Campus Placement: క్యాంపస్ ఆఫర్ల మేళ.. రూ.కోటికి పైగా వేతనం
- ఐఐటీ, ఎన్‌ఐటీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జోరు
- ప్రముఖ ఐఐటీల్లో రూ.కోటికి పైగా వేతనంతో ఆఫర్స్
- ఎన్‌ఐటీల్లోనూ రికార్డ్ స్థాయిలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్
- ట్యాలెంట్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందంటున్న నిపుణులు
టెక్నికల్ విద్య, బోధన విషయంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. వాస్తవ ధృక్పథంతో ఈ విద్యాసంస్థలు పాటించే ప్రమాణాలు, విద్యార్థులకు అందించే నైపుణ్యాలు, జాబ్ రెడీ స్కిల్స్ విద్యార్థుల కెరీర్‌కు సోపానాలుగా మారుతున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఈ ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు సంస్థలకు హాట్ ఫేవరెట్స్‌గా నిలుస్తున్నారు.
చదవండి: Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..
భారీగా ప్యాకేజ్
- ఐఐటీలు, ఎన్‌ఐటీ క్యాంపస్ డ్రైవ్స్‌లో ఈ ఏడాది రూ.కోటికిపైగా వార్షిక ప్యాకేజ్‌తో ఆఫర్లు ఖరారు కావడం విశేషం. ముఖ్యంగా ఫస్ట్ జనరేషన్ ఇన్‌స్టిట్యూట్‌లుగా గుర్తింపు పొందిన ఐఐటీ-ఖరగ్‌పూర్,ఢిల్లీ, ముంబై, కాన్పూర్, చెన్నై వంటి క్యాంపస్‌ల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది.
- ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2023 బ్యాచ్‌కు సంబంధించి ప్లేస్‌మెంట్ ప్రక్రియ తొలి దశలో అత్యధిక వార్షిక వేతనం రూ.2.68 కోట్లుగా నమోదైంది. ఈ క్యాంపస్‌లో తొలి దశ డ్రైవ్స్‌లో 1600 మందికి ఆఫర్లు లభించాయి. రూ.50 లక్షలు కనిష్ట వార్షిక వేతనంగా నమోదైంది. 16 మందికి అంతర్జాతీయ ఆఫర్లు అందాయి.
- ఐఐటీ కాన్పూర్‌లో రూ.1.9 కోట్ల వార్షిక ప్యాకేజ్‌తో ఆఫర్ లభించింది. ఇలా మొత్తం 33 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా ప్యాకేజ్ ఖరారైంది. మొత్తంగా చూస్తే 947మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారు కాగా, వాటిలో 74 ఇంటర్నేషనల్ ఆఫర్లు ఉండడం గమనార్హం.
- ఐఐటీ ఢిల్లీలో 1300కు పైగా ఆఫర్లు ఖరారవగా, 50 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా వార్షిక ప్యాకేజ్ లభించింది. ఈ క్యాంపస్‌లో గరిష్ట వేతనం ఏకంగా రూ.నాలుగు కోట్లుగా నమోదవడం విశేషం. అదే విధంగా 30 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ఆఫర్లు లభించాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆఫర్లలో 20 శాతం పెరుగుదల కనిపించింది.
- ఐఐటీ చెన్నైలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ తొలి రోజే 445 మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారవగా.. వారిలో 25 మందికి రూ.కోటికి పైగా వార్షిక వేతనం లభించింది. అంతేకాకుండా మొత్తం 15 మంది విద్యార్థులకు నాలుగు సంస్థల నుంచి ఇంటర్నేషనల్ ఆఫర్స్ దక్కినట్లు ఐఐటీ చెన్నై క్యాంపస్ ప్లేస్‌మెంట్ వర్గాలు తెలిపాయి.
