Department of Education: వయోజన విద్యకు శ్రీకారం
ఎన్‌ఐఎల్‌పీ (న్యూ ఇండియా లిటరపీ ప్రోగ్రాం) పేరుతో మళ్లీ వయోజన విద్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత విద్యాశాఖ సమన్వయంతో అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
వయోజన విద్య కార్యక్రమ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాలని నిర్ణయించాయి. ఈ మేరకు వయోజన విద్య, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు రావడంతో కార్యాచరణ రూపొందించారు.
గతంలో కలెక్టర్‌తో పాటు వయోజన విద్య డెప్యూటీ డైరెక్టర్‌కు చెక్ పవర్ ఉండగా ప్రస్తుతం కలెక్టర్, డీఈవో పేరున బ్యాంక్ ఖాతా లు తెరిచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 90,828 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వీరిలో మొదటి విడత కింద ఈ ఏడాది 14,979 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
చదవండి: Free Coaching for Civils: సివిల్స్ సర్వీసెస్ కోసం ఉచిత శిక్షణ.. దరఖాస్తులకు తేదీ..
ముందుగా చదవడం, రాయడం, చిన్నచిన్న లెక్కలు చేయడం నేర్పించనున్నారు. అనంతరం క్రిటికల్ లైఫ్ స్కిల్స్‌లో ఫోన్ వినియోగం, డిజిటల్ లిటరసీ నేర్పించనున్నారు. ఒకేషనల్ స్కిల్స్ ద్వారా అక్షరాస్యతతో పాటు ఆర్థిక వనరులను పొందేందుకు మార్గాలను సూచించుట, ఫౌండేషన్ స్కిల్స్ నేర్చుకొన్న వారికి ప్రాథమిక విద్య ఆపై వాటిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ ద్వారా సేకరించి ధ్రువీకరణపత్రం అందజేయనున్నారు.
కార్యక్రమం నిర్వహణలో భాగంగా గ్రామ స్థాయిలో హెచ్‌ఎంలు సూపర్‌వైజర్‌గా, ఒక ఉపాధ్యాయుడు టీచర్‌గా, మరో ఉపాధ్యాయుడు సర్వేయర్‌గా విధులు నిర్వహించనున్నారు. ఎప్పటికప్పుడు ఉల్లాస్ యాప్‌లో నమోదు చేయనున్నారు.
వలంటీర్లతో బోధన..
న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ద్వారా 15 నుంచి 50 ఏళ్లలోపు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు చదువు నేర్పనున్నారు. గతంలో సాక్షర భారత్ పథకం కింద సమన్వయకర్తలు చదువు చెప్పేవారు. కొత్తగా చేపట్టే కార్యక్రమంలో వలంటీర్లను నియమిస్తారు. వీరికి శిక్షణ సామగ్రి అందజేయనున్నారు. 2027 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
ఆదేశాలు అమలు చేస్తాం
నవభారత్ సాక్షరత కార్యక్రమానికి సంబంధించి ఆదేశాలు వచ్చాయి. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడతలో 15 నుంచి 30 ఏళ్లలోపు వారికి చదువు నేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– వంగల నాగరాజు, వయోజన విద్య ఏపీవో