NCC Training Academy: ఎన్‌సీసీ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటు చేయాలి

కాకినాడ: జిల్లా కేంద్రం కాకినాడలో ఎన్‌సీసీ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ వంగా గీత కోరారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ గీత

ఈమేరకు ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆగ‌స్టు 13న‌ కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, విద్య, దేశభక్తి, దేహదారుఢ్యం, మానసిక ధైర్యం పెరగడానికి ఎన్‌సీసీ శిక్షణ కేంద్రాలు తప్పనిసరిగా ఏర్పాటు కావాలని పేర్కొన్నారు. ఏపీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని, ఇందుకు అనుగుణంగా కాకినాడ జిల్లాలో ఎన్‌సీసీ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటు చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.

చదవండి: అన్ని జిల్లాల్లో NCC విస్తరణకు సన్నాహాలు

గతంలో సముద్రంలోను, భూమి పైన యుద్ధ శిక్షణ ఇచ్చే ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నౌకాదళం నుంచి తీసుకువచ్చిన టీయూ–142 ఎయిర్‌క్రాఫ్ట్‌ను కాకినాడ నగరాభివృద్ధి సంస్థ ద్వారా నాలెడ్జ్‌ పార్కులో ప్రజల సందర్శనార్థం ఉంచారని తెలిపారు. ఎన్‌సీసీ కళాశాలలు, పాఠశాలల నుంచి వచ్చిన అభ్యర్థనలను ఆమె కేంద్ర మంత్రికి వివరించారు. రిటైర్డ్‌ జవాన్లకు సంబంధించిన ఎన్‌సీసీ క్యాంటీన్‌ను కాకినాడలోనే ఉంచినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్‌సీసీ ట్రైనింగ్‌ అకాడమీ అంశంపై మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సానుకూలంగా స్పందించారని, ప్రతిపాదనలు పంపాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారని ఎంపీ గీత తెలిపారు.

చదవండి: Special Entry in Army: ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ద్వారా 55 పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు

#Tags