Jagananna Civil Services Prothsahakam : ‘జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం’ కు దరఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రొత్సాహకం పథకాన్ని ప్రవేశపెట్టిన విష‌యం తెల్సిందే. ఈ పథకం ద్వారా 2023లో యూపీపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి జె.రాజాదేబోర బుధవారం తెలిపారు.
Jagananna Civil Services Prothsahakam Applications

మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధిస్తే రూ.50వేలు అందిస్తారని వివరించారు. ప్రొత్సాహకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://jnanabhumi.ap.gov.in/  వెబ్‌ లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను నమోదు చేసుకోవడానికి నవంబర్‌ 4 చివరి తేదీ అని వెల్లడించారు.

☛ Women IPS Success Stories : యూట్యూబ్‌లో వీడియోలు చూసి యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..

అర్హులైన పౌరులందరికీ..

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన పౌరులందరికీ నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకాన్ని ప్రకటించిన విష‌యం తెల్సిందే.  ఇందులో భాగంగా సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ‘జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహం’ అనే కొత్త పథకాన్ని మంజూరు చేసింది. ప్రతి సంవత్సరం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ)లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది ఎంపికయ్యేలా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. దీనిద్వారా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తుంది.

☛ UPSC Civils Topper Bhawna Garg Success Story : యూపీఎస్సీ సివిల్స్‌.. ఫ‌స్ట్‌ అటెమ్ట్.. ఫ‌స్ట్ ర్యాంక్‌.. నా స‌క్సెస్‌కు..

నేరుగా వారి ఖాతాల్లోకే..
యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.లక్ష,  మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారికి రూ.50 వేలు చొప్పున డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. యూపీఎస్‌సీ అనుమతించే ఎన్ని పర్యాయాలు అయినా ఆ అభ్యర్థులకు ప్రభుత్వం ఈ  ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ ప్రోత్సాహకంతో అభ్యర్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

#Tags