Success Story: పేపర్‌బాయ్‌గా పని చేసి ప్రపంచమే గర్వించదగ్గస్థాయికి చేరుకున్న తెలుగుతేజం... ఈయన జీవితమే ఓ పాఠ్యాంశం..
అమ్మమ్మ చేరదీసి చదివించడంతో అమెరికాలో ఫేమస్ సైంటిస్టుల్లో ఒకరిగా ఎదిగారు. ప్రస్తుతం ‘సెంటర్ ఫర్ రీ జనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్’ డిప్యూటీ డైరెక్టర్‌గా మల్టీ డిసిప్లినరి రీసెర్చి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కడప నాగరాజుపేటకు చెందిన డాక్టర్ రావూరి సుధీర్‌కుమార్ తన జీవితంలో ఎదుర్కొన్న ఆటంకాలు, ఇబ్బందుల గురించి తెలుసుకుందాం.
చదవండి: పది నెలల పాపతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది... మీరు ఓ లుక్కేయండి
పసితనంలోనే తల్లిదండ్రుల మరణం.!
పసితనంలోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అవ్వ చల్లా కమలమ్మ అక్కున చేర్చుకుంది. ఐదవ తరగతి వరకు నాగరాజుపేట గుండాచారి బడిలో చదువుకున్నారు. విశ్రాంత ఉపాధ్యాయురాలైన అవ్వ కమలమ్మకు చదువు విలువ ఏమిటో బాగా తెలుసు. చదువే నిజమైన ఆస్తి అంటూ మనవడికి తరచూ నూరిపోసేది. అవ్వ మాటలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. గుంతకల్లు, గుత్తిలో పిన్ని ఇంట హైస్కూల్ విద్యాభ్యాసం సాగింది.
సైన్స్ పట్ల మక్కువ పెంచుకుని..!
గుత్తి రైల్వే ఇంగ్లీషు మీడియం హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆకుల నుంచి విద్యుత్ తయారవుతుందని ‘ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ’ అనే పత్రికలో చదివాడు. అందుకు జిల్లేడు, బొంత జెముడు ఆకులు పనికి వస్తాయని సుధీర్ కనుగొన్నారు. ఇలా ఆయన బయో లాజికల్ బ్యాటరీ తయారు చేశాడు. అప్పట్లో హైదరాబాదులో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రపతి వెంకట్రామన్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. సిమ్లాలో జరిగిన ఇంటర్ స్టేట్ సైన్స్ ఫెయిర్‌కు ఈ ప్రయోగం ఎంపికైంది.
వీడియో కెమెరామెన్‌గా...
ఇంటర్మీడియేట్ కడప సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో, 1994–97లో ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు. తాను ఇంకొకరికి భారం కారాదని భావించి పేపర్ బాయ్‌గా, వీడియో కెమెరామెన్‌గా కొన్నాళ్లు పనిచేశారు. గ్రూప్-4, బ్యాంకు పరీక్షలు రాశారు. బీఈడీలో ఉచిత సీటు వచ్చింది. సైంటిస్టు కావాలన్న బలమైన ఆకాంక్ష వల్ల వాటిని వదులుకున్నారు.
చదవండి: అనాథగా పెరిగి... ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్నాడు
పార్ట్ టైం అధ్యాకునిగా....
వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ వైరాలజీ ప్రవేశానికి కిశోర్ అనే స్నేహితుడు రూ. 400 సాయం చేసి దరఖాస్తు చేయించగా సీటు వచ్చింది. తన ఖర్చులు తాను సంపాదించుకోవాలని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పార్ట్ టైం అధ్యాకునిగా పనిచేశారు. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తన జుట్టు తానే కట్ చేసుకోవడం నేర్చుకున్న ఆయన ఒక సెలూన్ కూడా ప్రారంభించాలని భావించారు.
రెడ్డీస్ ల్యాబ్‌లో ఉద్యోగం...
1999లో ఎమ్మెస్సీ పూర్తయ్యాక అక్కడి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌లో ఐసీఏఆర్–ఐఏఆర్‌టీ ఫెలోషిప్ జాబ్ చేశారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకులో ఉన్న బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ)లో మోనోక్లోనల్ యాంటీ బాడీస్‌పై పనిచేశారు. వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో డయాగ్నస్టిక్స్ చేశారు. ఈ సమయంలో రెడ్డీస్ ల్యాబ్‌లో ఉద్యోగం వచ్చింది.
2006లో పేటెంట్ హక్కులు
అయితే అదే సమయంలో ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో హెచ్‌ఐవీ–1పై పనిచేసే అవకాశం తలుపు తట్టగా, దాన్నే ఎంచుకున్నారు. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తిలో రోగ నిరోధకశక్తి తగ్గిపోయి త్వరగా మరణానికి చేరువవుతాడు. అలాంటి వ్యక్తుల్లో వచ్చిన జన్యుపరమైన మార్పులను గుర్తించి దానికి తగ్గట్టు కాంబినేషన్ మందుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంపై పరిశోధన చేశారు. ఆయనకు 2006లో పీహెచ్‌డీతోపాటు పేటెంట్ హక్కులు లభించాయి.
చదవండి: పోటీ పరీక్షల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు.. తల్లీకూతుళ్లు..
అమెరికాలో పరిశోధనలు
సుధీర్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీకి పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్‌పై వెళ్లారు. రీసెర్చి అసోసియేట్‌గా తొమ్మిదేళ్లు పిట్స్‌బర్గ్‌లో ఉన్నారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, డిపార్టుమెంటు ఆఫ్ డిఫెన్స్, యూఎస్ ఒలంపిక్ అండ్ పారాలింపిక్ నేషనల్ మెడికల్ సెంటర్‌లో పరిశోధనలు చేశారు. దీంతో ఆయన పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
ఆకాంక్షతోపాటు నిరంతర కృషి అవసరం
ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి వెళ్లాలన్న ఆకాంక్ష ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టు నిరంతర కృషి ఉన్నప్పుడే లక్ష్యాన్ని అందుకోగలమని విద్యార్థులు గుర్తించాలి. ఒకప్పుడు ఏమీ లేని నేను ఇప్పుడు ఒక స్థాయి లో ఉన్నానంటే అది మా అవ్వ కమలమ్మ, బంధువులు, స్నేహితులు ఇచ్చిన సహకారమే కారణం.
-డాక్టర్ రావూరి సుధీర్‌కుమార్, నాగరాజుపేట, కడప