BITSAT–2023: మెరుగైన ఇంజనీరింగ్‌కు మార్గం.. బిట్‌శాట్‌

దేశంలో నాణ్యమైన ఇంజనీరింగ్‌ విద్యను అందించడంలో బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(బిట్స్‌) క్యాంపస్‌లకు మంచి పేరుంది. వీటిలో ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ల పేరిట బీఈ, బీఫార్మ్, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా బిట్‌శాట్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో సాధించిన స్కోర్‌ ఆధారంగా బిట్స్‌ క్యాంపస్‌ల్లో ప్రవేశం లభిస్తుంది. 2023–24 ప్రవేశాలకు సంబంధించి బిట్‌శాట్‌–2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. బిట్‌శాట్‌తో ప్రవేశం లభించే కోర్సులు, ప్రవేశ పరీక్ష ప్యాట్రన్, బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలు..
  • బిట్స్‌ క్యాంపస్‌ల్లో బీఈ, బీఫార్మ్, ఎమ్మెస్సీల్లో ప్రవేశాలకు బిట్‌శాట్‌ 
  • 2023 విద్యాసంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • రెండు సెషన్లలో బిట్‌శాట్‌–2023

దేశంలో ఇంజనీరింగ్‌ విద్యను అందించే ప్రసిద్ధ ఇన్‌స్టిట్యూట్‌ల్లో బిట్స్‌ ముందు వరుసలో నిలుస్తుంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్, డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా కలిగిన ఈ విద్యాసంస్థలో బీఈ, బీఫార్మ్, ఎమ్మెస్సీ వంటి కోర్సులు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ అవకాశాలు అందుకోవచ్చు. అందుకే వీటిల్లో ప్రవేశానికి నిర్వహించే బిట్‌శాట్‌కు పోటీ కూడా ఎక్కువగానే ఉంటోంది.

అర్హతలు

  • బిట్‌శాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 10+2/ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ/బైపీసీ గ్రూప్‌ సబ్జెక్టులలో ఒక్కో సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులతో.. మొత్తం గ్రూప్‌ సబ్జెక్ట్‌లలో కలిపి సగటున 75 శాతం మార్కులు సాధించాలి.
  • 10+2/ఇంటర్మీడియెట్‌ 2022లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, 2023లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే వారు కూడా బిట్‌శాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

చ‌ద‌వండి: Campus Placement: క్యాంపస్‌ ఆఫర్ల మేళ.. రూ.కోటికి పైగా వేతనం

ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ

  • బిట్స్‌ నిర్వహించే బిట్‌శాట్‌లో స్కోర్‌ ఆధారంగా.. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న మూడు క్యాంపస్‌లు(పిలానీ, గోవా, హైదరాబాద్‌)ల్లో ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ కోర్సులుగా పేర్కొనే బీఈ, బీఫార్మ్, ఎమ్మెస్సీల్లో ప్రవేశం కల్పిస్తారు. 
  • పిలానీ క్యాంపస్‌లో..కెమికల్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. 
  • గోవా క్యాంపస్‌లో.. కెమికల్, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్‌ బ్రాంచ్‌లు ఉన్నాయి. 
  • హైదరాబాద్‌ క్యాంపస్‌లో.. కెమికల్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్‌ బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి.  
  • వీటితోపాటు బీఫార్మ్, ఎమ్మెస్సీ కోర్సుల్లో కూడా బిట్స్‌ క్యాంపస్‌లు ప్రవేశం కల్పిస్తున్నాయి.

 
నాలుగు విభాగాలు..130 మార్కులు

  • బిట్‌శాట్‌ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో నాలుగు విభాగాల్లో మూడు గంటల వ్యవధిలో జరుగుతుంది. 
  • పార్ట్‌–1లో ఫిజిక్స్‌–30, పార్ట్‌–2లో కెమిస్ట్రీ–30, పార్ట్‌–3లో ఎ)ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ    10, బి)లాజికల్‌ రీజనింగ్‌ 20, పార్ట్‌–4లో మ్యాథమెటిక్స్‌/బయాలజీలో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇలా మొత్తం 130 ప్రశ్నలకు పరీక్ష జరుగుతుంది. 
  • నాలుగో విభాగంలో పేర్కొన్న మ్యాథమెటిక్స్‌ లేదా బయాలజీ సబ్జెక్టుల్లో బీఫార్మసీ విద్యార్థులు ఏదో ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. 
  • బీఈ కోర్సుల అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుతోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. 
  • పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున మొత్తం 130 ప్రశ్నలతో 390 మార్కులకు పరీక్ష జరుగుతుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కును తగ్గిస్తారు.

