Degree : ఇక నాలుగేళ్లు చదివితేనే డిగ్రీ.. మూడేళ్లపాటు చదివితే..
ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. దీని విధివిధానాలను యూజీసీ సోమవారం నోటిఫై చేయనుంది.
160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే..
యూజీసీ కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ నిబంధనల ప్రకారం.. విద్యార్థులు నాలుగేళ్లు పూర్తి చేశాకే యూజీ ఆనర్స్ డిగ్రీని అందుకోగలుగుతారు. అన్ని ఆనర్స్ డిగ్రీ కోర్సుల కాలపరిమితిని మూడేళ్లకు బదులుగా నాలుగేళ్లకు తప్పనిసరి చేసింది. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్‌లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలాగే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్‌లలో 75 శాతంఅంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు యూజీ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాది పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ (ఆనర్స్ విత్ రీసెర్చ్) డిగ్రీని ప్రదానం చేస్తారు.
ఈ కొత్త నిబంధనల్లో..
ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం.. మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. వారు ఆనర్స్ కోర్సుల్లోకి మారడానికి వర్సిటీలు వారికి బ్రిడ్జ్ కోర్సులను (ఆన్‌లైన్‌తో సహా) అందించవచ్చని యూజీసీ తెలిపింది. డిగ్రీ కోర్సు నుంచి ఆనర్స్ కోర్సుల్లో చేరడానికి ఇది తప్పనిసరి అని వివరించింది.
రెండేళ్లు చదివితే..
నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సుల్లో విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం ఉంది. ఇందులో భాగంగా మొదటి ఏడాది పూర్తి చేస్తే విద్యార్థికి సర్టిఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా లభిస్తుంది. మూడేళ్లు చదివితే బ్యాచిలర్ డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్‌తో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది.ఈ మేరకు విద్యార్థులు తమ ప్రాధాన్యతలను ఎంచుకోవడానికి అనుమతిస్తారు. నాలుగేళ్ల ఆనర్స్‌లో చేరినవారు మూడేళ్లలోపు నిష్క్రమిస్తే, అప్పటి నుంచి మూడేళ్లలోపు మళ్లీ చేరేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఏడేళ్ల వ్యవధిలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ నూతన విధానం ప్రకారం..
వైవిధ్యంతో పాఠ్యాంశాలు.. నూతన కరిక్యులం ఫ్రేమ్ వర్క్ ప్రకారం..
కోర్సుల పాఠ్యాంశాలు వైవిధ్యంతో ఉంటాయి. యూజీసీ నిర్దేశించిన పాఠ్యాంశాల్లో మెయిన్, మైనర్ స్ట్రీమ్ కోర్సులు, భాషా, నైపుణ్య కోర్సులు, పర్యావరణ విద్య, డిజిటల్, సాంకేతిక పరిష్కారాలు తదితర విభాగాల కోర్సులు ఉంటాయి. కొత్తగా ఆరోగ్యం, యోగా, క్రీడలు, ఫిట్‌నెస్ వంటివాటిని కూడా చేర్చారు. ఆధునిక భారతీయ భాష, సంస్కృతి, ఆంగ్ల భాష, నైపుణ్యాల పెంపుదల, నైతిక విలువల కోర్సులు ఉంటాయి. అలాగే విద్యార్థుల ఉపాధిని పెంపొందించడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ అందించడం లక్ష్యంగా ప్రత్యేక కోర్సులనూ చేర్చారు. నూతన విధానం ప్రకారం విద్యార్థులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారొచ్చు. ఓపెన్, దూరవిద్య, ఆన్‌లైన్ లెర్నింగ్ లేదా హైబ్రిడ్ మోడ్ వంటి ప్రత్యామ్నాయ విధానాలకు కూడా మారేందుకు అవకాశముంది.