- ఐఐటీ-ముంబై క్యాంపస్ డ్రైవ్స్‌లో ఇప్పటి వరకు 1500 మందికి ఆఫర్లు ఖరారయ్యాయి. వీటిలో 71 ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఉండగా.. 63 మంది వీటికి సమ్మతి తెలిపారు. అదే విధంగా 25 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా వార్షిక వేతనం ఖరారైంది. ఈ క్యాంపస్ తొలి దశ డ్రైవ్స్ ముగిసే సమయానికి అత్యధిక వార్షిక వేతనం రూ.4 కోట్లుగా నమోదైంది.
- ఐఐటీ-రూర్కీలో గరిష్ట వార్షిక వేతనం రూ.1.06 కోట్లుగా నమోదు కాగా, పది మంది విద్యార్థులకు రూ.80 లక్షలకు పైగా వేతనం లభించినట్లు రూర్కీ ప్లేస్‌మెంట్స్æ సెల్ వర్గాలు తెలిపాయి.
- ఐఐటీ హైదరాబాద్‌లో తొలి దశ ప్లేస్‌మెంట్స్‌లో 474 మంది విద్యార్థులకు 508 ఆఫర్లు లభించాయి. గరిష్ట వేతనం రూ.63.78 లక్షలుగా నమోదైంది. 54 ఇంటర్నేషనల్ ఆఫర్లు ఉన్నాయి. ఐఐటీ-హైదరాబాద్‌లో ఏఐ బ్రాంచ్ తొలి బ్యాచ్‌లో 82 శాతం మందికి ఆఫర్లు దక్కాయి. ఈ క్యాంపస్‌లో సగటు వార్షిక వేతనం రూ.19.49 లక్షలుగా నమోదైంది.
- ఐఐటీ-గువహటిలో సైతం తొలి దశ క్యాంపస్ డ్రైవ్స్‌లో గరిష్టంగా రూ.2.46 కోట్లతో ఇంటర్నేషనల్ ఆఫర్, రూ.1.1 కోటితో డొమెస్టిక్ ఆఫర్ ఖరారైంది.
చదవండి: Best Certification Courses: సర్టిఫికేషన్స్‌తో.. కెరీర్ షైన్!
ఎన్‌ఐటీలదీ అదే బాట
- ఐఐటీల తర్వాత దేశంలో ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరొందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) క్యాంపస్‌లలో సైతం ఈ ఏడాది భారీగా ఆఫర్స్ లభించాయి.
- తెలుగు రాష్ట్రాల్లోని ఎన్‌ఐటీ-వరంగల్‌లో రూ.88 లక్షల గరిష్ట వేతనంతో ఆఫర్ లభించింది. ఈ క్యాంపస్‌లో మొత్తం వేయి మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారు కాగా.. సగటు వార్షిక వేతనం రూ.19.9 లక్షలుగా నమోదైంది.
- ఎన్‌ఐటీ హమీర్‌పూర్‌లో గతేడాది కంటే 39 శాతం అధికంగా సగటు వార్షిక వేతనం లభించింది. సగటు వార్షిక వేతనం రూ.12.84 లక్షలుగా, గరిష్ట వార్షిక వేతనం రూ. 52 లక్షలుగా నిలిచింది.
- ఎన్‌ఐటీ జంషెడ్‌పూర్‌లో అయిదుగురు విద్యార్థులకు రూ.80 లక్షల వార్షిక వేతనంతో ఇంటర్నేషనల్ ఆఫర్స్ లభించాయి.
- ఎన్‌ఐటీ కాలికట్‌లో సగటు వార్షిక వేతనం రూ.23 లక్షలుగా ఉంది.
- ఎన్‌ఐటీ పాట్నా క్యాంపస్‌లోనూ గరిష్ట వేతనం రూ.52 లక్షలుగా, సగటు వేతనం రూ.16.51 లక్షలుగా నమోదైంది.
- ఇతర ఎన్‌ఐటీల్లోనూ ఇదే తరహాలో గతేడాది కంటే పది నుంచి 20 శాతం అధికంగా ఆఫర్లు లభించడంతోపాటు, వేతనాల్లోనూ పది శాతానికిపైగా పెరుగుదల నమోదైంది.
