Internship Benefits: జాబ్‌ మార్కెట్‌లో ముందుండాలంటే ఇంటర్న్‌షిప్‌ త‌ప్పనిస‌రి.. ఇలా చేరండి..

చదువుకుంటూనే ఇండస్ట్రీ స్కిల్స్‌ సొంతం చేసుకుని.. జాబ్‌ మార్కెట్‌లో ముందంజలో నిలిచేందుకు మార్గం.. ఇంటర్న్‌షిప్‌! అకడమిక్‌గా చదువుకున్న సబ్జెక్ట్‌ అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించి.. రియల్‌ టైమ్‌ నైపుణ్యాలు అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది ఇంటర్న్‌షిప్‌!! అందుకే ఇప్పుడు ఏఐసీటీఈ అకడెమిక్స్‌లో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో..ఇంటర్న్‌షిప్‌ ప్రాధాన్యత, విద్యార్థులకు ప్రయోజనాలు, అందుకునేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం..
  • ఇంటర్న్‌షిప్‌తో క్షేత్ర నైపుణ్యాల సాధన
  • భవిష్యత్తు అవకాశాలకు మెరుగైన మార్గం
  • ఇంటర్న్‌ ట్రైనీగా చూపిన ప్రతిభతో శాశ్వత కొలువు 
  • ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు ఎన్నో మార్గాలు

ఇంజనీరింగ్, ఎంబీఏ ప్రోగ్రామ్‌ల కరిక్యులంలో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ.. ఏఐసీటీఈ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులు అప్పటి వరకు తాము అకడమిక్‌గా అధ్యయనం చేసిన అంశాలను.. వాస్తవ పరిస్థితుల్లో అన్వయించేలా క్షేత్రస్థాయిలో శి„ý ణ పొందడమే ఇంటర్న్‌షిప్‌. ఆయా కోర్సులు చదువుతున్న సమయంలోనే క్షేత్ర నైపుణ్యాలు పొందేందుకు చక్కటి మార్గంగా ఇంటర్న్‌షిప్స్‌ను పేర్కొనొచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధానం ప్రకారం–ఇంటర్న్‌షిప్‌ అంటే విద్యార్థులు కొద్దిరోజుల పాటు ఏదైనా ఒక సంస్థలో వాస్తవ పని వాతావరణంలో విధులు నిర్వర్తించడం! దీనివల్ల విద్యార్థులకు సదరు ఇండస్ట్రీలోని క్షేత్ర పరిస్థితులపై అవగాహన లభించడమే కాకుండా.. తాజా నైపుణ్యాలు కూడా సొంతమవుతాయి.

చ‌ద‌వండి: Time Management Tips: ఈ చిట్కాలు పాటించండి... మీరు అనుకున్న పనిని సాధించండి!

క్రెడిట్స్‌ కేటాయింపు

ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం–బీటెక్‌లో చేరిన ప్రతి ఒక్కరూ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ల తర్వాత తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ప్రతిసారి రెండు నెలలు చొప్పును మొత్తంగా కోర్సు వ్యవధిలో ఆరు వందల నుంచి ఏడు వందల గంటల పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాలి. ఈ ఇంటర్న్‌షిప్స్‌కు ఏఐసీటీఈ క్రెడిట్స్‌ను కూడా కేటాయించింది. ప్రతి 40–45 గంటల వ్యవధికి ఒక క్రెడిట్‌ చొప్పున మొత్తం 14 నుంచి 20 క్రెడిట్స్‌ లభిస్తాయి. ఇప్పటికే పలు సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఐఐఎంలు, ఐఐటీలు వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ.. వాటిని తమ విద్యార్థులకు ఇప్పించడానికి ఇండస్ట్రీ వర్గాలతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి.

అన్ని రకాల కోర్సులకు

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్న్‌షిప్‌ అన్ని విభాగాలకు విస్తరిస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇంటర్న్‌షిప్‌ అంటే టెక్నికల్, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకే అనే భావన ఉండేది. కానీ.. ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్‌ ట్రెండ్‌ సంప్రదాయ, నాన్‌–టెక్నికల్‌ డిగ్రీ విభాగాలకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్థులకు ఈ–కామర్స్‌ సంస్థలు, స్టార్ట్‌–అప్‌ కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నాయి. ఇందుకోసం తమ సంస్థల వెబ్‌సైట్స్‌ లేదా జాబ్‌ పోర్టల్స్‌ ద్వారా ప్రకటనలను విడుదల చేస్తున్నాయి.

