ఉద్యోగావకాశాలు వదులుకోవద్దు
స్థానిక ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శుక్రవారం వరికూటి అశోక్‌బాబు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సీడాప్ సంయుక్తంగా జాబ్‌మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరికూటి మాట్లాడుతూ.. అందివచ్చిన ఉద్యోగావకాశాలను వదులుకోవద్దని, కుటుంబ సభ్యులకు భారంగా మారకుండా సొంతగా జీవితంలో పైకెదగాలని నిరుద్యోగ యువతకు ఉద్బోధించారు. ఉద్యోగం చేస్తున్న సంస్థ ఉన్నతికి దోహదపడేలా పనిచేస్తే, వారు మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
15 కార్పొరేట్ కంపెనీలు పాల్గొన్న ఈ జాబ్ మేళాకు 308 మంది హాజరయ్యారు. వీరిలో 132 మంది ఎంపికని చేశారు. 35 మందికి తుది ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్.లోకనాథం తెలిపారు. జిల్లా టూరిజం శాఖ అధికారి బెన్‌హర్, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి టి.భరద్వాజ్, ఎంపీడీఓ షేక్ జమీఉల్లా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాకా పిచ్చిరెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ తన్నీరు సుబ్బారావు, షేక్ సలీంబాషా, వివిధ కంపెనీల హెచ్‌ఆర్‌లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.