చదవండి: Career Opportunities: 5జీ టెక్నాలజీలో రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల ఉద్యోగాలు..
టాప్ రిక్రూటర్స్ వీరే
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో టాప్ రిక్రూటింగ్ సంస్థలను పరిగణనలోకి తీసుకుంటే.. క్వాల్ కామ్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, గూగుల్, బార్‌క్లేస్, ఎస్‌ఏపీ ల్యాబ్స్, సిటీ బ్యాంక్, వెల్ ఫార్గో, మైక్రోసాఫ్ట్, బీసీజీ, బెయిన్ అండ్ కో సంస్థలు ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఇవ్వడంలో ముందంజలో ఉన్నాయి. డొమెస్టిక్ ఆఫర్స్ పరంగా ఉబెర్, హనీవెల్, మైక్రాన్ టెక్నాలజీ, ఓఎన్‌జీసీ, ఫ్లిప్‌కార్ట్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎస్‌టీఎం మైక్రోఎలక్ట్రికల్స్ వంటి సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి.
డిమాండింగ్ జాబ్ ప్రొఫైల్స్
కోర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అండ్ ప్రోగ్రామర్స్, డేటా అనలిస్ట్స్, యుఎక్స్ డిజైనర్, ప్రొడక్ట్ డిజైనర్, ఫుల్‌స్టాక్ ఇంజనీర్ జాబ్ ప్రొఫైల్స్‌లో అధిక సంఖ్యలో నియామకాలు జరిగాయి.
చదవండి: Part Time Jobs: చదువుతోపాటు సంపాదన!
డేటా అనలిస్ట్ జోరు
- ఈసారి ఐఐటీ, ఎన్‌ఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో డేటా అనలిస్ట్ ప్రొఫైల్ జోరు కొనసాగింది. ముఖ్యంగా కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌లోని సంస్థలు ఈ నియామకాలు చేపట్టాయి. బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్ సంస్థలు క్లయింట్స్, వినియోగదారులను పెంచుకునే వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. దీంతో డేటా అనలిస్ట్ జాబ్స్‌కు డిమాండ్ కనిపించింది.
- ఐటీ మొదలు ఆన్‌లైన్ టెక్నాలజీస్ ఆధారంగా సేవలందిస్తున్న అన్ని రంగాల్లోని సంస్థలు సాఫ్ట్‌వేర్స్ ప్రోగ్రామింగ్, డిజైనింగ్‌కు ప్రాధాన్యమిస్తుండడంతో.. కోడింగ్ విభాగంలో జాబ్ ప్రొఫైల్స్‌కు కూడా డిమాండ్ కనిపించింది.
ఎస్‌పీఓల్లోనూ వృద్ధి
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఈ ఏడాది సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్‌లోనూ వృద్ధి కనిపించింది. దాదాపు అన్ని క్యాంపస్‌లలో నూటికి 80 శాతం మందికి సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ లభించాయి. గరిష్టంగా రెండు నెలల కాలానికి ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఇచ్చే సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్‌లో స్టయిఫండ్ మొత్తాలు కూడా ఆకర్షణీయంగా నమోదయ్యాయి. కనిష్టంగా రూ.50 లక్షలు, గరిష్టంగా రూ.80 లక్షలు, సగటున రూ.30 లక్షల స్టయిఫండ్‌తో పలు సంస్థలు విద్యార్థులకు ఇంటర్న్ ట్రైనీగా పని చేసేందుకు సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్లు ఖరారు చేశాయి.
రెండు, మూడు రౌండ్లలో ఎంపిక
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో క్యాంపస్ డ్రైవ్స్‌లో పాల్గొన్న సంస్థలు రెండు, మూడు రౌండ్లలో ఎంపిక ప్రక్రియ నిర్వహించాయి. తొలుత రిటెన్ టెస్ట్, ఆ తర్వాత హెచ్‌ఆర్ రౌండ్, చివరగా టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూలు చేపట్టి.. ప్రతిభ ఆధారంగా ఆఫర్లు ఖరారు చేశాయి.