ఇంటర్న్‌ ట్రైనీ అవకాశాలు

ఇంటర్న్‌షిప్‌ అవకాశాల కోసం ప్రస్తుతం పలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని సంస్థలు కోర్సు చివరి సంవత్సరంలో అడుగుపెట్టే విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి.. ఇంటర్న్‌ ట్రైనీగా పని చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఆ సమయంలో విద్యార్థుల డొమైన్‌కు అనుగుణంగా.. సంస్థలోని వివిధ విభాగాలను కేటాయిస్తున్నాయి. విద్యార్థులు తమ డొమైన్‌ సంబంధిత విభాగాల్లో, సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ కోసం అన్వేషణ సాగించి.. అవకాశాలు అందిపుచ్చుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ సాధనలో ముందంజలో నిలిచే అవకాశం లభిస్తుంది అంటున్నారు నిపుణులు.

చ‌ద‌వండి: Career Opportunities After B.Tech: బీటెక్‌ తర్వాత పయనమెటు... ఉన్నత విద్య లేక ఉద్యోగమా?

ఆన్‌లైన్‌ నియామకాలు

పలు సంస్థలు తమ వెబ్‌సైట్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో ఇంటర్న్‌ ట్రైనీ అవకాశాలు కల్పిస్తున్నాయి. తమ వెబ్‌సైట్‌లో కెరీర్స్‌/కరెంట్‌ ఆపర్చునిటీస్‌ ఆప్షన్‌లో ఇంటర్న్‌షిప్‌ ఖాళీల వివరాలు ప్రకటిస్తున్నాయి. వీటికి దరఖాస్తు చేసుకుని ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. ఇంటర్న్‌ ట్రైనీగా అవకాశం లభిస్తుంది. ఈ ఎంపిక 
ప్రక్రియలో సంస్థలు అభ్యర్థుల అకడమిక్‌ నైపుణ్యాలతోపాటు ప్రాక్టికల్‌ థింకింగ్, అనలిటికల్‌ స్కిల్స్‌ను 
పరిశీలించే విధంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. 

జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌

ఇంటర్న్‌షిప్‌ అందుకునేందుకు మరో మార్గం.. జాబ్‌సెర్చ్‌ పోర్టల్స్‌. ఇవి.. క్లయింట్‌ సంస్థల్లోని ఇంటర్న్‌షిప్‌ ఖాళీల సమాచారాన్ని పొందుపరుస్తున్నాయి. గతంలో కేవలం జాబ్‌ లిస్టింగ్స్‌కే పరిమితమైన ఈ పోర్టల్స్‌.. ఇప్పుడు ఇంటర్న్‌ ఖాళీల వివరాలను కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని అకడమిక్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

సోషల్‌ వేదికలు

ట్విటర్, లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలు సైతం ఇంటర్న్‌షిప్‌ అవకాశాల సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి. వీటిల్లో ఆయా సంస్థలు, రంగాలకు చెందిన నిపుణులు పోస్టింగ్స్‌ పెడుతున్నారు. దీంతో.. విద్యార్థులు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ ద్వారా సదరు రంగాల్లోని నిపుణుల ద్వారా ఇంటర్న్‌ ట్రైనీ ఖాళీలకు సంబంధించిన వివరాలు తెలుసుకునే వీలుంది.

