Skip to main content

Inspirational Story: క‌ర్ర‌ల‌తో ప్రాక్టీస్... క‌టింగ్ చేస్తూ ఎదిగాడు.. ఇప్పుడు ఆస్కార్ వేదిక‌పై వెలుగొందుతున్న రాహుల్ ప్ర‌స్థానం సాగిందిలా

ధూల్ పేట్‌లో పుట్టిన కుర్రాడు.. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఉన్న ఇష్టంతో గిన్నెలపై గరిటెలతో వాయిస్తూ సాంగ్స్‌ పాడేవాడు. అలా ప్రాక్టీస్‌ చేస్తూనే మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్‌ షాప్‌లో పనిచేశాడు. తన సింగింగ్‌ టాలెంట్‌తో శ్రోతలను మైమరిపించేవాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.
Singer Rahul Sipligunj

అలా మొదలైన అతని ప్రయాణం ఈరోజు ఆస్కార్‌ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా ఎదిగాడు.. అతడే రాహుల్ సిప్లిగంజ్. ధూల్ పేట్ టూ లాస్ ఎంజిల్స్ వరకు సాగిన అతడి ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ప‌డిలేచిన కెర‌టంలా రాహుల్‌ విజయ ప్రస్థానం ఇలా....

చ‌ద‌వండి: స్కూల్ అంటేనే బోర్‌... క్రికెటే ఎక్కువ ఆడేవాడిని.. స‌త్య నాదెళ్ల​​​​​​​
ఏడేళ్ల పాటు శిక్ష‌ణ‌...

రాహుల్ సిప్లిగంజ్ బార్బర్ షాప్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు ప్రపంచంలో అత్యున్నత వేదిక ఆస్కార్ వరకు చేరుకున్నాడు. 1989 ఆగస్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో జన్మించిన రాహుల్‌కు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేది. స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలపై కర్రలతో వాయిస్తూ ఫోక్‌సాంగ్స్‌ పాడేవాడు. ఇది గమనించిన రాహుల్‌ తండ్రి, ఆయనకి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్ లో సాయం చేసేవాడు. సుమారు 7 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకొని గజల్స్‌పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే కోరస్‌ పాడే అవకాశాలు తలుపుతట్టాయి.

చ‌ద‌వండి: నెల‌కు కోటి రూపాయ‌ల సంపాద‌న‌.. 11 ఏళ్ల ఆ చిన్నారి ఐడియాకు ఫిదా
తొలిసారి జోష్ మూవీలో.... 

ఈ నేపథ్యంలో తొలిసారిగా నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్‌లో ‘కాలేజీ బుల్లోడా’ అనే సాంగ్ పాడే అవకాశం వచ్చింది. ఆ పాటకి మంచి ప్రోత్సాహం రావడంతో.. అప్పటి వరకు తను పాడిన పాటలన్ని ఒక సీడీ చేసుకొని, దాని తీసుకోని వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించాడు. రాహుల్ ప్రతిభను చూసిన కీరవాణి అతనికి  దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ అనే టైటిల్‌  సాంగ్ ను పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘ఈగ’లో ఈగ ఈగ ఈగ, రచ్చలో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో బోనాలు ఇలా పలు సినిమాల్లో సింగర్‌గా రాహుల్‌ అవకాశాలు దక్కించుకున్నాడు.
బిగ్‌బాస్‌తో యూత్‌లో క్రేజ్‌...
ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్‌ రూపొందించాడు. మంగమ్మ, పూర్ బాయ్, మాకి కిరికిరి', 'గ‌ల్లీ కా గ‌ణేష్‌', 'దావ‌త్'.. ఇలా హైద‌రాబాదీ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు త‌న జోష్ మిక్స్ చేసి రాహుల్ పాట‌లు కంపోజ్ చేశాడు. ఇదిలా ఉంటే 2019లో తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని యూత్‌లో మంచి క్రేజ్‌ దక్కించుకున్నాడు. ఆ సీజన్‌ విన్నర్‌గా బయటకు వచ్చి తన జర్నీని మరింత ముందుకు తీసుకుళ్లాడు. 

చ‌ద‌వండి: పేప‌ర్‌బాయ్‌గా చేసి ప్ర‌పంచ‌మే గ‌ర్వించ‌ద‌గ్గ‌స్థాయికి చేరుకున్న తెలుగుతేజం
వివాదాల‌తో సావాసం...

గల్లీబాయ్‌ పేరుకు తగ్గట్లేగానే రాహుల్‌ పలు కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు. బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచిన కొన్ని వారాలకే ఓ పబ్‌లో జరిగిన గొడవలో రాహుల్‌పై బీరు సీసాలతో దాడి చేసిన సంఘటన అప్పట్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత కొన్నాళ్ల కింద‌ట‌ హైదరాబాద్‌లో బంజారాహిల్స్ ప్రాంతంలోని రాడిసన్ పబ్‌లో డ్రగ్స్‌ వాడారనే సమాచారంతో అర్థరాత్రి పోలీసులు జరిపిన రైడ్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌ పట్టుబడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలా వివాదాలతో సావాసం చేసిన రాహుల్‌ తనను విమర్శించినవాళ్లతోనే చప్పట్లు కొట్టించుకునేలా చేశాడు. విశ్వవేదికపై తెలుగోడి సత్తా సగర్వంగా నిరూపించాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని రాహుల్‌ పాడిన నాటునాటు సాంగ్‌ ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆ బస్తీ పోరడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. 

Published date : 13 Mar 2023 01:29PM

Photo Stories