చ‌ద‌వండి: Engineering Students: బీటెక్‌ నాలుగేళ్ల ప్రణాళిక ఇలా..

అదనంగా 12 ప్రశ్నలు

బిట్‌శాట్‌లో మరో ప్రత్యేకత.. పరీక్షకు కేటాయించిన మూడు గంటల వ్యవధిలో అన్ని ప్రశ్నలను పూర్తిచేసిన అభ్యర్థులకు..అదనంగా మరో 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం కల్పిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ లేదా బయాలజీ, లాజికల్‌ రీజనింగ్‌ నుంచి మూడు ప్రశ్నలు చొప్పున ఇస్తారు.

రెండు సెషన్లు

బిట్‌శాట్‌ను రెండు దశలుగా(సెషన్లు)నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితంగా విద్యార్థులకు ఏ సెషన్‌లో మంచి స్కోర్‌ వస్తుందో..దాన్ని మెరిట్‌ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా రెండు సెషన్లకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా తొలి సెషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందే.

మెరిట్‌ జాబితా ఇలా

మెరిట్‌ జాబితా రూపకల్పనలో బిట్‌శాట్‌లో పొందిన స్కోర్‌ను.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న క్యాంపస్‌ ప్రాథమ్యాలను, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. దానికి అనుగుణంగా సీట్ల కేటాయింపు చేస్తారు.

బోర్డ్‌ టాపర్స్‌కు నేరుగా ప్రవేశం

బిట్స్‌ ప్రవేశాల పరంగా మరో ప్రత్యేకత.. ఆయా రాష్ట్రాల బోర్డ్‌ల పరిధిలో ఇంటర్మీడియెట్, తత్సమాన కోర్సులో స్టేట్‌ టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు బిట్‌శాట్‌కు హాజరు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ బోర్డ్‌ టాపర్స్‌ నేరుగా ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందే వీలుంది. ఈ విధానానికి కూడా విద్యార్థుల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది.

చ‌ద‌వండి: Career Opportunities: 5జీ టెక్నాలజీలో రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల ఉద్యోగాలు..

బోధన విధానం

బిట్స్‌ క్యాంపస్‌లలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు కోర్సు కాల వ్యవధిలో విస్తృత నైపుణ్యాలు అందుకునే అవకాశం లభిస్తుంది. ఆయా కోర్సులకు సంబంధించి బిట్స్‌ ప్రత్యేక కరిక్యులంను రూపొందించింది. విద్యార్థుల్లో ప్రాక్టికల్‌ అప్రోచ్‌ పెరిగే విధంగా దీన్ని సిద్ధం చేశారు. బీఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు.. కోర్సు వ్యవధిలో రెండుసార్లు ప్రాక్టీస్‌ స్కూల్‌–1,ప్రాక్టీస్‌ స్కూల్‌–2 పేరుతో.. పరిశ్రమల్లో రీసెర్చ్‌ కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

మైనర్‌ ప్రోగ్రామ్స్‌

కోర్‌ సబ్జెక్ట్‌లే కాకుండా.. విద్యార్థులకు ఇతర అంశాల్లోనూ అవగాహన కల్పించే విధంగా మైనర్‌ ప్రోగ్రామ్స్‌ విధానాన్ని బిట్స్‌ అమలు చేస్తోంది. ఫైనాన్స్, అకౌంటింగ్, లిటరేచర్, హ్యుమానిటీస్‌ వంటి పలు సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్‌ ఇవ్వడం మరో విశేషం.

300కు పైగా స్కోర్‌

బిట్‌శాట్‌ ద్వారా దేశంలోని మూడు బిట్స్‌ క్యాంపస్‌లలో మూడు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ఏటా దాదాపు 60 వేల మంది పోటీ పడుతున్నట్లు సమాచారం. దీంతో..పరీక్షలో 300కు పైగా మార్కులు సాధిస్తేనే తుది విజేతల జాబితాలో నిలిచే అవకాశం ఉంటుంది.

ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు

బిట్‌శాట్‌ స్కోర్‌ ఆధారంగా దేశంలోని పలు ప్రైవేటు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు కూడా బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ, బిట్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఇది కాకుండా దాదాపు వంద వరకు ప్రముఖ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు తమ ప్రవేశ ప్రక్రియకు బిట్‌శాట్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలు

జాతీయ స్థాయిలో వేల సంఖ్యలో విద్యార్థులు పోటీ పడే బిట్‌శాట్‌లో బెస్ట్‌ స్కోర్‌ సాధించేందుకు దృష్టి సారించాల్సిన అంశాలు..

