Skip to main content

Career Opportunities After B.Tech: బీటెక్‌ తర్వాత పయనమెటు... ఉన్నత విద్య లేక ఉద్యోగమా?

బీటెక్‌.. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సు! ఈ కోర్సు పూర్తి చేసుకుంటే.. విస్తృత కెరీర్‌ అవకాశాలు ఖాయమనే భావన! అందుకే ఏటా లక్షల మంది విద్యార్థులు బీటెక్‌లో చేరి బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తుంటారు. ఇంజనీరింగ్‌ తర్వాత కొంతమంది ఉన్నత విద్య లక్ష్యంగా చేసుకుంటే.. మరికొందరు ఉద్యోగావకాశాలపై దృష్టిపెడతారు. ఈ నేపథ్యంలో.. బీటెక్‌ ఉత్తీర్ణులకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం..
Career Opportunities After B.Tech
  • బీటెక్‌ అర్హతతో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు
  • గేట్‌ స్కోర్‌తో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం
  • ఇంజనీరింగ్‌ తర్వాత పలు సర్కారీ కొలువులు
  • ఐఐఎంల్లో మేనేజ్‌మెంట్‌ పీజీకి మార్గం క్యాట్‌
  • విదేశాల్లో ఎంఎస్, ఎంబీఏ చదివే అవకాశం

ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగేళ్ల బీటెక్‌ కోర్సును పూర్తి చేసుకున్న అభ్యర్థులకు విస్తృతమైన ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నా­యి. ఇంజనీరింగ్‌ తర్వాత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా కార్పొరేట్‌ కొలువులు ఖాయం అవుతాయి. అంతేకాకుండా ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకునే వీలుంది. దీంతోపాటు బీటెక్‌ తర్వాత గేట్‌ ద్వారాప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్, క్యాట్‌తో ఐఐఎంల్లో ఎంబీఏలో చేరొచ్చు.

గేట్‌తో.. ఎంటెక్‌ బాట

బీటెక్‌ ఉత్తీర్ణులు ఎక్కువ మంది ఎంటెక్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎంటెక్‌లో అడుగుపెట్టాలంటే.. జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌(గేట్‌)లో స్కోర్‌ సాధించాల్సి ఉంటుంది. గేట్‌లో ర్యాంకు ఆధారంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఎంటెక్‌లో ప్రవేశం లభిస్తోంది. రాష్ట్ర స్థాయిలోని యూ­నివర్సిటీలు సైతం గేట్‌ ఉత్తీర్ణులకు ఎంటెక్‌ సీట్ల కే­టాయింపులో తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి.గేట్‌­ను ప్రతి ఏటా ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌/అక్టోబర్‌ల్లో వెలువడుతుంది. గేట్‌ స్కోర్‌తో ఎంటెక్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ కూడా లభిస్తుంది.

చ‌ద‌వండి: Best Branches for EAMCET Counselling: బీటెక్‌లో బ్రాంచ్, కాలేజ్‌ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

పీజీఈసెట్‌

రాష్ట్ర స్థాయిలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఎంటెక్‌లో చేరేందుకు మార్గం.. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పీజీఈసెట్‌). ఇందులో స్కోర్‌ ఆధారంగా.. యూనివర్సిటీ అనుబంధ కళాశాలలతోపాటు, ప్రైవేట్‌ కళాశాలల్లో ఎంటెక్‌లో అడుగు పెట్టొచ్చు.

క్యాట్‌తో మేనేజ్‌మెంట్‌ పీజీ

బీటెక్‌ అభ్యర్థులు ఆసక్తి చూపుతున్న మరో కోర్సు.. మేనేజ్‌మెంట్‌ పీజీ లేదా ఎంబీఏ. దేశంలో మేనేజ్‌మెంట్‌ విద్యను అందించడంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లకు మంచి పేరుంది. వీటిల్లో చేరేందుకు మార్గం.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌). ఆన్‌లైన్‌ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా ఐఐఎంలు ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తాయి. రాత పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ వెర్బల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ అంశాలపై ప్రశ్నలుంటాయి. ఐఐఎంలే కాకుండా..దేశంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లు కూడా క్యాట్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఎన్‌ఐటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఈ స్కోరే ప్రామాణికం. రాష్ట్ర స్థాయిలోని కళాశాలల్లో ఎంబీఏలో చేరాలంటే.. ఐసెట్‌(ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌

పరిశోధనలపై ఆసక్తి ఉన్న బీటెక్‌ ఉత్తీర్ణులు సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌కు హాజరుకావచ్చు. కెమికల్‌ సైన్సెస్‌; ఎర్త్, అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్, ఓషియన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌; లైఫ్‌ సైన్సెస్‌; మ్యాథమెటికల్‌ సైన్సెస్‌; ఫిజికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో పరిశోధనల కోసం పీహెచ్‌డీకి అభ్యర్థులను ఎంపిక చేసే ఎంట్రన్స్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ-నెట్‌. దీనిద్వారా బీటెక్‌తోనే ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీకి ఎంపికైన వారికి మూడేళ్ల పాటు నెలకు రూ.31వేలు చొప్పున జేఆర్‌ఎఫ్‌(జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌), ఆ తర్వాత పీహెచ్‌డీకి నమోదు చేసుకుంటే నెలకు రూ.35 వేలు చొప్పున ఎస్‌ఆర్‌ఎఫ్‌(సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌) లభిస్తుంది. ఇలా గరిష్టంగా మొత్తం అయిదేళ్ల పాటు జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు లభిస్తాయి.