చ‌ద‌వండి: career after polytechnic: పాలిటెక్నిక్‌తో.. అద్భుత అవకాశాలు

డిజిలాకర్‌లో సమాచారం

ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను తెలుసుకునేందుకు ప్రభుత్వ స్థాయిలో సైతం పలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్‌ ఈ–గవర్నెన్స్‌ విభాగంలోని డిజిలాకర్‌లో నిరంతరం తాజా ఇంటర్న్‌షిప్‌ ఖాళీలను పొందుపరుస్తున్నారు. వీటిని అందుకోవాలంటే..అభ్యర్థులు డిజిలాకర్‌ ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే డిజిలాకర్‌లో అధిక శాతం ఖాళీలు కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ తదితర సాంకేతిక విభాగాల్లోనే ఉంటున్నాయి. అదే విధంగా గ్రామీణ మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ వంటి ఇతర శాఖల్లోనూ ఇంటర్న్‌షిప్‌ నియామకాలు జరుగుతుంటాయి. కాబట్టి విద్యార్థులు వీటి కోసం ఆయా శాఖల వెబ్‌సైట్స్‌ను పరిశీలిస్తుండాలి.

ఐఐటీలు, ఐఐఎంల్లో ఇలా

దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలు కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీంతో బీటెక్‌ మూడో సంవత్సరం, ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్, ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ పేరుతో సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నాయి. ఇలా ఎంపికైన వారిని ఇంటర్న్‌ ట్రైనీగా పేర్కొంటున్నారు. వీరు ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో ఆయా సంస్థల్లో ఇంటర్న్‌ ట్రైనీగా రియల్‌ టైమ్‌ విధులు నిర్వర్తిస్తారు. అంతేకాకుండా సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్, ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ పేరుతో ఇంటర్న్‌ట్రైనీగా ఎంపికైన వారికి సంస్థలు స్టయిఫండ్‌ పేరుతో ఆకర్షణీయ ఆర్థిక ప్రోత్సాహకాన్ని సైతం అందిస్తున్నాయి.

ఇంటర్న్‌షిప్‌ శిక్షణ

ఇంటర్న్‌షిప్‌ అందుకున్న అభ్యర్థులు సంస్థలో చేరిన తర్వాత చక్కటి పని తీరు చూపాలి. తమకు కేటాయించిన విభాగం, విధులకు సంబంధించి టీమ్‌ సభ్యులతో కలిసి పనిచేయాలి. ఏదైనా సందేహం తలెత్తితే.. టీమ్‌ లీడర్‌ లేదా ఇతర సీనియర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌ సమయంలో సంస్థ ఉద్యోగి మాదిరిగా పూర్తి అంకితభావంతో పనిచేయాలి. ఫలితంగా క్షేత్ర నైపుణ్యాలతోపాటు భవిష్యత్‌ అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది.

చ‌ద‌వండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!

రియల్‌ టైమ్‌ స్కిల్స్‌

ఇంటర్న్‌ ట్రైనీగా ఇండస్ట్రీలో విధులు నిర్వహించడం ద్వారా రియల్‌ టైమ్‌ నైపుణ్యాలు లభిస్తాయి. వీటితోపాటు ఇంటర్‌ పర్సనల్‌ నైపుణ్యాలు, నెగోషియేషన్‌ స్కిల్స్, టీం వర్కింగ్‌ కల్చర్, డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు వంటివి సొంతమవుతాయి. టీమ్‌ మెంబర్స్, టీమ్‌ లీడర్స్‌తో చర్చించి టాస్క్‌ని సమర్థవంతంగా పూర్తి చేయగలిగే నైపుణ్యం లభిస్తుంది. సంబంధిత రంగంలో.. తాజా పరిణామాల గురించి ఇతరులతో చర్చించడం, సమస్యకు తమ స్థాయిలోనే పరిష్కారం కనుగొనే విధంగా అనలిటికల్‌ స్కిల్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ వంటివి అలవడతాయి.

శాశ్వత కొలువు

ఇంటర్న్‌ ట్రైనీలు.. సంస్థలో శాశ్వత కొలువు సైతం సొంతం చేసుకునే వీలుంది. ఇంటర్న్‌ ట్రైనీగా చూపే ప్రతిభ, పనితీరు సంస్థ యాజమాన్యం మెచ్చే రీతిలో ఉంటే.. పూర్తి స్థాయి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఐఐటీలు, ఐఐఎంల నుంచి ఆయా సంస్థల్లో ఇంటర్న్‌ ట్రైనీగా ఎంపికైన వారిలో 50 శాతం మేరకు.. శిక్షణ సందర్భంగా ప్రతిభ చూపి.. అదే సంస్థలో ఫైనల్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ అందుకుంటున్నారు.

#Tags