చ‌ద‌వండి: SAP Careers & Job Opportunities: ఎస్‌ఏపీ ప్రాధాన్యత, ఉద్యోగావకాశాలు..

బేసిక్‌ కాన్సెప్ట్స్‌..ఫస్ట్‌

  • బిట్‌శాట్‌ అభ్యర్థులు తొలుత బేసిక్‌ కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఈ పరీక్ష కూడా జేఈఈ స్థాయి క్లిష్టతతో ఉంటోంది. ప్రశ్నలన్నీ దాదాపుగా అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ఉంటున్నాయి. దీంతో అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ బేసిక్స్‌పై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి. జేఈఈ ప్రిపరేషన్‌తో అనుసంధానం చేసుకుంటూ.. చదవడం వల్ల ఒకే సమయంలో రెండు పరీక్షలకు ప్రిపరేషన్‌ సాగించొచ్చు. బేసిక్స్‌పై పట్టు సాధించడంతోపాటు విద్యార్థులు నిర్దిష్టంగా కొన్ని వ్యూహాలు అనుసరిస్తే.. బిట్‌శాట్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచే అవకాశముంది.
  • ప్రతి సబ్జెక్ట్‌లోనూ ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు షార్ట్‌కట్‌ మెథడ్స్‌తో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది.
  • కెమిస్ట్రీలో ముఖ్యంగా ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో కెమికల్‌ రియాక్షన్స్‌ను ఒక జాబితాగా రూపొందించుకోవాలి.
  • ఫిజిక్స్‌లో.. వర్క్‌ అండ్‌ ఎనర్జీ, న్యూటన్స్‌ లా, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మ్యాగ్నటిజం అండ్‌ మ్యాగ్నటిక్‌ ఎఫెక్ట్‌ ఆఫ్‌ కరెంట్, ఎలక్ట్రిక్‌ కరెంట్‌ యూనిట్లలో ముఖ్య అంశాలతో నోట్స్‌ రూపొందించుకోవాలి.
  • మ్యాథమెటిక్స్‌లో.. హైపర్‌బోలా, పారాబోలా, రెక్టాంగులర్‌ పారాబోలా, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, 3–డి, ఇంటెగ్రల్‌ కాలిక్యులస్‌ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

చ‌ద‌వండి: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్‌ కాలేజీలు, కోర్సుల పరిస్థితి ఇదీ..

పార్ట్‌–3కి ప్రత్యేకంగా

  • ఇతర ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లతో పోలిస్తే.. బిట్‌శాట్‌ ప్రత్యేకం పార్ట్‌–3 అని చెప్పొచ్చు. ఈ విభాగంలో ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ, లాజికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. కేవలం అభ్యర్థుల్లోని సబ్జెక్ట్‌ నైపుణ్యాలను పరీక్షించడమే కాకుండా.. లాంగ్వేజ్, తులనాత్మక పరిశీలన సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఈ విభాగాన్ని పొందుపర్చారు. పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్‌ గ్రామర్, వొకాబ్యులరీపై పట్టుంటే.. 25 ప్రశ్నలకు సులువుగా సమాధానం ఇవ్వొచ్చు.

బిట్‌శాట్‌–2023 ముఖ్య సమాచారం
సెషన్‌ 1 ముఖ్య తేదీలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 9, 2023
  • టెస్ట్‌ సెంటర్‌ కేటాయింపు: ఏప్రిల్‌ 26, 2023
  • టెస్ట్‌ తేదీ, స్లాట్‌ బుకింగ్‌ సదుపాయం: ఏప్రిల్‌ 27– మే 8, 2023
  • హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: మే 10 నుంచి పరీక్ష తేదీ వరకు
  • బిట్‌శాట్‌–2023 సెషన్‌–1 పరీక్ష తేదీలు: మే 21 –మే 26, 2023

సెషన్‌ 2 ముఖ్య తేదీలు

  • బిట్‌శాట్‌–2023 సెషన్‌–2 దరఖాస్తు తేదీ: మే 22 – జూన్‌ 12, 2023
  • బిట్‌శాట్‌–2023 సెషన్‌–2 పరీక్ష తేదీలు: జూన్‌ 18 – జూన్‌ 22, 2023
  • అడ్మిషన్‌ జాబితా ప్రకటన: జూలై 1, 2023
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: బిట్స్‌ పిలానీ–హైదరాబాద్‌ క్యాంపస్, హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.bitsadmission.com/fdmain.aspx

#Tags