చదవండి: Best Certification Courses: సర్టిఫికేషన్స్‌తో.. కెరీర్ షైన్!
కోడింగ్‌కే ప్రాధాన్యం
సంస్థలు విద్యార్థుల్లోని కోడింగ్ నైపుణ్యాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. కంపెనీలు రిటెన్ టెస్ట్‌లు, టెక్నికల్ రౌండ్స్‌లో కోడింగ్ సంబంధిత నైపుణ్యాలను ఎక్కువగా పరిశీలించినట్లు ఆయా క్యాంపస్‌ల ప్లేస్‌మెంట్ వర్గాలు పేర్కొన్నాయి. కోర్ ఇంజనీరింగ్, సర్క్యూట్ బ్రాంచ్‌లకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌పై విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
మార్చి నాటికి నూరుశాతం
క్యాంపస్ డ్రైవ్స్ ప్రతి ఏటా డిసెంబర్‌లో ప్రారంభమై.. మరుసటి ఏడాది మార్చి వరకు కొనసాగుతాయి. ప్రస్తుతం అన్ని క్యాంపస్‌లలో తొలి దశ ముగిసింది. ఇందులో దాదాపు 80 శాతం మందికి ఆఫర్లు లభించాయి. మార్చి నాటికి నూటికి నూరు శాతం మందికి ఆఫర్లు లభిస్తాయని ఐఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్వీయ అన్వేషణ దిశగా
ఇప్పటికే పలు సంస్థలు లే అఫ్‌లు కొనసాగిస్తున్నప్పటికీ.. వాటి కార్యకలాపాల నిర్వహణకు మానవ వనరుల అవసరం ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఫ్రెషర్స్‌ను నియమించుకుని తమ విధానాలు, సాంకేతికతలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చే అవకాశముందంటున్నారు. టైర్-2 ఇన్‌స్టిట్యూట్స్‌కు చెందిన విద్యార్థులు మాత్రం ఉద్యోగ సాధనలో క్యాంపస్ డ్రైవ్స్‌పైనే ఆశలు పెట్టుకోకుండా.. స్వీయ అన్వేషణ దిశగానూ అడుగులు వేయాలని సూచిస్తున్నారు. సంస్థలు కోరుకుంటున్న కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ వంటి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుని.. జాబ్ మార్కెట్‌లో పోటీకి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
చదవండి: Pre-placement offers at IITs: ఐఐటీల్లో.. పీపీఓలు అదరహో!
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. ముఖ్యాంశాలు
- ఐఐటీలు, నిట్‌ల్లో 2023 బ్యాచ్‌కు ముగిసిన తొలి దశ క్యాంపస్ డ్రైవ్స్
- ఐఐటీ-ఢిల్లీలో రూ.4 కోట్ల గరిష్ట వార్షిక వేతనంతో ఆఫర్.
- ప్రతి క్యాంపస్‌లోనూ గరిష్టంగా రూ.కోటికి పైగా వేతనం నమోదు
- సగటు వార్షిక వేతనం రూ.36 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నమోదు
- గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 15 నుంచి 20 శాతం పెరుగుదల
- కోడింగ్, ఏఐ-ఎంఎల్, ఐఓటీ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్న సంస్థలు.
ఇండస్ట్రీ రెడీగా ఉంటే
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సంస్థలు ఇండస్ట్రీ రెడీగా ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యం ఇచ్చాయి. అంతేకాకుండా ఇన్నోవేషన్, క్రిటికల్ థింకింగ్ వంటి ఇతర అంశాలపై దృష్టి పెట్టాయి. కాబట్టి ఇతర ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు కోర్ నాలెడ్జ్‌తోపాటు ఆయా నైపుణ్యాలను పెంచుకునేందుకు కృషి చేయాలి.
-ప్రొ'' అభినవ్ కుమార్, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, ఆఫీస్ ఆఫ్ కెరీర్ సర్వీస్, ఐఐటీ-హైదరాబాద్