Anti Ragging: ర్యాగింగ్ చేస్తే మినిమం ఏడాది జైలు... శృతి మించితే లైఫ్‌లాంగ్ చిప్పకూడే
సరదా పరిచయాలు శృతి మించి ప్రాణాల మీదకు వస్తున్నాయి. సమిసిపోయింది అనుకున్న సమస్య మళ్లీ జడలువిప్పి నాట్యం చేస్తోంది. గత కొద్ది రోజుల్లోనే ర్యాగింగ్ బారిన పడి విద్యార్థులు తనువు చాలించారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెలంగాణలో మ`తి చెందిన మెడికో ఘటనలోనూ ర్యాగింగ్ ప్రధాన కారణమని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ కి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసుకోండి.
ఇలాంటి వాటికి పాల్పడిన నేరమే
- దుస్తులపై వ్యాఖ్యానం, గుంజీలు తీయమనడం, పరుగులు పెట్టించడం, గోడ కుర్చీ వేయించడం, అసభ్యకరంగా, కించపర్చేలా మాట్లాడడం.. తదితర వేధింపులకు పాల్పడటం నేరం.
చదవండి: ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపుతాం...: విడదల రజిని
- వసతిగృహాల్లో రాత్రివేళ తమ గదులకు పిలిపించుకోవడం.. జుట్టు కత్తిరించడం.. మద్యం సీసాలు తెమ్మని పురమాయించడం.. అశ్లీలంగా వ్యవహరించమని ప్రోత్సహించడం.. దుస్తులను విప్పమని బలవంతపెట్టడం అత్యంత తీవ్రమైన అంశాలు.
- ర్యాగింగ్ వికృత క్రీడల్లో భాగస్తులైన విద్యార్థులకు నెల రోజుల పాటు వైద్యకళాశాల నుంచి సస్పెన్షన్ వేటు తప్పదు.
- ఏడిపించడం, హేళన చేయడం, ఇతర ఇబ్బందులకు గురిచేయడం లాంటివాటికి ఆరు నెలల జైలుశిక్ష ఉంటుంది.
- శారీరకంగా వేధించినా, బలప్రయోగం చేసినా ఏడాది జైలుశిక్ష విధించే అవకాశముంది.
- అడ్డుకున్నా, గాయపర్చినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తారు.
- అపహరణ, అత్యాచారం, తీవ్రంగా గాయపర్చడానికి అయిదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా ఉంటుంది.
- ర్యాగింగ్ వేధింపులతో మృతి చెందినా, ఆత్మహత్యకు కారణమైనా జీవితకాలం జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
- ర్యాగింగ్ భూతాన్ని అడ్డుకోవడంలో ప్రధాన బాధ్యత సంబంధిత వైద్యకళాశాలలదేే.
- విద్యార్థులపై వికృత చేష్టలను అదుపు చేయడంలో వైద్యకళాశాల విఫలమైందని తేలితే.. సంబంధిత కళాశాల గుర్తింపును కనీసం ఏడాది పాటు రద్దు చేస్తారు.
చదవండి: వారానికి నాలుగు రోజులే పని... ఎప్పటి నుంచి అమలు అంటే...!
ఇవి కచ్చితంగా పాటించాల్సిందే...
- జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి వైద్యకళాశాలలో ర్యాగింగ్ నిరోధక బృందాన్ని ఏర్పాటుచేయాలి.
- బాధితులు ఫిర్యాదు చేయడానికి వీలుగా ఫిర్యాదు పెట్టె, ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ వంటివి అందుబాటులో ఉంచాలి.
- కొత్త, పాత విద్యార్థుల మధ్య ప్రత్యక్షంగా పరిచయం కలిగే పరిస్థితులను కల్పించకూడదు.
- ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షకు గురవుతారనే బోర్డులను కళాశాల ఆవరణలో ప్రదర్శించాలి.
- స్థానిక పోలీసు అధికారుల మొబైల్ నంబర్లను ప్రదర్శించాలి.
- ర్యాగింగ్ బారినపడిన విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించేందుకు సైకియాట్రీ సేవలు కల్పించాలి.
- జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వుల ప్రకారం.. ర్యాగింగ్ చేయబోమని విద్యార్థి నుంచి, ఒకవేళ చేస్తే తీసుకునే కఠిన చర్యలకు కట్టుబడి ఉంటామని కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ముందస్తుగా అఫిడవిట్ స్వీకరించాలి.
- వైద్య కళాశాల, వసతిగృహాలు, భోజనశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి.