మరి కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు. ఈ రంగంలో వేతనాలు అధికంగా ఉన్నందున ఎక్కడైనా ఉపాధికి భరోసా ఉండడంతో కోర్సుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. డి.ఫార్మసీ కోర్సు చదివిన తర్వాత ఉన్నత చదువులకు ఈసెట్ ద్వారా బి.ఫార్మసీ రెండో సంవత్సరంలోకి చేరవచ్చని, ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తిస్తుందని కంచరపాలెం ఫార్మసీ హెడ్ జె.గోవర్థన రావు తెలిపారు.
అత్యుత్తమ బోధన..
కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 1966లో ఫార్మసీ డిప్లమా కోర్సు ప్రారంభించారు. ఇక్కడ 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం ఉంది. మా కాలజీలో చదివిన విద్యార్థులు ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఉపాధి పొందుతున్నారు. 2023–24 విద్యాసంవత్సరానికి క్యాంపస్ డ్రైవ్‌లో 39 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఏడుగురు విద్యార్థులు ఉన్నత విద్య కోసం వెళ్తున్నారు. మాదగ్గర అధునాతన ప్రయోగశాల, ఉన్నత అర్హతలు కలిగిన ఫ్యాకల్టీ ఉంది. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉపాధి, ఉన్నత విద్యకు ఈ కోర్సులో చేరడం ఉత్తమం. – డాక్టర్ కె.నారాయణరావు, ప్రిన్సిపాల్, కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్
SVVU Ph. D Admissions: ఎస్‌వీవీయూలో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు..