Education Loans for Students: ఉన్నత విద్యకు ఊతంగా విద్యా రుణాలు.. ఈ అర్హులకు మాత్రమే!
ఎంతో ప్రతిభ ఉన్నా.. రూ.లక్షల్లో ఫీజులు కట్టలేక అడ్మిషన్ వదులుకుంటున్నారు. ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నాయి బ్యాంకుల ఎడ్యుకేషన్ లోన్స్! 2024–25 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. విద్యారుణాలపై ప్రత్యేక కథనం..
ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రముఖ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో చేరాలంటే.. ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.లక్షన్నరకుపైగా ఫీజు ఉంది. జాతీయ స్థాయిలో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ ఐఐటీల్లో సెమిస్టర్‌కు రూ.లక్ష వరకు; ఎన్‌ఐటీల్లో సెమిస్టర్‌కు రూ.65 వేల నుంచి రూ.70 వేలు వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. మేనేజ్‌మెంట్ విద్యకు సంబంధించి దేశంలోని ప్రముఖ బీస్కూల్స్ ఐఐఎంల్లో ఎంబీఏ ప్రోగ్రామ్‌కు రూ.20 లక్షలకు పైగానే ఫీజు ఉంది.
Skill Training: నైపుణ్య శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
సంప్రదాయ డిగ్రీ కోర్సులకు కూడా పేరున్న కాలేజీలో రూ.50 వేల వరకు ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఇక విదేశీ విద్యకు సగటున ఏడాదికి రూ.50 లక్షల వరకు వ్యయం అవుతోంది. ఇలా లక్షల్లో ఉన్న ఫీజులు చెల్లించలేక ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు బ్యాంకులు చేయూతనందిస్తున్నాయి. విద్యారుణాలు మంజూరు చేస్తూ వారి ఉన్నత విద్యకు సహకరిస్తున్నాయి.
Badi Bata Programme: బడికి చలో.. ’బడిబాట’ పట్టిన ఉపాధ్యాయులు...
అర్హతలు
ఎంట్రన్స్ టెస్టులో ఉత్తీర్ణత సాధించి కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థులకే విద్యా రుణ దరఖాస్తుకు బ్యాంకులు అర్హత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు ఎంట్రన్స్‌లో మెరిట్ పొందిన వారికే విద్యా రుణ మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నాయి. పలు ప్రైవేట్ బ్యాంకులు మాత్రం మేనేజ్‌మెంట్ కోటాలో ప్రవేశం పొందిన వారికి కూడా విద్యా రుణ దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఆయా బ్యాంకులు తమ అంతర్గత విధి విధానాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి.
గుర్తింపు తప్పనిసరి
విద్యా రుణాలను మంజూరుకు బ్యాంకులు నిర్దిష్ట నిబంధనలను అనుసరిస్తున్నాయి. ఏఐసీటీఈ, యూజీసీ, విద్యాశాఖ గుర్తింపు ఉన్న కళాశాలలు, కోర్సులనే విద్యా రుణ మంజూరులో పరిగణనలోకి తీసుకుంటున్నాయి. గుర్తింపున్న ఇన్‌స్టిట్యూట్‌లలో, కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకే విద్యా రుణం కోసం దరఖాస్తుకు అర్హత కల్పిస్తున్నాయి.
School Admissions: విద్యార్థి ‘ప్రైవేటు’ బాట..! ఈ తరగతి నుంచే చేరికలు ఏక్కువ..
విదేశీ విద్యకు సైతం
విదేశీ విద్య అభ్యర్థులు కూడా విద్యారుణాలు పొందే అవకాశం ఉంది. దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.పది లక్షల వరకూ రణం లభిస్తోంది. అదేవిధంగా విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ లభించిన వారికి గరిష్టంగా రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నారు.
మూడు శ్లాబ్‌లు
- ఎడ్యుకేషన్ లోన్స్ మంజూరుకు బ్యాంకులు మూడు శ్లాబ్‌ల విధానాన్ని అమలు చేస్తున్నాయి.
- శ్లాబ్–1లో.. రూ.4 లక్షల రుణ మొత్తంగా నిర్ణయించారు. ఈ శ్లాబ్‌లో రుణ మంజూరుకు విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వక్కర్లేదు.
- శ్లాబ్–2లో.. రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల హామీ, థర్డ్ పార్టీ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
- శ్లాబ్–3లో.. రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తం ఉంటోంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే ఈ మొత్తానికి సరిపడే కొల్లేటరల్ సెక్యూరిటీ (స్తిరాస్థి పత్రాలను) చూపాల్సి ఉంటుంది.
