Telangana: బడి బాటలో పిల్లలు.. బదిలీల బాధలో టీచర్లు..ఇంతకి స్కూల్స్ జరిగేనా..?
ఈ సెలవుల సమయంలోనే జోనల్ వ్యవస్థకు సంబంధించిన బదిలీల ప్రక్రియ పూర్తికాగా.. పలు అంశాలపై విభేదిస్తూ టీచర్లు ఆందోళన బాట పట్టారు. ప్రధానోపాధ్యాయలు మల్టీజోనల్ బదిలీల్లో హేతుబద్ధత లేదంటూ కోర్టుకెళ్లగా.. స్థానికత, మరికొన్ని అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. జనవరి 31 నుంచి ఈ నిరసనలను తీవ్రతరం చేయాలని ఉపాధ్యాయ ఐక్యపోరాట కమిటీ నిర్ణయించింది.
సందేహాలు ఎన్నో..
ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్‌లో మహాధర్నాకు పిలుపునిచ్చింది. 317 జీవోలో ప్రధాన సమస్యలను పరిష్కారిస్తామని ప్రభుత్వం చెప్పినా.. ఇంతవరకు అధికారిక ఆదేశాలేవీ రాలేదు. పరస్పర బదిలీలు, ఒంటరి మహిళల ఆప్షన్లు, సీనియారిటీలో అన్యాయం వంటి పలు అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ 317 జీవో వేడి పుట్టిస్తోంది. బదిలీలను వ్యతిరేకిస్తూ లెక్చరర్లు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధనకు ఇబ్బంది ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చాలామంది విధుల్లో..
రాష్ట్రవ్యాప్తంగా 4,379 ప్రధానోపాధ్యాయుల పోస్టులుంటే.. ప్రస్తుతం 2,423 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 1,956 హెచ్‌ఎం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 45 శాతం పోస్టుల ఖాళీ ఒక సమస్య అయితే.. ప్రస్తుతం మల్టీ జోనల్ బదిలీల్లో 98 మందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. వారంతా బదిలీలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది విధుల్లో చేరలేదు కూడా.
మరికొంత ఆలస్యం పట్టే అవకాశం..
ఇక రాష్ట్రంలో మొత్తం 591 మండలాల్లో 528 మండల విద్యాధికారుల పోస్టులున్నాయి. ఇందులో 20 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. మిగతా వారంతా ఇన్‌చార్జులే. దీనికి తోడు 317 జీవో కారణంగా దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు స్థానికేతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. వారు ఇంతవరకూ క్లాసులకు హాజరవ్వలేదు. కొత్తగా విద్యార్థులను పరిచయం చేసుకుని బోధన చేయాల్సి ఉంటుంది. అందులోనూ కొందరు టీచర్లు పరస్పర బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు. వీటన్నింటితో బోధనకు మరికొంత ఆలస్యం పట్టే అవకాశం ఉంది. దీంతో విద్యా బోధన ఎలా జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటు ఏపీలో మాత్రంలో...
పాఠశాలలు మ్యాపింగ్ వల్ల పాఠశాలలు రద్దు కావడం, మూతపడటం జరగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్తారని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమంపై మూడు రోజులపాటు జరిగిన అవగాహన సదస్సులు శనివారం ముగిశాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన చివరి రోజు సదస్సుకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
పాఠశాలలు రద్దు కావని..
ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. స్కూళ్ల మ్యాపింగ్ ద్వారా ఏదో జరిగిపోతోందని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలు రద్దు కావని.. ఇప్పుడున్నవి ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్‌గా రూపాంతరం చెందుతాయన్నారు. దీనిపై అవగాహన కల్పించడానికే మూడురోజులపాటు అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులకు సదస్సులు నిర్వహించామని తెలిపారు. త్వరలోనే జిల్లాలవారీగా కూడా అధికారులు సదస్సులు నిర్వహిస్తారని చెప్పారు.
పాఠశాలల మ్యాపింగ్ తర్వాత ఎక్కడెక్కడ అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక వసతులు అవసరమో గుర్తిస్తామని వివరించారు. నాడు–నేడు పథకం కింద పనులు పూర్తి చేస్తామన్నారు. మన రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతోపాటు వారి ఆరోగ్య భద్రత కూడా చూసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఉర్దూ పాఠశాలల మ్యాపింగ్ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్ సురేష్ కుమార్, ఎస్పీడి వెట్రిసెల్వి, మౌలిక వసతుల సలహాదారు మురళి, తదితరులు పాల్గొన్నారు.
తగ్గెదేలే...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. పిల్లలకు కరోనా సోకితే ఆ స్కూల్‌ను మాత్రమే మూసివేసి తర్వాత ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.
TS High Court: కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా..?
Telangana: స్కూల్స్ సెలవులు పొడిగింపు పైనే విద్యాశాఖ దృష్టి.. ఇప్పట్లో కష్టమే..?
విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవకాశం..ఎందుకంటే..?
Telangana: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్, కాలేజీలు ప్రారంభం.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
Holidays: ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్, కాలేజీలు మూసివేత.. అలాగే పరీక్షలు వాయిదా..!
Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు
Schools: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. అయితే ఈ తరగతుల వాళ్లకు మాత్రం సెలవులే..
Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కారణం ఇదే..?
Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?
Holidays: జూనియర్ కాలేజీలకు సెలవులు
Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..