Skip to main content

SAP Careers & Job Opportunities: ఎస్‌ఏపీ ప్రాధాన్యత, ఉద్యోగావకాశాలు..

సిస్టమ్‌ అప్లికేషన్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌..సంక్షిప్తంగా ఎస్‌ఏపీ!ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌(ఈఆర్‌పీ)లో అత్యంత కీలకం ఎస్‌ఏపీ మాడ్యూల్‌! సంస్థల్లో.. సేల్స్‌ మొదలు టెక్నికల్‌ విభాగాల వరకూ..అన్నింటినీ కేంద్రీకృత విధానంలో.. సమన్వయం చేసుకుంటూ.. కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ఎస్‌ఏపీ దోహదపడుతుంది. ఇలాంటి కీలకమైన ఎస్‌ఏపీలో నైపుణ్యం సాధించిన వారికి చక్కటి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఏపీ ప్రాధాన్యత, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం..
SAP Careers and Job Opportunities
  • ఫంక్షనల్‌ నుంచి టెక్నికల్‌ వరకు పలు మాడ్యూల్స్‌లో ఎస్‌ఏపీ
  • అన్ని నేపథ్యాల వారికి అనువుగా ఎస్‌ఏపీ మాడ్యూల్స్, కెరీర్స్‌

ఎస్‌ఏపీ ఒక ప్రధానమైన ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌(ఈఆర్‌పీ) సొల్యూషన్‌గా ఎంతోకాలంగా వాడుకలో ఉంది. ఇటీవల కాలంలో.. సంస్థలు మరింతగా ఆన్‌లైన్‌ బాట పట్టడం, కేంద్రీకృత విధానంలో కార్యకలాపాలను నిర్వహించాలని భావిస్తుండడంతో.. ఎస్‌ఏపీకి డిమాండ్‌ పెరుగుతోంది. కాబట్టి విద్యార్థులు ఎస్‌ఏపీలో తమకు సరితూగే మాడ్యూల్స్‌లో నైపుణ్యాలు పొందితే చక్కటి కెరీర్‌ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 

ఈఆర్‌పీలో అగ్రగామిగా

ఎస్‌ఏపీ గురించి తెలుసుకోవాలంటే.. ముందుగా ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ)పై అవగాహన పెంచుకోవాలి. ఈఆర్‌పీ అనేది.. ఒక సంస్థకు సంబంధించిన అన్ని విభాగాల(ఉదా: అకౌంటింగ్, ప్రొక్యూర్‌మెంట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, కస్టమర్‌ రిలేషన్‌ మేనేజ్‌మెంట్‌)ను నిర్వహించే సాఫ్ట్‌వేర్‌. దీనికి సంబంధించిన అప్లికేషన్స్‌ను, ప్రోగ్రామ్స్‌ను రూపొందించే ప్రక్రియే..ఎస్‌ఏపీ. అంటే..కేంద్రీకృత విధానం ద్వారా ఒక సంస్థలోని అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ.. సమయం వృధా కాకుండా..ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎస్‌ఏపీ ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే వస్తువుల ఉత్పత్తికి, సేవలు విస్తరించడానికి ఆస్కారం లభిస్తుంది.

చ‌ద‌వండి: Engineering Special: 'సీఎస్‌ఈ'కే.. సై అంటున్న విద్యార్థులు

పలు మాడ్యూల్స్‌లో ఎస్‌ఏపీ

ఎస్‌ఏపీ ద్వారా ఒక సంస్థలోని అన్ని విభాగాలు కార్యకలాపాలు పూర్తి చేసుకునేలా.. అందుకు సంబంధించి వేర్వేరు మాడ్యూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 160కి పైగా ఎస్‌ఏపీ మాడ్యూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని మాడ్యూల్స్‌ ఎవర్‌గ్రీన్‌గా ఉన్నాయి.