చ‌ద‌వండి: Study in USA: అమెరికా కల సాకారం చేసుకోవచ్చు ఇలా.. కాలేజ్‌ ఎంపిక, అవసరమైన పత్రాలు, స్టాండర్డ్‌ టెస్టులు తదితర వివరాలు...

విదేశీ విద్యకు ఇలా

బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది లక్ష్యం విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడమంటే అతిశయోక్తి కాదు. విదేశాల్లో చదవాలంటే.. జీఆర్‌ఈ, టోఫెల్‌ వంటి టెస్ట్‌ల్లో మంచి స్కోర్‌ సాధించాలి. సంబంధిత యూనివర్సిటీలో ప్రవేశం ఖరారయ్యాక వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదవాలనుకునే వారు..గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(జీమ్యాట్‌)లాంటి పరీక్షల్లో మంచి స్కోరు సాధించాలి. ప్రస్తుతం మన దేశ విద్యార్థులు ఎక్కువగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఉన్నత విద్య కోసం పయనమవుతున్నారు.

ఉద్యోగావకాశాలు అందుకునేలా

బీటెక్‌ ఉత్తీర్ణులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సొంతం చేసుకునే అవకాశముంది. ఆ వివరాలు..

గేట్‌ స్కోర్‌తో.. పీఎస్‌యూ కొలువు

గేట్‌ స్కోర్‌ ఆధారంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ) ఇంజనీర్‌ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ నియామకాలు చేపడుతున్నాయి. గేట్‌ స్కోర్‌తో ఆయా సంస్థలకు దరఖాస్తు చేసుకుంటే.. మలిదశలో గ్రూప్‌ డిష్కషన్, గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు. పీఎస్‌యూ కొలువు ఖాయమైతే ప్రారంభంలోనే నెలకు రూ.50 వేలకు పైగా వేతనం లభిస్తోంది. గేట్‌లో కనీసం 700 స్కోర్‌ సాధిస్తే పీఎస్‌యూల్లో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.

ఈఐఎస్‌తో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో

బీటెక్‌ ఉత్తీర్ణులకు కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతం చేసుకునేందుకు చక్కటి మార్గం.. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(ఈఎస్‌ఈ). ఈ పరీక్షలో ర్యాంకు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దాదాపు 40కు పైగా శాఖల్లో.. సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ వి­భాగాల్లో.. గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి హోదాలో గెజిటెడ్‌ ర్యాంకులో ఇంజనీర్లుగా నియామకాలు ఖరారు చేస్తారు. ఎంపిక ప్రక్రియలో మూడు దశలు(ప్రిలిమ్స్‌ రాత పరీక్ష, మెయిన్స్‌ రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ) ఉంటాయి. ప్రిలిమ్స్‌ను 500 మార్కులకు, మెయిన్స్‌ను 600 మార్కులకు నిర్వహిస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూకు 200 మార్కులు ఉంటాయి. 

చ‌ద‌వండి: Career Opportunities: 5జీ టెక్నాలజీలో రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల ఉద్యోగాలు..

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగాలు

ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనూ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు అందుబాటులో ఉంటాయి. ఇరిగేషన్‌ అండ్‌ క్యాడ్, వాటర్‌ వర్క్స్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్, హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ వంటి శాఖల్లో ఏఈ పోస్ట్‌లకు రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఆయా పోస్ట్‌లకు నియామకాలను ఖరారు చేస్తారు.

ప్రైవేట్‌ రంగంలో

బీటెక్‌ తర్వాత ప్రైవేట్‌ రంగంలోనూ అవకాశాలు విస్తృతమవుతున్నాయి. ఉత్పత్తి రంగం నుంచి సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ వరకూ.. వివిధ రంగాల్లో ఉద్యోగాలకు ఆయా సంస్థలు ప్రకటనలు ఇస్తున్నాయి. సబ్జెక్టుపై పట్టుతోపాటు ఇంటర్న్‌షిప్, అప్రెంటిషిప్‌ వంటి మార్గాల ద్వారా ప్రాక్టికల్‌ నైపుణ్యాలు పెంచుకుంటే.. కోరుకున్న కంపెనీల్లో కొలువు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇటీవల కాలంలో సంస్థలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ప్రక్రియలకే పరిమితం కాకుండా. ఆఫ్‌ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్, వాక్‌-ఇన్స్‌ నిర్వహిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.

చ‌ద‌వండి: BTech Branches & Colleges Selection 2023 : బీటెక్‌లో.. బ్రాంచ్‌, కాలేజ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే.. ఎంపికలో తొలి ప్రాధాన్య దీనికే ఇవ్వాలి..

సర్టిఫికేషన్స్‌తో అవకాశాలు

బీటెక్‌ విద్యార్థులు ప్రైవేట్‌ రంగంలో అవకాశాలను దక్కించుకునేందుకు జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న అంశాల్లో సర్టిఫికేషన్స్‌ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, ఐఓటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, 3-డి డిజైన్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి అంశాల్లో నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా జాబ్‌ మార్కెట్‌ అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. ప్రస్తుతం ఈ కోర్సులను పలు సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలో అందిస్తున్నాయి.

Published date : 13 Jul 2023 04:53PM

Photo Stories