Skip to main content

Degree Eligible For Jobs 2024 : డిగ్రీతోనే ఉద్యోగం.. తొలిసారిగా 18000 మందికి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ప్లేస్‌మెంట్ల లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. డిగ్రీతో పాటు జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు(జేకేసీ), నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను పొందుతుండటంతో డిగ్రీ చివరి ఏడాదిలోనే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు.
 Government College Graduates Shine in Placements    Final Year Degree Students Secure Jobs Through Skill Training Initiatives   Jobs   Skill Training for Degree Students Leads to Successful Placements

2022–23 విద్యా సంవత్సరంలో ఏకంగా 539 జాబ్‌ డ్రైవ్‌ల ద్వారా చరిత్రలో తొలిసారిగా 18 వేల మంది విద్యార్థులు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పొందడం విశేషం. గతంలో విద్యార్థులకు తరగతి గది పాఠ్యాంశాలు మాత్రమే అందేవి. బయట ఉద్యోగాలకు వెళితే నైపుణ్యాలు లేవన్న కారణంతో పరిశ్రమలు తిరిస్కరించేవి. కానీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి అయ్యాక ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. బీటెక్‌ వంటి ప్రొఫెషనల్‌ విద్యలోనే కాకుండా నాన్‌–ప్రొఫెషనల్‌ డిగ్రీల్లోనూ 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ఫలితంగా డిగ్రీ చదువుతున్న సమయంలోనే విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు.

☛ APPSC Jobs Notification 2024: గ్రూప్‌–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం

ఒకేసారి దాదాపు 30 వేల ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా..
దేశంలోనే నాలెడ్జ్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రతి విద్యార్థినిని ‘జాబ్‌ రెడీనెస్‌’ ఓరియెంటేషన్‌తోనే సన్నద్ధం చేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లేస్‌మెంట్‌ సెల్‌ ద్వారా 17 రంగాల్లో నైపుణ్యాలు అందించేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రబ్బర్‌ అండ్‌ పెట్రోలియం కెమికల్స్, ఫుడ్‌ ప్రొసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టూరిజం–హాస్పిటాలి­టీ, క్యాపిటల్‌ గూడ్స్, మేనేజ్‌మెంట్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్, గ్రీన్‌జాబ్స్, రిటైల్‌ సెక్టార్‌ వంటి రంగాల్లో మార్కెట్‌ ఓరియెంటెడ్‌ స్కిల్స్‌ను పెంపొందిస్తూనే ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. సుమారు 500 కంపెనీలను సమన్వయం చేస్తూ ఒకేసారి దాదాపు 30 వేల ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. కళాశాల విద్యాశాఖ ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌­ను, యాప్‌ను తయారు చేసింది. 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను 21 క్లస్టర్లుగా విభజించి ప్లేస్‌­మెంట్‌ డ్రైవ్‌లు కొనసాగిస్తోంది. ఎంపిక చేసిన కళాశాలల్లో నోడల్‌ రిసోర్స్‌ సెంటర్ల పేరుతో ప్లేస్‌మెంట్‌ సెల్‌లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మొదటి రెండేళ్లు విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తోంది. మార్కెట్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘నైపుణ్యాల పెంపు’ సర్టిఫికేషన్‌ కోర్సులు అందిస్తోంది. 

గడిచిన రెండేళ్లలో 2,000 మంది విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్‌ అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌లను పూర్తి చేశారు. మరో 2,500 మంది అధ్యాపకులు, విద్యార్థులు సిస్కో ఎడ్యూస్కిల్‌ కోర్సులు, 7,700 మంది ఐఐటీ ముంబయి సహకారంతో స్పోకెన్‌ ట్యూటోరియల్స్‌ కోర్సుల ద్వారా నైపుణ్యాలను పెంచుకున్నారు.  

ప్రతిష్టాత్మక సంస్థల్లో.. 
విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఎక్కడికో వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి కల్పిస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది కెమికల్‌ ఇండస్ట్రీలో డాక్టర్‌ రెడ్డీస్, హెటిరో, అరబిందో, డెక్కన్‌గ్రూప్, రిటైల్‌ విభాగంలో ఫ్లిప్‌కార్ట్, డీమార్ట్, ఈ–కామ్‌ ఎక్స్‌ప్రెస్, అమెజాన్, జాయలుక్కాస్, ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ లైఫ్, స్టార్టెక్‌ హెల్త్‌తో పాటు ఫార్మాలో అపోలో, మెడ్‌ప్లస్, బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీలో ఎఫ్‌ట్రానిక్స్, టెక్బియం, హెచ్‌1హెచ్‌ఆర్‌తో పాటు ట్రాన్స్‌పోర్టు, మీడియా, ఎడ్యుటెక్, ఫైనాన్స్‌ రంగాల్లో అనేక కంపెనీలు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొన్నాయి. ఇవి కాకుండా హెచ్‌సీఎల్, టీసీఎస్, డెలాయిట్, స్టేట్‌స్ట్రీట్‌ వంటి సంస్థల్లోనూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. 

విద్యతో పాటే ఉద్యోగం ఇలా.. : పోలా భాస్కర్, కమిషనర్, కళాశాల విద్య  
విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చింది. తరగతి బోధనతో పాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్, ఎనలిటికల్‌ థింకింగ్‌ పెంపొందించేలా చర్యలు చేపట్టాం. కళాశాలల్లో ప్లేస్‌మెంట్‌ సెల్స్‌ ఏర్పాటు చేసి ఏటా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ఉపాధిని చూపుతున్నాం. గతేడాది ఆగస్టు వరకు వివిధ ప్రదేశాల్లో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లు నిర్వహించాం. సుమారు 18 వేల మందికి పైగా వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 22 Jan 2024 01:32PM

Photo Stories