Education Hub: ఎడ్యుకేషన్‌ హబ్‌గా మహేశ్వరం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పరిశ్రమల స్థాపనలోనే కాదు వృత్తి విద్యా కోర్సుల ఏర్పాటులోనూ మహేశ్వరం ముందంజలో ఉంది.
ఎడ్యుకేషన్‌ హబ్‌గా మహేశ్వరం

 ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయం కూడా ఇదే నియోజకవర్గంలో ఏర్పాటైంది. తాజాగా పాలిటెక్నిక్‌, బిజినెస్‌, డైట్‌, లా సహా మెడికల్‌ వంటి వృత్తివిద్యా కోర్సుల ఏర్పాటుతో సరస్వతీ నిలయంగా మారుతోంది.

తాజాగా మెడికల్‌ కాలేజీ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.176 కోట్ల అంచనా వ్యయంతో కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ సర్వే నంబర్‌ 112లో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మెడికల్‌ కాలేజీ భవనానికి ఆక్టోబ‌ర్ 1న‌ శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సహా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు హాజరు కానుండటంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

చదవండి: కిష్టాపూర్‌ విద్యార్థులను అభినందించిన డీఈవో

ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా..

సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు కనీసం చదువుకునేందుకు ప్రాథమిక పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు ఉండేవి కావు. ఉన్నవాటిలోనూ సరైన సదుపాయాలు కనిపించేది కాదు. కొత్త కాలేజీల కోసం విద్యార్థి సంఘాలు తరచూ ఆందోళనలు చేపడుతుండేవి. నియోజకవర్గంలో విద్యా సంస్థలు లేని లోటును పూడ్చాలని మంత్రి భావించారు.

నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన వృత్తి విద్యను అందించాలని ఆశించారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అప్పటి వరకు ఒక్క కాలేజీ కూడా లేని నియోజకవర్గంలో కొత్తగా నాలుగు జూనియర్‌ కాలేజీలను ప్రారంభించారు. ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేని చోట ప్రస్తుతం మూడు కాలేజీ ఉండడం విశేషం. రెండు పాలిటెక్నిక్‌ కాలేజీలు ప్రారంభించారు. ఇటీవలే డైట్‌ కాలేజీ, ఒక పాలిటెక్నిక్‌ కాలేజీ భవనాలకు శంకుస్థాపన చేశారు.

చదవండి: Pranay: డిఫెన్స్‌ పరీక్షలో సైనిక విద్యార్థి ప్రతిభ

న్యాయ విద్యను చేరువ చేయాలనే ఆలోచనతో లా కాలేజీని మంజూరు చేయించారు. అత్యాధునిక లైబ్రరీని ఏర్పాటు చేయించి, అందులో పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. మన ఊరు, మనబడి పథకంలో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న అనేక ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దారు.

విద్యా సంస్థలకు నిధుల వరద

రూ.6.55 కోట్లతో నాలుగు జూనియర్‌ కళాశాల్లో నూతన తరగతి గదులు, ప్రహరీ సహా ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో మీర్‌పేట జూనియర్‌ కాలేజీకి రూ.1.33 కోట్లు కేటాయించగా, కందుకూరు జూనియర్‌ కాలేజీకి రూ.2 కోట్లు, మహేశ్వరం జూనియర్‌ కాలేజీకి రూ.1.20 కోట్లు, సరూర్‌నగర్‌ జూనియర్‌ కళాశాలకు రూ.2 కోట్లు మంజూరు చేయించగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

బడంగ్‌పేట్‌, మహేశ్వరం పాలిటెక్నిక్‌ కళాశాలలకు రూ.24 కోట్లు, డైట్‌ కాలేజీ ఏర్పాటుకు రూ.4 కోట్లు, రూ.4కోట్లతో జిల్లా గ్రంథాలయాలను ఇప్పటికే ప్రారంభించారు. మహేశ్వరం డిగ్రీ కళాశాలకు రూ.కోటి, మోడల్‌ స్కూల్‌కు రూ.4 కోట్లు మంజూరు చేయించారు. మన ఊరు –మన బడి కింద మొదటి విడతలో 26 ప్రాథమిక పాఠశాలలు, 10 ప్రాథమికోన్నత పాఠశాలలు, 18 ఉన్నత పాఠశాలలు, మొత్తం 54 ఎంపిక చేసి రూ.16 కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. మిగిలిన పాఠశాలలకు మరో రూ.9.13 కోట్లు మంజూరు చేయించి, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు.

ఇటీవల రాష్ట్రంలో 16 డిగ్రీ గురుకుల కళాశాలలు మంజూరు కాగా, వీటిలో మన జిల్లాకే రెండు (షాద్‌నగర్‌ బాలికల, కందుకూరు బాలుర గురుకులాలు) మంజూరయ్యాయి. కేసీతండా పరిధిలో రూ.కోటితో కొత్తగా నిర్మించిన డిగ్రీ కాలేజీ భవనాలను ఇటీవలే ప్రారంభించారు. రూ.1.29 లక్షలతో ఇదే చోట నిర్మించిన మోడల్‌ స్కూల్‌ బాలికల హాస్టల్‌ భవనాన్ని కూడా ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చారు.

#Tags