Vidadala Rajini: ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపుతాం.. విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు: విడదల రజిని
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ర్యాగింగ్ భూతం విషయంలో కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు. మెడికోలపై ఎక్కడా, ఎలాంటి వేధింపులు ఉండటానికి వీల్లేదని చెప్పారు.
చదవండి: ఈపీఎఫ్‌లో జాయింట్ ఆప్షన్ ఇచ్చారా.. అధిక పెన్షన్‌కు అర్హత ఉందా..?
సహృద్భావంతో మెలగాలి
కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తిస్థాయిలో చురుకుగా పనిచేయాలని, ర్యాగింగ్, ఇతర వేధింపులకు సంబంధించి ఆయా కళాశాలలపై నేరుగా డీఎంఈ, హెల్త్ యూనివర్సిటీ వీసీ పర్యవేక్షణ ఉండాలని విడుదల రజిని అన్నారు. కళాశాలల నుంచి ఎప్పటికప్పుడు యాంటి ర్యాగింగ్ కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ ఉండాలన్నారు. విద్యార్థులతో బోధనా సిబ్బంది సహృద్భావంతో ఉండాలన్నారు. కొంతమంది సీనియర్ అధ్యాపకులు వారి సొంత క్లినిక్‌ల నేపథ్యంలో పీజీ విద్యార్థులపై పనిభారం మోపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని, ఈ పద్ధతి మారాలని హెచ్చరించారు.
పటిష్టమైన చర్యల ద్వారానే ఫలితాలు
చదువుల్లో నాణ్యతతోపాటు, భద్రత కూడా ఉండాలని మంత్రి రజిని తెలిపారు. పటిష్టమైన చర్యల ద్వారా మనం సురక్షితంగా మెడికోలను సమాజంలోకి తీసుకురాగలమని చెప్పారు. అన్ని మెడికల్ కళాశాలల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ సెషన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఒత్తిడి నుంచి బయటపడేలా విద్యార్థులకు యోగా, ధ్యానం లాంటి అంశాలపై అవగాహన పెంచాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క మెడికల్ కళాశాలలో కూడా ఒక్క ర్యాగింగ్ కేసు కూడా నమోదు కావడానికి వీల్లేదని స్పష్టంచేశారు.
చదవండి: పుష్కలంగా వనరులు...పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం
డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాంతో ప్రజలకు మేలు
ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి మెడికల్ కళాశాల డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ను అమలు చేయాల్సి ఉందని రజిని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పీజీ విద్యార్థి మూడు నెలల పాటు కచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంతో ప్రతి మూడు నెలలకు 250 మంది చొప్పున స్పెషలిస్టు వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. పల్లెల్లో ఉండే పేద ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం దక్కుతుందన్నారు.