Telangana Sports School: స్పోర్ట్స్ స్కూల్‌లో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం
మార్జిన్ మనీ
విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని మార్జిన్ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రూ.4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు. కాని రూ.4 లక్షలు దాటితే మాత్రం స్వదేశంలో చదివే విద్యార్థులు అయిదు శాతం, విదేశీ విద్య విద్యార్థులు 15 శాతం మార్జిన్ మనీని సమకూర్చుకోవాలి.
రుణం.. ఈ వ్యయాలకే
కోర్సు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఎగ్జామినేషన్/లైబ్రరీ/లేబొరేటరీ ఫీజు, విదేశీ విద్య ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకడమిక్ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చు, కంప్యూటర్ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్, ఇన్‌స్టిట్యూట్‌లు వసూలు చేసే కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, రిఫండబుల్ డిపాజిట్‌లకు సంబంధించిన వ్యయాలకు విద్యా రుణాలు మంజూరు చేస్తున్నారు.
టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌కు మినహాయింపు
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం–గరిష్ట రుణ మొత్తం మంజూరులో నిర్దిష్ట నిబంధనలు ఉన్నప్పటికీ.. విద్యార్థులు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందితే గరిష్ట రుణ మొత్తాన్ని పెంచే విచక్షణాధికారం బ్యాంకులకు కల్పించింది. ఉదాహరణకు ఐఐఎంలు, ఐఐటీల వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో రూ.పది లక్షల కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి గరిష్ట రుణం విషయంలో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది.
Teachers Seniority List: ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా
నిరంతర సమీక్ష
విద్యా రుణం మంజూరు చేసిన బ్యాంకులు.. వాటిని విడతల వారీగా ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌కు నేరుగా చెల్లిస్తాయి. తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించి ఉంటే.. సంబంధిత రశీదుల ఆధారంగా తొలిదశ ఫీజును విద్యార్థికి అందిస్తాయి. ఆ తర్వాత నుంచి ఇన్‌స్టిట్యూట్‌కు నేరుగా పంపుతాయి. అంతకుముందు సంవత్సరంలో సదరు విద్యార్థి అకడెమిక్‌గా చూపిన ప్రతిభ గురించి సమీక్ష చేస్తున్నాయి. దీని ఆధారంగా మిగతా రుణం చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటున్నాయి.
రీ పేమెంట్ హాలిడే
ఎడ్యుకేషన్ లోన్ తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు రీ పేమెంట్ హాలిడే పేరుతో వెసులుబాటు కల్పిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసుకున్న సంవత్సరం తర్వాత లేదా ఉద్యోగం లభించినప్పటి నుంచి వాయిదాల పద్ధతిలో రుణం తిరిగి చెల్లించే అవకాశం ఉంది. ఇలా గరిష్టంగా 15 ఏళ్ల వ్యవధిలో ఈఎంఐ విధానంలో రుణం చెల్లించొచ్చు. మహిళా విద్యార్థులకు వడ్డీ రేట్లలో 0.5 శాతం నుంచి ఒక శాతం వరకు రాయితీ ఇస్తున్నాయి.
పూర్తి అవగాహన
ఎడ్యుకేషన్ లోన్స్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునే విద్యార్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఆయా బ్యాంకుల నిబంధనలు, వడ్డీ రేట్లపై స్పష్టత ఏర్పరచుకోవాలి. దీంతోపాటు రీపేమెంట్ విధానం గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా తమకు ప్రవేశం ఖరారు చేసిన ఇన్‌స్టిట్యూట్‌కు ఏఐసీటీఈ, యూజీసీ తదితర నియంత్రణ సంస్థల గుర్తింపు గురించి వాకబుచేయాలి.
Posts at IBPS-RRB: ఐబీపీఎస్–ఆర్‌ఆర్‌బీల్లో ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..!
దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు
- ప్రవేశ ధ్రువీకరణ పత్రం, అకడమిక్ అర్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు; తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ; తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు; బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్స్; నివాస ధ్రువీకరణ; థర్డ్‌పార్టీ ఆదాయ ధ్రువీకరణ; కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి అధీకృత లెటర్స్.
- వివరాలకు వెబ్‌సైట్: www.iba.org.in
విద్యా లక్ష్మి పోర్టల్
ఎడ్యుకేషన్ లోన్స్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. విద్యా లక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో లాగిన్ అయి.. కామన్ ఎడ్యుకేషనల్ లోన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్టంగా మూడు బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను.. ప్రాథమ్యంగా పేర్కొన్న బ్యాంకులకు పంపిస్తారు. ఆ తర్వాత దశలో సదరు బ్యాంకులు దరఖాస్తును పరిశీలించి సంతృప్తి చెందితే.. ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు పంపుతాయి. విద్యాలక్ష్మి పోర్టల్ విద్యా రుణాల విషయంలో విద్యార్థులకు, బ్యాంకులకు అనుసంధానకర్తగా ఉంటోంది.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.vidyalakshmi.co.in