PRC: ఏ ఉద్యోగికీ జీతం తగ్గలేదు.. ప్రతి ఒక్కరి జీతం పెరిగిందిలా..
జీతాలు పెరిగాయి కాబట్టి ఆందోళనలు విరమించుకుని మంత్రుల కమిటీతో చర్చలకు రావాలన్నారు. వెలగపూడి సచివాలయంలో ఫిబ్రవరి 1వ తేదీన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల పే ఫిక్సేషన్ దాదాపు పూర్తయిందని.. డిసెంబర్, జనవరి నెలల పే స్లిప్‌లను పోల్చి చూసుకుని ఎంత జీతం పెరిగిందో తెలుసుకోవచ్చన్నారు.
ఇంకా కొంచెం పెరుగుదల..
మంగళవారం రాత్రికల్లా ఉద్యోగులందరి ఖాతాల్లో జీతాలు పడతాయని తెలిపారు. ఐఆర్ కలిసినా, కలవకపోయినా జీతాల్లో పెరుగుదల ఉందన్నారు. ఎవరి జీతం తగ్గించకూడదని సీఎం చెప్పారని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 32 గ్రేడ్ల పే స్లిప్‌లను పరిశీలిస్తే ఎవరికీ జీతం తగ్గలేదన్నారు. సాధారణంగా పీఆర్సీలో ఐఆర్ కలపరని, ఇప్పుడు దాన్ని కలిపి చూసినా కొంచెం పెరుగుదల ఉందని చెప్పారు. ఐఆర్ తీసేసి పీఆర్సీ టు పీఆర్సీ చూస్తే ఇంకా కొంచెం పెరుగుదల ఎక్కువ ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎస్ ఇంకా ఏమన్నారంటే..
ప్రభుత్వ ఉద్యోగులు శ్రీనివాసరావు, ఎల్. సత్యనారాయణల నూతన పే స్లిప్‌లు
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం..
► రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత 3, 4 సంవత్సరాలుగా ఇబ్బందికరంగా ఉంది. రూ.60 వేల కోట్ల ఆదాయం తగ్గింది. ప్రతి సంవత్సరం 15 శాతం పెరుగుదల ఉండాలి. కానీ కోవిడ్ వల్ల ఆదాయం పెరగలేదు. గత మూడేళ్లలో రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయాం. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ సిఫారసులు చేశాం.
► అయినా 23 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. పీఆర్సీకి మించి ఉద్యోగులకు మేలు జరిగింది. రిటైర్‌మెంట్ వయసు రెండేళ్ల పెంపుదల, ఎంఐజీ ఇళ్లలో 20 శాతం రాయితీ వంటివి పీఆర్సీకి సంబంధం లేకపోయినా సీఎం ఇచ్చారు.
► ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. అందువల్ల సమ్మె ఆలోచన విరమించుకోవాలి. సమ్మె వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో అన్ని అంశాలపైనా చర్చించాలి. ప్రభుత్వం ఉద్యోగుల వెంటే ఉంది. కావున పరస్పర చర్చల ద్వారానే అన్ని అంశాలు పరిష్కారం అవుతాయి.
హెచ్‌ఆర్‌ఏ సహా అన్ని..
► ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలతో ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ ఇంకా క్షీణించే అవకాశం ఉంది. హెచ్‌ఆర్‌ఏ సహా అన్ని అంశాలపైనా సామారస్యంగా మాట్లాడుకుందాం.
► ఉద్యోగులతో సంబంధం లేని వ్యక్తులు ఈ అంశాన్ని హైజాక్ చేస్తున్నారు. ఎంత వరకు చేయాలో అంత వరకు ఉద్యోగులకు మేలు చేయాలని సీఎం చెప్పారు. ఉద్యోగుల సమ్మెపై హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. కొత్త పీఆర్సీ అమలుకు గతంలో 6 నెలల సమయం పట్టేది. ఇప్పుడు కేవలం 6 రోజుల్లో చేశాం.
వారి ఖాతాల్లో జీతం..
మన ఉద్యోగులందరిదీ ఒకే కుటుంబం. కొత్త పీఆర్సీ అమలు కోసం డీడీఓలు, ఎస్‌టీఓలు, డీటీఓలు, డీడీలు, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు చాలా సహకరించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, ఆశావర్కర్లు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జీతాలు వారి ఖాతాల్లో వేశాం. 3.3 లక్షల మంది పెన్షనర్ల ఖాతాల్లో పింఛను జమ అయింది. 3.97 లక్షల మంది ఉద్యోగులకు పే ఫిక్సేషన్ చేశాం. వారి ఖాతాల్లో జీతం పడింది. ప్రతి ఉద్యోగికి వారి జీతం వివరాలు పంపాం. అంతే కాకుండా 94,827 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించాం. 3,68,545 మంది పెన్షనర్లకు జీతాలు వేశాం.
– ఎస్‌ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి
ప్రతి ఒక్కరి జీతం పెరిగిందిలా..
ప్రతి ఉద్యోగికి పాత పీఆర్సీ ప్రకారం డిసెంబర్ నెల జీతం ఎంత వచ్చింది.. కొత్త పీఆర్సీ ప్రకారం జీతం ఎంత వచ్చిందో పే స్లిప్‌లో వివరంగా ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో డిప్యుటేషన్‌పై కార్యదర్శి హోదాలో పని చేస్తున్న శ్రీనివాసరావు గ్రాస్ జీతం డిసెంబర్‌లో రూ.199,685 ఉండగా, కొత్త పీఆర్సీ ప్రకారం రూ.2.32 లక్షలు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ సచివాలయంలో పనిచేసే సహాయ సెక్షన్ అధికారి వి శ్రీనివాసులుకు డిసెంబర్‌లో రూ.50,044 గ్రాస్ జీతం ఉంటే, జనవరి గ్రాస్ జీతం రూ.57,618 వచ్చింది. డిసెంబర్‌లో ఇతని బేసిక్ పే రూ.27,360 ఉండగా, జనవరిలో అది రూ.42,140కి పెరిగింది. డిసెంబర్‌లో హెచ్‌ఆర్‌ఏ రూ.5,472 ఉండగా జనవరిలో రూ.6,742 ఉంది. ఆయన నికర జీతం డిసెంబర్‌లో రూ.43,855 కాగా, జనవరిలో రూ.50,075కు పెరిగింది. జల వనరుల శాఖలో ఏఈఈగా పని చేస్తున్న లావు సీతారామయ్య డిసెంబర్ గ్రాస్ రూ.91,181 కాగా, జనవరిలో రూ.99,038కు పెరిగింది. ఐఆర్ మినహాయించి చూస్తే రూ.20,635 పెరిగింది. పోలీసు శాఖలో ఆర్‌ఎస్‌ఐగా పని చేస్తున్న బి వెంకటరమణ డిసెంబర్ గ్రాస్ జీతం రూ.1,31,924 కాగా, జనవరిలో గ్రాస్ రూ.1,48,063కి పెరిగింది. ఐఆర్ మినహాయించి చూస్తే ఆయన జీతం రూ.34,048 పెరిగింది. 32 గ్రేడ్ల ఉద్యోగులు, అధికారుల్లో ప్రతి ఒక్కరి జీతం పెరిగింది.
– శశిభూషణ్‌కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి
AP High Court: జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు.. ?
AP High Court: పీఆర్సీపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh: పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం.. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో..
Good News: పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన..గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం..
Andhra Pradesh: ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు.. ప్రతి ఉద్యోగి వారి జీతాల పెరుగుదలను తెలుసుకునేలా..