ఎస్‌ఏపీ ఫికో(ఫైనాన్స్‌ అండ్‌ కాస్ట్‌ కంట్రోలింగ్‌)

ఎస్‌ఏపీ ఈఆర్‌పీలోని కీలకమైన మాడ్యూల్స్‌లో ఎస్‌ఏపీ ఫికో ఒకటి. దీనిద్వారా సంస్థల్లోని అకౌంటింగ్, ఫైనాన్స్‌కు సంబంధించిన చెల్లింపులు, రాబడులు, జనరల్‌ లెడ్జర్‌ అకౌంటింగ్, అసెట్‌ అకౌంటింగ్, బ్యాంక్‌ అకౌంటింగ్‌ వంటి కార్యకలాపాలను పూర్తి చేసుకోవచ్చు. కామర్స్‌ లేదా ఫైనాన్స్‌ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ మాడ్యూల్‌లో శిక్షణ తీసుకోవడం సులభంగా ఉంటుంది. 

ఎస్‌ఏపీ–సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌

ఒక వస్తువు ధర నిర్ణయం, లభ్యత, బిల్లింగ్, ఇన్వాయిస్‌ల తయారీ వంటి కార్యకలాపాలకు ఎస్‌ఏపీ సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ అనువుగా ఉంటుంది. ఈ మాడ్యూల్‌లో సేల్స్, మాస్టర్‌ డేటా, సేల్స్‌ సపోర్ట్, ప్రొడక్ట్‌ ట్రాన్స్‌పోర్టేషన్, మెటీరియల్‌ షిప్పింగ్‌ వంటి అంశాలు ఉంటాయి. ఈ మాడ్యూల్‌ను కూడా సంప్రదాయ డిగ్రీ ఉత్తీర్ణులు సైతం అభ్యసించే అవకాశం ఉంది. 

ఎస్‌ఏపీ–కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌

శాప్‌ మాడ్యూల్స్‌లో.. అత్యంత కీలకమైనదిగా ఎస్‌ఏపీ–సీఆర్‌ఎంను పేర్కొనొచ్చు. ఒక ప్రొడక్ట్‌ సేల్స్‌కు సంబంధించి కస్టమర్లకు అనువైన రీతులను విశ్లేషించి.. దానికి అనుగుణంగా సంబంధిత ఉత్పత్తుల తయారీ,కస్టమర్ల ఆదరణ పొందేందుకు అనువైన వ్యూహాలను రూపొందించేందుకు ఎస్‌ఏపీ సీఆర్‌ఎంను పలు సంస్థలు వినియోగిస్తున్నాయి. 

ఎస్‌ఏపీ–హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌(హెచ్‌సీఎం)

సంస్థలోని మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడేమాడ్యూల్‌.. ఎస్‌ఏపీ హెచ్‌సీఎం. ఉద్యోగుల సామర్థ్యాలను పెంచే విధంగా.. ప్లానింగ్, నిర్వహణ, ఖర్చుల క్రమబద్ధీకరణ, పే రోల్స్‌ తయారీ, హెచ్‌సీఎం ప్రక్రియలను ఒక క్రమ పద్ధతిలో రూపొందించడం వంటి విషయాల్లో హెచ్‌సీఎం మాడ్యూల్‌ దోహదపడుతుంది. ఎంబీఏలో హెచ్‌ఆర్‌ స్పెషలైజేషన్‌ ఉత్తీర్ణులకు ఈ మాడ్యూల్‌ ఉపయుక్తంగా ఉంటుంది.

ఎస్‌ఏపీ–మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌

ఒక సంస్థకు సంబంధించి ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, వేర్‌హౌస్‌ మేనేజ్‌మెంట్‌ల నిర్వహణలో ఈ మాడ్యూల్‌ ప్రయోజనకరంగా నిలుస్తోంది. ఒక ఉత్పత్తి రూపకల్పనకు సంబంధించిన మెటీరియల్‌ సేకరణ, స్టోరేజ్‌ తదితర అంశాల్లో.. మాస్టర్‌ డేటా, ఇన్వెంటరీ, పర్చేజింగ్, మెటీరియల్‌ రిసోర్స్‌ ప్లానింగ్, లాజిస్టిక్స్‌కు సంబంధించి ఇది అత్యంత కీలకంగా నిలుస్తోంది. 

చ‌ద‌వండి: Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి..?

ఎస్‌ఏపీ–ప్రొడక్ట్‌ ప్లానింగ్‌

మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫికో,సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ మాడ్యూల్స్‌తో అనుసంధానం చేసుకుంటూ.. సదరు వ్యాపార ప్రక్రియను సాగించే మాడ్యూల్‌గా ఎస్‌ఏపీ ప్రొడక్ట్‌ ప్లానింగ్‌ గుర్తింపు పొందుతోంది. ఒక వస్తువు ఉత్పత్తికి సంబంధించి యంత్రాల నిర్వహణ, ముడిసరుకు నిల్వ మొదలు ప్రొడక్ట్‌ పూర్తయ్యే వరకూ.. అన్ని ప్రక్రియలకు సంబంధించిన రికార్డ్‌లను పొందుపరిచే మాడ్యూల్‌ ఇది. మాస్టర్‌ డేటా నిర్వహణ, వర్క్‌ సెంటర్, మెటీరియల్‌ మాస్టర్, ప్రొడక్ట్‌ వెర్షన్, మెటీరియల్‌కు సంబంధించిన బిల్లింగ్‌ వ్యవహారాల్లోనూ ఈ మాడ్యూల్‌ ఉపయుక్తంగా ఉంటోంది. మాన్యుఫ్యాక్చరింగ్, సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌ లేదా ప్లానింగ్‌కు సంబంధించి అకడమిక్‌ నైపుణ్యాలున్న వారు ఈ మాడ్యూల్‌ను సులభంగా నేర్చుకునే అవకాశం ఉంది.

ఎస్‌ఏపీ–అడ్వాన్స్‌డ్‌ బిజినెస్‌ అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌

ఎస్‌ఏపీ–అబాప్‌గా పిలిచే ఈ మాడ్యూల్‌.. శాప్‌ మాడ్యూల్స్‌లో కీలకమైన టెక్నికల్‌ మాడ్యూల్‌గా గుర్తింపు పొందింది. ఎస్‌ఏపీ అప్లికేషన్‌ సర్వర్‌కు సంబంధించి నిర్దిష్ట సిస్టమ్‌ లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేయడం లేదా కొత్త లాంగ్వేజ్‌ను రూపొందించడం ఇందులో ప్రధానమైన ప్రక్రియగా పేర్కొనొచ్చు. జావా, సి, సి++, పైథాన్‌ వంటి లాంగ్వేజ్‌ల ఆధారంగా ఈ మాడ్యూల్‌లో విధులు ఉంటాయి. కోడింగ్, ప్రోగ్రామింగ్, అనలిటికల్‌ స్కిల్స్‌ ఉన్న అభ్యర్థులు దీనిపై సులభంగా పట్టు సాధించొచ్చు.

ఎస్‌ఏపీ–క్వాలిటీ మేనేజ్‌మెంట్‌

ఒక ఉత్పత్తికి సంబంధించి క్వాలిటీ ప్లానింగ్, ఇన్‌స్పెక్షన్,క్వాలిటీ కంట్రోల్‌ వంటి విధులను పూర్తి చేసుకునేందుకు ఉపయోగపడే మాడ్యూల్‌ ఇది. ఒక ఉత్పత్తికి సంబంధించి విశిష్టతను పర్యవేక్షించడమే కాకుండా.. క్వాలిటీ నోటిఫికేషన్‌ చార్ట్స్‌ను రూపొందించడంలో ఇది దోహదపడుతుంది. పూర్తిగా ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, పర్చేజ్‌ మేనేజ్‌మెంట్‌లతో సమీకృతం చేసుకుంటూ.. బిజినెస్‌ ప్రక్రియలను పూర్తి చేసే మాడ్యూల్‌ ఇది. లాజిస్టిక్స్, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌లో డొమైన్‌ నాలెడ్జ్‌ ఉన్న అభ్యర్థులు దీన్ని సులభంగా నేర్చుకునే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి..?

ఎస్‌ఏపీతో లభించే కొలువులు

మన దేశంలో ఒక్క ఐటీ రంగంలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎస్‌ఏపీ నిపుణుల నియామకాల్లో 68 శాతం వృద్ధి కనిపించింది. 2025 నాటికి ఈ విభాగంలో అయిదు మిలియన్ల ఉద్యోగావకాశాలు ఉంటాయని పలు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎస్‌ఏపీ వివిధ మాడ్యూల్స్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి.. సంబంధిత విభాగాల్లో ఎస్‌ఏపీ కన్సల్టెంట్, డెవలపర్, ప్రాజెక్ట్‌ మేనేజర్, అడ్మినిస్ట్రేటర్, సొల్యూషన్‌ డెవలప్‌మెంట్‌ కన్సల్టెంట్, ప్రీ–సేల్స్‌ కన్సల్టెంట్, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, ప్రొక్యూర్‌మెంట్‌ స్పెషలిస్ట్, ఇంప్లిమెంటేషన్‌ కన్సల్టెంట్, ఎస్‌ఏపీ ట్రైనర్, సిస్టమ్‌ ఇంజనీర్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

సర్టిఫికేషన్స్‌
అసోసియేట్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌

ఎస్‌ఏపీకి సంబంధించి ప్రాథమిక అవగాహనతోపాటు బేసిక అంశాలపై నైపుణ్యాలను అందించే దశగా అసోసియేట్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నిలుస్తోంది. శాప్‌లోని ఇతర మాడ్యూల్స్‌ను అభ్యసించాలంటే.. ముందుగా ఈ సర్టిఫికేషన్‌ పొందాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Best Certification Courses: సర్టిఫికేషన్స్‌తో.. కెరీర్‌ షైన్‌!

డెల్టా సర్టిఫికేషన్‌

అసోసియేట్‌ సర్టిఫికేషన్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఇందులో చేరొచ్చు. శాప్‌ మాడ్యూల్స్‌కు సంబంధించి నిరంతర అప్‌డేట్స్, వాటికి సంబంధించిన నైపుణ్యాలపై శిక్షణ అందించే దశ ఇది. 

స్పెషలిస్ట్‌ సర్టిఫికేషన్‌

ఎస్‌ఏపీకి సంబంధించి నిర్దిష్ట మాడ్యూల్‌లో ప్రొఫెషనల్స్‌గా రూపొందాలనుకునే వారికి ఉపయోగపడే సర్టిఫికేషన్‌ ఇది. సంబంధిత మాడ్యూల్‌లో అసోసియేట్‌ సర్టిఫికేషన్‌ పొందిన వారికే స్పెషలిస్ట్‌ సర్టిఫికేషన్‌లో చేరడానికి, ఆ తర్వాత నిర్వహించే పరీక్షకు హాజరుకావడానికి అర్హత లభిస్తుంది.

ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్‌

ఎస్‌ఏపీలో అత్యంత అడ్వాన్స్‌డ్‌ లెవల్‌ సర్టిఫికేషన్‌గా ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్‌ను పరిగణిస్తారు. వాస్తవ ప్రాజెక్ట్‌ అనుభవం, వ్యాపార నిర్వహణ పరిజ్ఞానం, శాప్‌ సొల్యూషన్స్, టూల్స్‌కు సంబంధించి విస్తృత అవగాహన ఉన్న వారికే ఈ సర్టిఫికేషన్‌కు అవకాశం ఉంటుంది.

బ్యాచిలర్, పీజీతో సర్టిఫికేషన్స్‌

ఎస్‌ఏపీ అందించే పలు దశల సర్టిఫికేషన్స్‌ పూర్తి చేయడానికి బ్యాచిలర్‌ డిగ్రీ, లేదా పీజీ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు ఎంచుకున్న మాడ్యూల్‌ ఆధారంగా కనిష్టంగా 30 రోజులు, గరిష్టంగా 60 రోజుల్లో ఈ సర్టిఫికేషన్‌ పూర్తి చేసుకునే అవకాశముంది.

Published date : 16 Nov 2022 07:09PM

Photo Stories