Career opportunities: డేటా స్కిల్స్.. భలే డిమాండ్!
- డేటా సైన్స్ విభాగంలో విస్తృతంగా కొలువులు
- బిగ్ డేటా, డేటా సైన్స్, డేటా సెక్యూరిటీ స్కిల్స్‌కు డిమాండ్
- నైపుణ్యాలుంటే సంస్థల రెడ్ కార్పెట్ స్వాగతం!
వినియోగదారులు కోరుకుంటున్న ప్రొడక్ట్‌లు ఏంటి.. ఎలాంటి ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉంది.. సెర్చ్ ఇంజన్‌లో ఏ ప్రొడక్ట్ ముందు వరుసలో ఉంది.. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలకు ఇలాంటి డేటా అత్యంత కీలకంగా మారుతోంది. ఈ గణాంకాల ఆధారంగా సంస్థలు వ్యాపార ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అందుకే ఇలాంటి కీలక సమాచారం అందించే డేటా సైన్స్, బిగ్ డేటా, డేటా సెక్యూరిటీ నైపుణ్యాలున్న వారికి డిమాండ్ పెరుగుతోంది.
చదవండి: Data Scientist Jobs Roles, Salary: డిగ్రీ అవసరం లేకున్నా.. ఈ నైపుణ్యాలు తప్పనిసరి..
డేటా సైన్స్
ప్రస్తుతం అన్ని రంగాల్లోని సంస్థలు తమ వినియోగదారుల అభిరుచి, ఆసక్తులకు అనుగుణంగా తమ సేవలు, ఉత్పత్తులను అందించాలని ప్రయత్నిస్తున్నాయి. ఉత్పత్తులు, సేవలకు సంబంధించి అందుబాటులో ఉన్న లేదా సేకరించిన సమాచారాన్ని.. గణాంక సహితంగా కంపెనీలకు అవసరమైన రీతిలో తీర్చిదిద్దడమే డేటా సైన్స్ అని చెప్పొచ్చు. ఈ కార్యకలాపాలను సజావుగా నిర్వహించే విభాగమే.. డేటా సైన్స్ విభాగంగా పేర్కొంటున్నారు. డేటా సైన్స్ నిపుణులు సమాచార సేకరణ, విశ్లేషణ మాత్రమే కాకుండా.. సంస్థలోని ఇతర విభాగాలతో సమ్మిళితంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్టాటిస్టిక్స్, అల్గారిథమ్స్, డేటా అనాలిసిస్, మెషీన్ లెర్నింగ్, కోడింగ్, ప్రోగ్రామింగ్ విభాగాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఒక ఉత్పత్తి లేదా సేవకు సంబంధించి సంస్థ సరైన నిర్ణయం తీసుకునేలా ఉపయుక్త సమాచారాన్ని సిద్ధం చేసే విభాగమే.. డేటా సైన్స్! దీని ఆధారంగా సంస్థలు భవిష్యత్తు వ్యాపార, మార్కెటింగ్ వ్యూహాలపై నిర్ణయం తీసుకుంటున్నాయి. గత కొంతకాలగా ప్రపంచవ్యాప్తంగా డేటా సైన్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. మన దేశం డేటాసైన్స్ నిపుణుల సేవల వినియోగంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. డేటా సైన్స్‌కు సంబంధించి ఉద్యోగాల పరంగా ప్రతి పది ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం భారత్‌లోనే లభిస్తోంది. ఓ తాజా జాబ్స్ రిపోర్ట్ ప్రకారం–అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న జాబ్ ప్రొఫైల్‌గా డేటా సైన్స్ నిలుస్తోంది.
బిగ్ డేటా అనలిటిక్స్
డేటా రంగంలో మరో ముఖ్యమైన విభాగం.. బిగ్ డేటా. విస్తృతంగా ఉండే బారీ డేటాను ఒక క్రమపద్ధతిలో అమర్చడం.. విశ్లేషించడం ద్వారా వినియోగదారులు ఆశిస్తున్న సేవలు, ఉత్పత్తుల గురించి నివేదికలు రూపొందించి సదరు సంస్థలోని ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ విభాగాలకు అందిస్తారు బిగ్ డేటా నిపుణులు! డేటా అనుబంధ సాంకేతికతల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్న సంస్థల్లో..అధికశాతం బిగ్ డేటా అనలిటిక్స్‌పైనే ఆధారపడుతున్నాయి. దీంతో.. బిగ్ డేటా విభాగంలో నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. బిగ్ డేటా రంగంలో అత్యంత కీలకం.. అంకెలు, గణాంకాల విశ్లేషణ. అందుకే కంపెనీలు.. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు ఆఫర్స్ ఇస్తున్నాయి. కంప్యుటేషనల్, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్న వారికి బిగ్ డేటా అనలిటిక్స్‌లో ఉద్యోగాలు లభించే వీలుంది. మ్యాథ్స్, సైన్స్ విభాగాల విద్యార్థులకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణుల అభిప్రాయం. బిగ్‌డేటా అనాలిసిస్, మేనేజ్‌మెంట్ పరంగా ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా తర్వాత భారత్ నిలుస్తోంది. ముఖ్యంగా స్టార్ట్–అప్, ఈ–కామర్స్ సంస్థలలో బిగ్ డేటా నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
చదవండి: Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్ గ్యారెంటీ!
డేటా సెక్యూరిటీ
డేటా సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్న మరో విభాగం.. డేటా సెక్యూరిటీ. తమ డేటా భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో సేవలు అందించే సంస్థలు తమ డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. క్లయింట్ సంస్థలు, వారి యూజర్లకు సంబంధించిన వివరాలు, అదే విధంగా తాము వారికి అందిస్తున్న సర్వీసులకు సంబంధించిన డేటాను భద్రంగా నిక్షిప్తం చేసుకోవాల్సి ఉంటుంది. డేటా వివరాలను పటిష్టంగా నిర్వహించడం, ఏ స్థాయిలోనూ డేటాను ఇతరులు యాక్సెస్ కాకుండా చూసే విభాగం.. డేటా సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీలో ఒక విభాగంగా డేటా సెక్యూరిటీని సంస్థలు పరిగణిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలు నేర్చుకున్న వారు డేటా సెక్యూరిటీ సంబంధిత అంశాలపై ప్రత్యేక దృష్టి పెడితే.. ఈ విభాగంలో కొలువులు సొంతం చేసుకోవచ్చు. డేటా సెక్యూరిటీ నిపుణులకు.. ఇంటర్నెట్, డేటా ఇన్ఫర్మేషన్, దాని ప్రాధాన్యతకు సంబంధించి స్పష్టత ఉండాలి. డిగ్రీ విద్యార్థులు సైతం సైబర్ సెక్యూరిటీ సంబంధిత కోర్సుల్లో అడుగు పెట్టి.. ఇంటర్నెట్, డేటా మేనేజ్‌మెంట్/ఇన్ఫర్మేషన్, ఎథికల్ హ్యాకింగ్ తదితర అంశాల్లో పట్టు సాధిస్తే.. ఈ విభాగంలో కొలువు దక్కించుకోవచ్చు.
డిమాండింగ్ స్కిల్స్ ఇవే
- డేటా సంబంధిత విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవడానికి.. మెషీన్ లెర్నింగ్, ఆర్, పైథాన్, హడూప్, ఎస్‌క్యూఎల్ వంటి లాంగ్వేజ్ స్కిల్స్ కీలకంగా నిలుస్తున్నాయి. అదే విధంగా మ్యాథమెటిక్స్, కంప్యుటేషన్, స్టాటిస్టిక్స్‌పై అవగాహన ఉంటే.. మరింత వేగంగా రాణించే అవకాశం ఉంటుంది.
- బిగ్ డేటా విభాగంలో రాణించడానికి ప్రాథమికంగా మ్యాథ్స్, సైన్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ నేపథ్యం అవసరం. దీంతోపాటు ఈ విభాగంలో మరింత మెరుగైన నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్–స్ట్రక్చర్డ్ పేరిట ఉండే డేటా విశ్లేషణలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. వీటికోసం హడూప్ టెక్నాలజీ; జావా; పైథాన్; ఎస్‌ఏఎస్; రూబీ డెవలపర్ వంటి కోర్సులు నేర్చుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.
చదవండి: Best Certification Courses: సర్టిఫికేషన్స్‌తో.. కెరీర్ షైన్!
సర్టిఫికేషన్ కోర్సులు
డేటా సైన్స్, బిగ్ డేటా, డేటా సెక్యూరిటీ విభాగాల్లో నైపుణ్యాల కోసం పలు సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా డేటా మైనింగ్, స్టాటిస్టికల్ టూల్స్, కోడింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి వాటిపై అవగాహన పెంచుకోవచ్చు. మూక్స్ విధానంలో ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులను పూర్తి చేసే వీలుంది.
అకడమిక్ కోర్సులు
ప్రస్తుతం డేటా సైన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పలు ఇన్‌స్టిట్యూట్‌లు బ్యాచిలర్ స్థాయిలోనే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా సబ్జెక్ట్‌లతో కోర్సులను అందిస్తున్నాయి. బీఎస్‌సీ, బీకాంలో డేటా అనలిటిక్స్ గ్రూప్‌ను ప్రవేశ పెడుతున్నాయి. దీంతోపాటు..జావా, పైథాన్, ఆర్, ఎస్‌క్యూఎల్ వంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ద్వారా డేటా సైన్స్ ఉద్యోగాలకు సిద్ధం కావొచ్చు. అదే విధంగా కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు బిగ్ డేటా, డేటా అనలిటిక్స్‌లో సర్టిఫికేషన్స్ పూర్తి చేయడం ద్వారా కొలువుల అన్వేషణ సాగించొచ్చు. పీజీ స్థాయిలో ఎంబీఏలో డేటాసైన్స్ లేదా మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్ స్పెషలైజేషన్స్ పూర్తి చేసిన విద్యార్థులు సులువుగా ఈ విభాగంలో కొలువుదీరొచ్చు.
చదవండి: Full Stack Developer: ఈ టూల్స్ నేర్చుకుంటే ఫుల్ డిమాండ్... అర్హతలేంటంటే
జాబ్ ప్రొఫైల్స్
డేటా విభాగానికి సంబంధించిన నైపుణ్యాలు సొంతం చేసుకుంటే..డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, స్టాటిస్టిషియన్, మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా అనలిస్ట్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, గ్రిడ్ కంప్యూటింగ్ ఇంజనీర్స్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
ఆకర్షణీయ వేతనాలు
డేటా సంబంధిత విభాగాల్లో ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ఆయా హోదాలను బట్టి కనిష్టంగా రూ.5లక్షలు, గరిష్టంగా రూ.8లక్షల వార్షిక వేతనాలు అందుకునే వీలుంది. ఫ్రెషర్స్‌కు సగటున రూ.నాలుగు లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.