Inspire Manak Competitions : విద్యార్థుల ప్రతిభను ప్రోత్సాహించే ఇన్స్‌పైర్ మనాక్ పోటీలు.. వివరాలు నమోదు చేసేందుకు చివరి తేదీ!
రాయవరం: విద్యార్థుల చిట్టి బుర్రలలో అనేక సృజనాత్మక అంశాలు దాగి ఉంటాయి. తాము ఉంటున్న పరిసరాలు, నేర్చుకున్న విషయాలు, చూసిన సమస్యలకు పరిష్కార మార్గాలను కనిపెడుతూ ఉంటారు. అలాగే వివిధ విషయాలపై వారికున్న అవగాహన కూడా కొత్త ఆవిష్కరణలకు దారి చూపుతుంది. అయితే వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఒక వేదిక కావాలి. ఇన్నోవేషన్ ఇన్స్‌పైర్ వేడుక వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది.
Gurukul Admission Counselling : గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ముగిసింది..
ఏటా ప్రతిష్టాత్మకంగా..
కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఏటా ఇన్స్‌పైర్ అవార్డ్స్ మనాక్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఈ సరికొత్త వేదికను రూపొందించారు. దీనిలో అన్ని ప్రభుత్వ అనుబంధ విద్యాసంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా 2024 – 25 విద్యా సంవత్సరానికి ఇన్స్‌పైర్ మనాక్ పోటీలకు విద్యార్థుల నుంచి ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. దీని కోసం 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు తరగతికి ఒకరు వంతున పాఠశాలకు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే అవకాశముంది. 2008 – 09 నుంచి ఏటా నిర్వహించే ఇన్స్‌పైర్ మనాక్ పోటీలకు ప్రభుత్వ, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ల పాఠశాలల నుంచి ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు.
Degree Admissions 2024: డిగ్రీ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
ప్రాజెక్టులను పంపండిలా..
www.inspireawards&dst.gov.in వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాల లాగిన్ ద్వారా ఆగస్టు 30వ తేదీలోపు పాఠశాల విద్యార్థులు వారి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికైన ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషకం అందిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకూ తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఇన్‌స్పైర్ మనాక్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శన అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశం కూడా ఉంది. పూర్తి వివరాలకు ఆయా జిల్లాల సైన్స్ అధికారులకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.
Soumya Mishra IPS: శిక్ష కాదు.. శిక్షణ ఇచ్చాం.. అక్షర జ్ఞానం లేనివారు గోల్డ్‌మెడల్స్ సాధించారు
దరఖాస్తు చేసుకునే విధానం
తొలుత పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యను పరిష్కరించేలా ఐడియా ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి వివరాలు నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి, సంబంధిత రైటప్ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టుల ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు ప్రయోగ నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ గడువు ఉంది.
ఉమ్మడి జిల్లాలో..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో గత విద్యా సంవత్సరంలో 2,145 పాఠశాలల నుంచి 4,168 ప్రాజెక్టులు నమోదయ్యాయి. 2022 – 23 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2023 – 24 విద్యా సంవత్సరంలో 133 ప్రాజెక్టులు పెరిగాయి. ఉమ్మడి జిల్లాలలో ప్రాజెక్టులు తగ్గగా, కోనసీమ జిల్లాలో 132 పెరిగాయి. అయితే ప్రాజెక్టుల ఎంపికలో మాత్రం వెనుకబడి ఉండడం గమనార్హం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 379 ప్రాజెక్టులు ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయి. వాటిలో తూర్పుగోదావరి జిల్లాలో 78, కాకినాడ జిల్లాలో 170, కోనసీమ జిల్లాలో 131 ఉన్నాయి. ఎంపికై న ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్థుల ఖాతాలో ఈ ఏడాది జనవరి నెలాఖరుకు ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున ప్రాజెక్టు రూపకల్పనకు సొమ్ములు జమ చేశారు.
నాణ్యత లోపిస్తోందా!
ఉమ్మడి జిల్లాలో అత్యధిక ప్రాజెక్టులు రిజిస్టర్ అయినప్పటికీ ప్రాజెక్టుల రూపకల్పనలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయని, అందువల్లనే ఎంపికయ్యే ప్రాజెక్టుల సంఖ్య తక్కువగా ఉంటోందనే విమర్శలున్నాయి. ప్రాజెక్టులో సృజనాత్మకత, నాణ్యత లోపించడంతో దీనికి కారణంగా తెలుస్తుంది. 2024 – 25 విద్యా సంవత్సరానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 74 ప్రాథమికోన్నత, 236 ప్రభుత్వ, 170 ప్రైవేటు ప్రాథమికోన్నత, 157 ప్రైవేట్ ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి కనీసం మూడు, ఉన్నత పాఠశాలల నుంచి కనీసం ఐదు ప్రాజెక్టులు రూపొందించాలి.
Students Talent : విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచేలా ప్రోత్సాహించాలి..
త్వరలో ఓరియంటేషన్ తరగతులు
ఇన్‌స్పైర్ మనాక్ ప్రాజెక్టుల రూపకల్పనపై త్వరలోనే సైన్స్ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తాం. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుని బాల శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఇది చక్కటి అవకాశం. విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలకు పదును పెడితే, ఉత్తమ ప్రాజెక్టులు ఆవిష్కృతమవుతాయి.
– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
చక్కని అవకాశం
విద్యార్థులు తమలోని సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు ఇన్‌స్పైర్ మనాక్ ఒక చక్కని అవకాశం. ఈ పోటీలో విద్యార్థులందరూ పాల్గొనేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలి. జిల్లా నుంచి అత్యధికంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌లో గొప్ప శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశం లభిస్తుంది.
– ఎం.కమలకుమారి, జిల్లా విద్యాశాఖాధికారి, అమలాపురం
సైన్స్ ఉపాధ్యాయులు కీలకం
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేసేలా ప్రోత్సహించాలి. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకునేలా వారిని తీర్చిదిద్దాలి. ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో పోటీ పడేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలి.
– గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా